ఐవీఎఫ్: భర్తలు లేకుండానే తల్లులవుతున్న ఒంటరి మహిళలు

గర్భం

ఫొటో సోర్స్, iStock

ఇటీవలి కాలంలో చాలామంది ఒంటరి మహిళలు తల్లి కావాలనే తమ కోరికను నిజం చేసుకునేందుకు ఇతరుల వీర్యంపై ఆధారపడుతున్నారు. బ్రిటన్‌లో ఈ సంస్కృతి మరింత విస్తరిస్తోంది.

గుర్తు తెలియని వ్యక్తి వీర్యం ద్వారా ‘ఐవీఎఫ్’ పద్ధతిలో బిడ్డను కన్న అనేక మంది మహిళల్లో ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన పాలీ కెర్ ఒకరు. ఈ ఏడాది మొదట్లో దాత వీర్యం సాయంతో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చికిత్సలో భాగంగా లేబరేటరీలో అండం ఫలదీకరణ చెందాక దాన్ని తిరిగి గర్భంలో ప్రవేశపెడతారు. సాధారణంగా పిల్లలను కనడంలో సమస్యలు ఎదుర్కొనే దంపతులు ఈ చికిత్సను ఆశ్రయిస్తుంటారు.

ఇటీవలి కాలంలో ఈ మార్గాన్ని ఎంచుకునే ఒంటరి మహిళల సంఖ్యా బాగా పెరుగుతోంది.

‘37ఏళ్ల వయసులో నాకు తల్లి కావాలనే కోరిక కలిగింది. కానీ నేను అప్పటికి ఎవరితోనూ బంధంలో లేను. ఇంకా ఆలస్యం చేస్తే తల్లి కాలేనేమోనని భయమేసింది. అందుకే ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనాలని నిర్ణయించుకున్నా’ అంటారు పాలీ.

కుటుంబ సభ్యులు కూడా తన నిర్ణయాన్ని స్వాగతించడం ఆశ్చర్యపరిచిందంటారు ఆమె.

ఫొటో క్యాప్షన్,

‘37ఏళ్ల వయసులో నాకు తల్లి కావాలనే కోరిక కలిగింది. కానీ నేను అప్పటికి ఎవరితోనూ బంధంలో లేను’

యూకేకు చెందిన ‘హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ’ లెక్కల ప్రకారం ఐవీఎఫ్ ద్వారా తల్లులుగా మారుతున్న మహిళల సంఖ్య 2014 నుంచి 35శాతం మేర పెరిగింది.

‘అవగాహన పెరగడంతో పాటు తమకు నచ్చని భాగస్వామి ద్వారా బిడ్డను కనడం ఇష్టం లేని వాళ్లు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. కానీ ఇది చాలా ఖరీదైన ప్రక్రియ. బ్రిటన్‌లో దీనికి రూ.7 లక్షల దాకా ఖర్చవ్వొచ్చు’ అని ఆక్స్‌ఫర్డ్ ఫెర్టిలిటీ క్లినిక్ డైరెక్టర్ టిమ్ చైల్డ్ చెప్పారు.

ఒంటరి వ్యక్తులు ఎక్కువగా వీర్యాన్ని, లేదా నేరుగా అండాన్నే కొంటున్నారని ఆయన అన్నారు. భారత్‌లో కూడా క్రమంగా ఈ ట్రెండ్ పెరుగుతోంది. గతేడాది కరణ్ జోహర్, తుషార్ కపూర్ లాంటి సినీ ప్రముఖులు కూడా ఈ పద్ధతి ద్వారానే పిల్లల్ని కన్నారు.

ఐవీఎఫ్ పద్ధతి విజయవంతం అవుతుందా లేదా అన్నది వీర్యం, అండాల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆక్స్‌ఫర్డ్ ఫెర్టిలిటీ క్లినిక్‌నే తీసుకుంటే అందులో 30-50శాతం కేసుల్లోనే ఐవీఎఫ్ విజయవంతమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో కూడా ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనేవాళ్ల సంఖ్య పెరగడానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. చాలామంది ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దానివల్ల తల్లి/తండ్రి కావడంలో ఇబ్బందులు ఎదురవొచ్చు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఐవీఎఫ్‌ను ఎంచుకునే అవకాశాలున్నాయి. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇది పూర్తవడానికి దాదాపు 15 రోజులు పడుతుంది.

భారత్‌లోని నియమాల ప్రకారం గతంలో తల్లయిన మహిళల నుంచే అండాన్ని సేకరించే వీలుంటుంది. ఆ అండాన్ని ఇంజెక్షన్ ద్వారా శరీరంనుంచి బయటకు తీస్తారు. తరవాత దాన్ని పురుషుడి వీర్యంతో కలుపుతారు.

ప్రయోగశాలలో వీర్యం-అండం కలయిక ద్వారా పిండాన్ని వృద్ధి చేస్తారు. తరవాత ఆ పిండాన్ని మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా చాలా చిన్న కోత ద్వారా దీన్ని గర్భంలోకి జొప్పిస్తారు. ఆ గర్భం నిలబడిందో లేదో పదిహేను రోజుల్లో తెలిసిపోతుంది. దీనికోసం దాతలు స్వీకర్తల మధ్య గోప్యతకు సంబంధించిన ఒప్పందం జరుగుతుంది.

గతేడాది మోదీ ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ఒంటరి వ్యక్తులు సరోగసీ ద్వారా పిల్లల్ని కనడానికి వీల్లేదు. భారతీయ చట్ట ప్రకారం వివాహాం చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ చికిత్సను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. దాంతో సింగిల్ పేరెంట్స్ కావాలనుకునేవారితో పాటు ఐవీఎఫ్ కేంద్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. సింగిల్ పేరెంట్ కావాలనుకుంటే పిల్లల్ని దత్తత తీసుకోవాలి కానీ ఇలాంటి పద్ధతులను ఎంచుకోకూడదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)