వీణా రావు: ‘భారతదేశం వెలుపల వార్తాపత్రికను నడిపిస్తున్న తొలి భారతీయ మహిళ’

  • 4 సెప్టెంబర్ 2018
వీణారావు

టీవీలు, ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా వార్తా పత్రికలు చదవడం తగ్గిపోయింది. విదేశాల్లో పెద్ద పెద్ద సంస్థలే పేపర్లను మూసేశాయి. ఇంకొన్ని సంస్థలు ఉచితంగా పేపర్లను అందిస్తున్నాయి.

అలాంటి పరిస్థితుల్లో 12ఏళ్లుగా వీణా రావు అనే భారతీయ మహిళ అమెరికాలో సొంతంగా ఓ న్యూస్ పేపర్‌ను నడిపిస్తున్నారు. భారత దేశం వెలుపల వార్తాపత్రికను నడిపిస్తున్న తొలి భారతీయ మహిళగా ఆమె ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ చోటు సాధించారు.

ఇటీవలే వీణా రావు స్థాపించిన ‘ఎన్ఆర్‌ఐ పల్స్’ మంత్లీ న్యూస్ పేపర్ 12వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఏ మాత్రం ఆదాయం లేకపోవడంతో మూడేళ్ల క్రితం ఆమె పత్రికను మూసేద్దామనుకున్నారు. కానీ ఓ సంఘటన తన ప్రయాణాన్ని మళ్లీ ముందుకు నడిపిందని ఆమె చెబుతున్నారు.

ఏంటీ ఎన్‌ఆర్ఐ పల్స్?

అమెరికాలోని జార్జియా రాష్ట్రంతో పాటు ఇతర ఆగ్నేయ రాష్ట్రాల్లో స్థిరపడ్డ దక్షిణాసియా ప్రజలే లక్ష్యంగా ప్రతి నెలా వెలువడే వార్తా పత్రిక ఇది. జార్జియాలోని అట్లాంటా నగరంలో స్థిరపడ్డ వీణా రావు దీనికి ఎడిటర్. ఆగ్నేయ అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు, వారిని ప్రభావితం చేసే ఇతర అంశాల గురించి ప్రధానంగా ఈ పత్రిక ప్రచురిస్తుంది.

2006లో వీణ ఈ పత్రికను నెలకొల్పి ఉచితంగా పాఠకులకు అందిస్తున్నారు. ‘అప్పటివరకు దక్షిణాసియా ప్రజలు, ముఖ్యంగా భారతీయుల సమస్యల గురించి ప్రచురించే పత్రికలేవీ జార్జియాలో లేవు. దాంతో ఆ బాధ్యత నేనే తీసుకోవాలని నిర్ణయించుకున్నా. అమెరికాలో పత్రికలకు ఆదరణ బాగా తగ్గిపోతోంది. డబ్బులు పెట్టి వాటిని కొనేవారి సంఖ్య మరీ తక్కువ. అందుకే పాఠకులకు ఉచితంగా పత్రికను అందించాలనుకున్నా. దాంతో కేవలం ప్రకటనలపైనే ఆధారపడి పత్రికను నడిపిస్తున్నా.

2008 ఆర్థిక మాంద్యం సమయంలో ప్రకటనలు ఇచ్చేవారు దొరకడం చాలా కష్టమైంది. దాంతో పత్రిక బడ్జెట్‌ను చాలా కుదించాల్సి వచ్చింది. ఆ సమయంలో వార్తల సేకరణతో పాటు పేజీ లేఅవుట్, డిజైనింగ్ లాంటి అన్ని పనులనూ నేనే చూసుకున్నా.

మూడేళ్ల క్రితం మళ్లీ ఆర్థిక సమస్య తలెత్తింది. ఈసారి పత్రికను మూసేయాలని నిర్ణయించుకున్నా. అనుకున్నట్టుగానే ఒక నెల పత్రికను ప్రచురించలేదు. దాంతో నాకు చాలా ఈమెయిల్స్ వచ్చాయి. అందులో ఒకరు, ‘వచ్చే సంచికకు నేను పూర్తి పేజీ ప్రకటన ఇస్తాను. పత్రికను మాత్రం ఆపేయొద్దు’ అని మెయిల్ చేశారు. ఎన్ని సమస్యలు ఎదురైనా పత్రికను నడిపి తీరాల్సిందే అన్న పట్టుదలను ఆ ఈమెయిల్ నాలో పెంచింది. పత్రికను ముందుకు నడపాలన్న నా నిర్ణయం సరైనదే అని నిరూపిస్తూ గత మూడేళ్లలో ఎన్‌ఆర్‌ఐ పల్స్ వేగంగా విస్తరించింది’ అని వీణ వివరించారు.

ఎడిటర్, డ్రైవర్... అన్నీ తానై

అమెరికాకు రాకముందు వీణ భారత్‌లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో పనిచేశారు. అమెరికా వెళ్లాక కూడా స్థానిక పత్రికల్లో జర్నలిస్టుగా కెరీర్‌ కొనసాగించారు. అక్కడే వార్తల రిపోర్టింగ్‌తో పాటు పత్రిక డిజైనింగ్, ఇతర విషయాలపై పట్టు సాధించినట్లు చెబుతారు. ఆ క్రమంలో స్థానికంగా ఏర్పడ్డ పరిచయాలే తన పత్రికను ముందుకు నడపడంలో సహాయపడ్డాయని ఆమె అంటారు.

‘పత్రికా రంగం డబ్బు కోసం పనిచేసే రంగం కాదు. అలాగని డబ్బులేకుండా పత్రికను నడపలేం. అందుకే మొదట్నుంచీ బడ్జెట్‌ను అదుపులో పెట్టుకోవడానికే ప్రాధాన్యమిచ్చా. దానికోసం చాలా పనులను నేనే చేయడం మొదలుపెట్టా.

భారతీయులకు చట్ట పరంగా ఎదురయ్యే సమస్యలూ, వీసా చిక్కులూ, చదువుకుంటూ పనిచేసే వాళ్ల ఇబ్బందులూ, పండగలూ, కమ్యూనిటీ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలూ, భారతీయులు నడిపే వ్యాపారాలూ, వాళ్ల విజయ గాథలకు సంబంధించిన సమాచారం పత్రికలో ఇవ్వాలని ప్రణాళిక వేసుకున్నా.

నాకు డ్రైవింగ్ అంటే చాలా భయమేసేది. కానీ మొదట్లో పత్రికలను ప్రింట్ చేశాక, నేనే వాటిని స్వయంగా కారులో తీసుకొని వెళ్లి సరఫరా చేసేదాన్ని. హిందూ దేవాలయాలు, షాపింగ్ కాంప్లెక్సులు, రెస్టరెంట్లు, ఇతర వ్యాపార ప్రాంగణాల్లో ర్యాకులను ఏర్పాటు చేసి అక్కడ ప్రతికను ప్రజలకు అందుబాటులో ఉంచేదాన్ని. ఉచితమే కాబట్టి చాలామంది దాన్ని తీసుకునేవారు. అలా క్రమంగా పత్రికకు గుర్తింపు పెరగడం మొదలైంది.

మొదట రోజూ దాదాపు 150కి.మీ.లు ప్రయాణిస్తూ 70కి పైగా కేంద్రాల్లో పత్రికను సరఫరా చేసేదాన్ని. హైవే పైన కారు నడపడం కష్టమనిపించి ఇతర మార్గాల్లో ప్రయాణించేదాన్ని. దాంతో దూరం పెరిగి, పత్రికను సరఫరా చేయడానికి చాలా రోజులు తిరగాల్సి వచ్చేది. కాస్త ఆత్మవిశ్వాసం పెరిగాక సొంతంగా కారు కొనుక్కొని హైవేపైన ప్రయాణించడం మొదలుపెట్టా.

ఓసారి అలా కారులో నుంచి పత్రికలు తీసి ఓ ర్యాకులో పెడుతున్నప్పుడు... నన్ను చూసి డ్రైవర్ అనుకొని, ‘ఈ పత్రిక ఎడిటర్ ఎవరు? ఎక్కడి నుంచి ప్రచురిస్తున్నారు?’ అని ఓ పెద్దాయన అడిగారు. ‘నేనే పత్రిక ఎడిటర్’ని అని చెబితే ఆయన చాలా ఆశ్చర్యపోయారు. నాకు మాత్రం ఆ క్షణం కాస్త గర్వంగా అనిపించింది’ అంటారు వీణ.

అరుదైన రికార్డు

భారత్‌కు వెలుపల ఓ పత్రికను నడిపిస్తున్న తొలి ఎన్‌ఆర్ఐ మహిళగా వీణా రావు అరుదైన గుర్తింపును సాధించారు.

‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ నుంచి ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ వచ్చిన ఈమెయిల్‌ను మొదట నమ్మలేకపోయా.

పాత్రికేయ రంగంపైన ఉన్న ఇష్టంతో, అమెరికాలోని భారతీయుల జీవితంతో ముడిపడిన అన్ని అంశాలను వెలుగులోకి తెచ్చే ఉద్దేశంతోనే పత్రికను మొదలుపెట్టా. కానీ ప్రపంచంలోనే అలా న్యూస్‌పేపర్‌ను నెలకొల్పిన తొలి భారతీయురాలిని నేనే అని మాత్రం నాకు తెలీదు. బహుశా తొలి ఎడిటర్‌నే కాదు, అమెరికాలో పత్రికల డెలివరీ గాళ్‌గా పనిచేసిన తొలి భారతీయురాలిని కూడా నేనేనేమో’ అంటారు వీణ.

2010లో లిమ్కా బుక్‌లో చోటు దక్కడంతో స్థానికంగా ‘ఎన్‌ఆర్‌ఐ పల్స్‌’ గుర్తింపు బాగా పెరిగిందని, నాటినుంచి పత్రిక పరిధి కూడా విస్తరించిందని చెబుతారు.

భారత్‌‌లో జీవితం

కర్ణాటకలోని మంగళూరులో పుట్టి పెరిగన వీణ, పూణెలో పీజీ చేశారు. ఆ తరువాత అక్కడే జర్నలిజంలోనూ పీజీ డిప్లొమా చేసి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో కెరీర్ మొదలుపెట్టారు.

‘నాకు మొదట్నుంచీ తెలిసిన విద్య బాగా రాయడమే. అందుకే జర్నలిజం వైపు వచ్చా. కాలేజీలో ఉన్నప్పుడే ‘విమెన్స్ ఎరా’, ‘ఫెమినా’ లాంటి మేగజీన్లకు కథనాలు రాశా. కానీ సొంతంగా పత్రికను నడపుతానని కలలో కూడా ఊహించలేదు. అమెరికాలో తప్ప మరే దేశంలోనూ ఇది సాధ్యమవుతుందని కూడా నేను అనుకోవట్లేదు. ఇక్కడ మహిళలకు లభించినంత ప్రోత్సాహం మరెక్కడా దొరకకపోవచ్చు.

కొన్నాళ్ల క్రితం ఒక పుస్తకం రాయడం మొదలుపెట్టా. ఈ ఏడాదిలో దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నా’ అంటారు వీణ.

ఎన్ఆర్‌ఐ పల్స్ పత్రికతో పాటు అదే పేరుతో న్యూస్ వెబ్‌సైట్‌ను కూడా ఆమె నిర్వహిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశంలోనైనా పత్రికను నడపడం కష్టమేననీ, పన్నెండేళ్లుగా ఆ కష్టాన్ని అధిగమిస్తూనే ముందుకు సాగుతున్నాననీ వీణ చెబుతారు. ప్రస్తుతం అమెరికాలోని ఆగ్నేయ రాష్ట్రాలన్నింటికీ ఎన్‌ఆర్ఐ పల్స్ చేరుతోంది. దాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవడమే తన లక్ష్యం అంటారామె.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)