లిబియా అల్లర్లు: జైలు నుంచి పారిపోయిన 400 మంది ఖైదీలు

ధ్వంసమైన కారు

ఫొటో సోర్స్, Getty Images

లిబియా రాజధాని ట్రిపోలిలో తిరుగుబాటుదార్ల మధ్య చెలరేగిన అల్లర్ల కారణంగా నగరంలోని ఆన్ జారా జైలు నుంచి 400 మంది ఖైదీలు పరారయ్యారని పోలీసులు తెలిపారు.

''జైల్లో జరిగిన గొడవలతో భద్రతా సిబ్బంది ప్రాణాలు అరచేత పట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో ఖైదీలను నిలువరించలేకపోయారు'' అని పోలీసులన్నారు.

ఈ జైలు చుట్టుపక్కల ప్రాంతంలోనే భారీగా అల్లర్లు చెలరేగాయి. జైలులో పురుష ఖైదీలు మాత్రమే ఉన్నారు. ఈ అల్లర్ల కారణంగా లిబియా ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.

ఆన్ జారా జైలులోని ఖైదీల్లో ఎక్కువ శాతం మంది లిబియా మాజీ నేత గడాఫీ మద్దతుదారులే. 2011లో గడాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో హత్యా నేరం కింద వీరు శిక్షను అనుభవిస్తున్నారు.

ప్రత్యక్ష సాక్షులు, అత్యవసర సేవల విభాగం అందించిన సమాచారం మేరకు, వందలాది మంది నిర్వాసితులు తల దాచుకున్న ఓ క్యాంపుపై ఆదివారం రాకెట్ పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు.

ఈ అల్లర్లలో గత వారం సాధారణ పౌరులతోపాటు మొత్తం 47 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారని, మరణించినవారిలో సాధారణ పౌరులు కూడా ఉన్నారని లిబియా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఐక్యరాజ్య సమితి మద్దతు ఉన్న లిబియా ప్రభుత్వం నామమాత్రంగానే అధికారంలో ఉంది. దేశంలో చాలా భాగం తిరుగుబాటుదార్ల ఆధీనంలోనే ఉంది.

ఫొటో సోర్స్, Reuters

ఈ హింసకు కారణం ఏంటి?

గత వారంలో ఈ అల్లర్లు చెలరేగాయి. దక్షిణ ట్రిపోలి ప్రాంతంలోని తిరుగుబాటుదారులు.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 'ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్'(జీఎన్ఏ) ప్రభుత్వ అనుకూల వర్గాలపై దాడి చేయడంతో ఒక్కసారిగా హింస చెలరేగింది.

''ప్రశాంతగా సాగుతున్న పాలనను పక్కదారి పట్టించేందుకు తిరుగుబాటుదారులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మౌనం వహించదు.. ఇది శాంతి భద్రతల ఉల్లంఘనే'' అని జీఎన్ఏ తెలిపింది.

మానవ హక్కుల సంఘాలు కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించాయి. మృతుల్లో 18 మంది సాధారణ పౌరులు అని, అందులో నలుగురు చిన్నపిల్లలు కూడా ఉన్నారని తెలిపాయి.

2011లో నాటో(ఎన్ఏటీఓ) మద్దతుతో కొన్ని తిరుగుబాటు వర్గాలు కల్నల్ గడాఫీని గద్దె దింపాయి. అప్పటి నుంచి లిబియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

అంతర్జాతీయ వర్గాలు ఏమంటున్నాయి?

''విచక్షణా రహితంగా తమ బలాన్ని ప్రయోగించటం అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే విధంగా అన్ని పార్టీలూ ఆలోచించాలి'' అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు.

వారం రోజులుగా కొనసాగుతున్న హింసకు తక్షణమే స్వస్తి పలకాలని అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఆదివారంనాడు పిలుపునిచ్చాయి.

శాసనబద్ధమైన ప్రభుత్వాన్ని బలహీనపరచడం, పాలనకు అడ్డుపడటం లాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదంటూ.. ఈ దేశాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.

కానీ హింసను ఆపడానికి ఇంతవరకూ చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)