మియన్మార్‌లో రాయిటర్స్ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష

రాయిటర్స్ జర్నలిస్టులకు జైలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

క్యావ్ సో ఊ(ఎడమ), వా లోనె తమను పోలీసులు ఇరికించారని చెబుతున్నారు

మియన్మార్‌ రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై ఆ దేశ కోర్టు ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులను జైలుకు పంపింది. మియన్మార్‌లో రోహింజ్యాలపై జరుగుతున్న హింస గురించి పరిశోధిస్తున్న వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

పోలీసులు మియన్మార్ దేశస్థులైన వా లోనె, క్యావ్ సో ఊను అరెస్ట్ చేశారు. కానీ జర్నలిస్టులు ఇద్దరూ తమకేం తెలీదని. పోలీసులు తమను ఇరికించారని చెబుతున్నారు.

మియన్మార్ అంతటా ఈ కేసును పత్రికా స్వేచ్ఛకు పరీక్షగా భావిస్తున్నారు. ఇద్దరు జర్నలిస్టుల్లో ఒకరైన వా లోనె, కోర్టు జైలు శిక్ష విధించగానే "నాకు భయం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు. న్యాయం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛపై నాకు నమ్మకం ఉంది" అన్నారు.

జర్నలిస్టులు ఇద్దరికీ చిన్న పిల్లలున్న కుటుంబాలు ఉన్నాయి. 2017 డిసెంబర్‌లో పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచీ ఇద్దరూ జైల్లోనే ఉన్నారు.

"మియన్మార్ జర్నలిస్టులకు, పత్రికా స్వేచ్ఛకు ఇది ఒక విషాదకరమైన రోజు" అని రాయిటర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీఫెన్ ఆడ్లెర్ అన్నారు.

అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ కోసం పనిచేస్తున్న ఈ ఇద్దరు జర్నలిస్టులు మియన్మార్ పౌరులే.

యాంగోన్‌ కోర్టు జడ్జి యే ల్విన్ ఇద్దరితో "దేశ ప్రయోజనాలకు హాని కలిగించే ఉద్దేశంతో వ్యవహరించారు. అందుకే దేశ రహస్యాల చట్టం ప్రకారం దోషులుగా నిర్ధారించాం" అన్నారు.

32 ఏళ్ల వా లోనె, 28 ఏళ్ల క్యావ్ సో ఊ ఇద్దరూ ఉత్తర రఖైన్లో ఉన్న దిన్ ఇన్ అనే గ్రామంలో సైన్యం ఊచకోతకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు.

వారికి కొందరు పోలీసులు అవసరమైన పత్రాలు ఇస్తామని చెప్పారు. కానీ వాటిని తీసుకున్న వెంటనే ఇద్దరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

సైన్యం హింసపై అధికారులు స్వయంగా దర్యాప్తు ప్రారంభించారు. ఉత్తర రఖైన్ గ్రామంలో ఊచకోతను నిర్ధారించిన అధికారులు, అందులో పాల్గొన్న వారిపై చర్యలకు ఆదేశించారు.

రాయిటర్స్ జర్నలిస్టులకు జైలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

జడ్జి తీర్పు చెప్పగానే కన్నీళ్లు పెడుతున్న క్యావ్ సో ఊ భార్య

స్వేచ్ఛకు విఘాతం

నిక్ బీక్, బీబీసీ మియన్మార్ ప్రతినిధి, యాంగోన్

కోర్టు తీర్పు చెబుతున్నప్పుడు వా లోనె, క్యావ్ సో ఊ ఇద్దరూ తలలు వంచి నిలబడ్డారు. శిక్ష విధించగానే వారి కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టారు. ఈ కేసులో తమను ఇరికించారని ఇద్దరూ కోర్టుకు చెప్పడానికి ప్రయత్నించారు. వా లోనె అరెస్టై జైల్లో ఉన్నప్పుడు తనకు పుట్టిన మొదటి బిడ్డను చూడలేకపోయారు.

చాలా మంది ఈ తీర్పును మియన్మార్‌లో పత్రికా స్వేచ్ఛకు విఘాతంగా భావిస్తున్నారు. ఆంగ్ శాన్ సూచీ పార్టీ ఎన్నికల్లో గెలిచిన మూడేళ్ల తర్వాత ప్రజాస్వామ్యానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిందని ఆరోపించారు.

రోహింజ్యాలపై జరిగిన నేరాలకు, సామూహిక హత్యాకాండలకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని ఐక్యరాజ్యసమితి పరిశీలకులు మియన్మార్ సైనికాధికారుకు సూచించారు. ప్రస్తుతం జైలు శిక్ష పడిన రాయిటర్స్ జర్నలిస్టులు ఇద్దరూ ఆ నేరాలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు.

రాయిటర్స్ జర్నలిస్టులకు జైలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

తీర్పుకు ముందు జర్నలిస్టులకు మద్దతుగా ప్రజల నిరసన ప్రదర్శనలు

జర్నలిస్టులకు తీవ్ర ఇబ్బందులు

మియన్మార్ కోర్టు తీర్పును పరిశీలకులు, మానవ హక్కుల సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి. "ఈ తీర్పు మమ్మల్ని నిరాశకు గురిచేసింది" అని మియన్మార్‌లోని బ్రిటన్ రాయబారి డాన్ చగ్ అన్నట్టు రాయిటర్స్ తెలిపింది.

ఆ దేశంలోని అమెరికా రాయబారి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు మియన్మార్‌లో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని, అందరినీ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు.

మియన్మార్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి సమన్వయకర్త "జర్నలిస్టుల విడుదల కోసం ప్రయత్నిస్తున్నాం. దేశంలో శాంతి, న్యాయం, మానవ హక్కులకు పత్రికా స్వేచ్ఛ చాలా కీలకం. ఈరోజు కోర్టు తీర్పు మాకందరికీ నిరాశ కలిగించింది" అన్నారు.

రాయిటర్స్ జర్నలిస్టులకు జైలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

వీరి హత్యలపై రాయిటర్స్ జర్నలిస్టులు ఆధారాలు సేకరిస్తున్నారు

"సైన్యం దురాగతాల గురించి రిపోర్ట్ చేయాలని అనుకునేవారిని మియన్మార్ కోర్టులు అణచి వేస్తున్నట్టు ఈ దారుణ నేరారోపణలు రుజువు చేశాయి" అని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆసియా డైరెక్టర్ బ్రాడ్ ఆడమ్స్ అన్నారు.

జడ్జి అనారోగ్యానికి గురి కావడంతో ఈ తీర్పు ఆలస్యంగా వచ్చింది. పోలీస్ పోస్టులపై రోహింజ్యా మిలిటెంటు గ్రూపుల దాడితో రఖైన్ రాష్ట్రంలో సంక్షోభం తలెత్తిన ఏడాది తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. మిలిటెంటు గ్రూపుల దాడులకు స్పందనగా సైన్యం రోహింజ్యా మైనారిటీలను దారుణంగా అణచివేసే చర్యలు ప్రారంభించింది.

మీడియా రఖైన్‌కు చేరుకోకుండా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీంతో ఆ ప్రాంతంలో ఏం జరుగుతోందనే సమాచారం తెలుసుకోవడం కష్టంగా మారింది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)