బ్రిటన్ ప్రభుత్వంపై కేసు వేసేందుకు సిద్ధమవుతున్న వంద మంది అనాథ పిల్లలు

  • 31 ఆగస్టు 2018
స్టీవెనేజ్ నుంచి ఆస్ట్రేలియాకు తరలించిన కొందరు పిల్లల బృందం Image copyright Getty Images
చిత్రం శీర్షిక స్టీవెనేజ్ నుంచి ఆస్ట్రేలియాకు తరలించిన కొందరు పిల్లల బృందం

బ్రిటన్ నుంచి విదేశాలకు తరలించిన అనాథ పిల్లల్లో దాదాపు వందమంది తాము కోల్పోయిన జీవితానికి, అనుభవించిన బాధలకు పరిహారం కోరుతూ బ్రిటన్‌ ప్రభుత్వంపై కేసు వేయడానికి సిద్ధమవుతున్నారు.

2000 మందికి 12 నెలల్లో పరిహారం అందించాల్సి ఉందని ఓ విచారణ నివేదిక మార్చిలో స్పష్టం చేసింది.

"ఆ పిల్లలు అనుభవించిన బాధలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది" అని బాధితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. 1945-70 మధ్య కాలంలో దాదాపు 4000 మంది పిల్లలను కుటుంబాల నుంచి వేరుచేసి ఆస్ట్రేలియా, జింబాబ్వేలకు తరలించారు. యుద్ధం తర్వాత ఇలా వేరుపడిన పిల్లలకు సంబంధించి ది ఇండిపెండెంట్ ఇంక్వైరీ ఇన్‌టూ చైల్డ్ సెక్స్ అబ్యూజ్ (ఐఐసీఎస్ఏ) స్పందించింది.

మెరుగైన జీవితం లభిస్తుందనే ఆశ చూపి వెనకబడిన వర్గాల్లోని కొందరు పిల్లలను కుటుంబాల నుంచి వేరుచేసి ఇలా విదేశాలకు పంపించారు. వీరిలో మూడేళ్ల పిల్లలు కూడా ఉన్నారు.

యూకేలోని స్వచ్ఛంద సంస్థలు, చర్చిల ఆధ్వర్యంలో నడిచే అనాథాశ్రమాలపై భారాన్ని తగ్గించడం, విదేశాల్లో బ్రిటిష్ జనాభాను పెంచడమే లక్ష్యంగా వారు ఈ పని చేశారు.

"మేము లైంగికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు గురయ్యాం" అని బాధితులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 1970లో ఆస్ట్రేలియా వెళ్లిన వారిలో రెక్స్ వేడ్ చివరి బాలుడు. రెక్స్‌ను పదేళ్ల వయసులో కార్న్‌వాల్ నుంచి అతని సోదరుడితో సహా టాస్మానియాకు తరలించారు.

"అక్కడ మాకు అన్నింటికీ శిక్షలే. ఏ చిన్న తప్పు చేసినా దారుణంగా శిక్షించేవారు. నేను గానీ, ఇతర పిల్లలు కానీ తప్పుచేస్తే కుక్కలతో కరిపించేవారు. శారీరకంగా, మానసికంగా హింసిస్తూ అసభ్యకర పదాలతో దూషించేవారు. నేను అన్నింటినీ కోల్పోయా... కుటుంబం, అనుబంధాలు, ఎంత చేసినా అవి మళ్లీ తిరిగిరావు కదా" అని రెక్స్ తెలిపారు.

Image copyright ABC
చిత్రం శీర్షిక బ్రిటిష్ ప్రభుత్వం తమకు పరిహారం అందించేందుకు ప్రయత్నిస్తుందంటే నేను నమ్మను అంటున్నారు జాన్ గ్లిన్

నా బాల్యాన్ని లాక్కున్నారు

ఇలాగే ఆస్ట్రేలియాలోని క్రిస్టియన్ బ్రదర్స్ ఇన్‌స్టిట్యూషన్‌కు చేరిన మరో వ్యక్తి జాన్ గ్లిన్. ఈ కేసు వేసిన వారిలో ఈయన కూడా ఒకరు.

"బ్రిటన్‌లోని నీ కుటుంబంలో ఎవరికీ నువ్వంటే ఇష్టం లేదు" అని ఆ సంస్థలో వారు తరచూ జాన్‌తో చెప్పేవారు. ఆ సంస్థలో ఉన్న ఏడేళ్లూ ఆయన్ను నిరంతరం కొట్టడంతో పాటు లైంగిక హింసలకు గురిచేశారు.

"వయసుతోపాటే ఈ బాధలూ పెరిగేవి. ఇప్పుడు దాని గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటా. నానుంచి నా దేశాన్ని లాక్కున్నారు. నా బాల్యాన్ని లాక్కున్నారు" అని 74 ఏళ్ల జాన్ తన బాధను వ్యక్తం చేశారు.

చిత్రం శీర్షిక ఈ భవనాలన్నీ బానిసలుగా మార్చిన పిల్లలతో పనిచేయించి నిర్మించారు.

విదేశాలకు తరలించిన బ్రిటిష్ బాలల బాధలు

టామ్ సైమండ్స్

ఎన్నో దశాబ్దాలుగా యూకే తమ పిల్లలను ప్రపంచంలోని వివిధ దేశాల్లోని సంస్థలకు పంపుతూ ఉంది. కానీ అలా వెళ్లిన పిల్లలను చాలా సంస్థల్లో బానిసలుగా చూడటమే కాకుండా ఎన్నో రకాల హింసలకు గురిచేశారు. ఇదో పెద్ద కుంభకోణం. దీని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది.

విమానయానం అందరికీ అందుబాటులోలేని కాలంలో అంటే 1950ల్లో పరిస్థితిని ఓసారి ఊహించండి. ఇప్పుడున్నట్లు ఇంటర్నెట్ వంటి సమాచార మాధ్యమాలు అప్పుడు లేవు. పిల్లలకు తమ ఇంటి పక్క వీధి ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనాథాశ్రమాల్లో పరిస్థితిని ఓసారి ఊహించండి.

"నిన్ను త్వరలో ఓడ ఎక్కిస్తాం. ఆస్ట్రేలియా పంపిస్తాం. అక్కడ నీకు అద్భుతమైన జీవితం ఉంటుంది" అని చెబితే వారు ఏం చేస్తారు? అవును అని చెప్పడం తప్ప వేరే ఆలోచన ఉంటుందా!

1618-1970 మధ్య కాలంలో లక్షా 30వేల మంది పిల్లలను ఇలాగే మభ్యపెట్టి కెనడా, న్యూజీలాండ్, జింబాబ్వే, ఆస్ట్రేలియా వంటి కామన్‌వెల్త్ దేశాలకు తరలించారు. ఆస్ట్రేలియా, జింబాబ్వేలకు ఇలా చివరగా వెళ్లిన 4000 మంది పిల్లలకు సంబంధించి ఐఐసీఎస్ఏ అన్వేషించింది. వీరంతా బానిసత్వంతోపాటు శారీరక, లైంగిక హింసలకు గురయ్యారని ఆ పరిశోధనలో వెల్లడైంది.

కొంతమందికి తల్లిదండ్రులు ఉన్నా వారి వివరాలు చెప్పకుండా, 'నువ్వు అనాథవి' అని చెప్పి విదేశాలకు తరలించారని ఐఐసీఎస్ఏ తెలిపింది.

"వారికి మంచి జీవితం లభించేలా చూడాలి. విచారణకు అన్నివిధాలా సహకరిస్తాం" అని ఆరోగ్య, సామాజిక భద్రతాశాఖ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. వీరికి పరిహారం విషయంలో ప్రభుత్వం ఓ స్పష్టతనివ్వాల్సి ఉంది.

"వీరిలో చాలామంది ముసలివాళ్లైపోయారు. ఎక్కువ సమయం లేదు" అని బీబీసీ ప్రతినిధి సంచియా బర్గ్ అభిప్రాయపడ్డారు. మార్చి నుంచి ఇప్పటివరకూ వీరిలో 14మంది చనిపోయారు.

"స్పష్టమైన చర్యలు కావాలి. వారికి సమాజంలో గుర్తింపు కావాలి" అని లాయర్ అలాన్ కొలిన్స్ అన్నారు.

పిల్లలను ఇలా ఇతర దేశాలకు పంపించడంపై 2010లో అప్పటి బ్రిటన్ ప్రధాని గోర్డన్ బ్రౌన్ క్షమాపణలు కోరారు. ఆర్థిక పరిహారం విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడంపై లేబర్ పార్టీ ఎంపీ లికా నాండీ మండిపడ్డారు. "గత ఆరు నెలలుగా చేసిందేమీ లేదు. ఏ శాఖ ద్వారా పరిహారం అందించాలో తెలుసుకోవడానికే మాకు ఆరు వారాలు పట్టింది" అని ఆమె అన్నారు.

పరిహారం అంశాన్ని పరిష్కరించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ కమిషన్‌ను నియమించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)