అర్జెంటీనాలో 60 శాతం వడ్డీ: పెట్టుబడి పెడతారా?

ఫొటో సోర్స్, EPA
విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసమే ప్రధానం
ఈ మాట వినగానే కొందరికి ఆశ.. మరికొందరికి అనుమానం రావడం సహజం. కానీ అర్జెంటీనా నిజంగానే ఏడాదికి 60 శాతం వడ్డీ ఇస్తాం, ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటోంది. ఎందుకో తెలుసా?
అర్జెంటీనా మళ్లీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. దీంతో వార్షిక వడ్డీ రేట్లను 60 శాతానికి పెంచింది.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, నగదు లభ్యతను పెంచడానికి ఈ చర్య తీసుకుంది.
ప్రపంచంలోనే అత్యంత అధిక వడ్డీ రేటు ఇదే.
ఫొటో సోర్స్, Getty Images
పెసో' ఈ ఏడాది 50 శాతం మేర విలువను కోల్పోయింది.
దేశంలో వ్యయాన్ని తగ్గించేందుకు.. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అర్జెంటీనా తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. ఈ దేశం కరెన్సీ 'పెసో' ఈ ఏడాది 50 శాతం మేర విలువను కోల్పోయింది.
ఈ నేపథ్యంలో ఈ దేశం వెంటనే అత్యవసర నిధులు విడుదల చేయాలని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్)ను కోరింది.
ఇన్ని చర్యలు తీసుకున్నా ఈ ప్రభుత్వాన్ని విదేశీ పెట్టుబడిదారులు విశ్వసించాలి.
అప్పుడే దేశంలోకి విదేశీ నిధులు పెరిగి.. సంక్షోభం నుంచి బయటపడే వీలుంటుంది.
ఫొటో సోర్స్, AFP
అర్జెంటీనాకు ఉన్న అప్పుల్లో 70 శాతం విదేశీ కరెన్సీలోనే ఉన్నాయి.
అర్జెంటీనాలో ఈ సంక్షోభం ఎందుకు?
అర్జెంటీనాకు ద్రవ్య లభ్యత పెద్ద సమస్యగా మారింది.
దీంతో ఈ దేశం రుణాలను తిరిగి చెల్లిస్తుందా, లేదా అని పెట్టుబడిదారులు భయపడుతున్నారు.
అర్జెంటీనా అప్పుల్లో 70 శాతం విదేశీ కరెన్సీలోనే ఉన్నాయి.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇదే అత్యధిక శాతం.
అర్జెంటీనా చెల్లింపులు చేయాలంటే విదేశీ నిధులు కావాలి. డాలర్‌తో పోల్చినపుడు పెసో విలువ 50 శాతం మేర పడిపోవడంతో ఈ దేశానికి డబ్బు దొరకడం కష్టమైపోయింది.
మరోవైపు ఈ దేశపు బడ్జెట్ 6.5 శాతం లోటుతో ఉంది.
ఫొటో సోర్స్, Reuters
మాక్రి
మరి 60 శాతం వడ్డీ ఆదుకుంటుందా?
విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే వారికి భారీ వడ్డీ ఇవ్వాలి.
అందుకోసమే అర్జెంటీనా 60 శాతం వార్షిక వడ్డీ ఇస్తామని చెబుతోంది.
అయితే పెట్టుబడిదారులు ఈ వడ్డీలోంచి ద్రవ్యోల్బణాన్ని తీసేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ద్రవ్యోల్బణం 31 శాతంగా ఉంది. ఆ లెక్కన ఇక్కడ వార్షిక వడ్డీ 29శాతం అవుతుంది.
అయితే పెసో విలువ ఇంకా పతనమవుతుందని పెట్టబడిదారులు భావిస్తే.. ఈ దేశానికి 60 శాతం వడ్డీ ఇచ్చినా నిధులు రాకపోవచ్చు.
ఫొటో సోర్స్, EPA
5000 కోట్ల డాలర్లు ఇవ్వాలని అర్జెంటీనా ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థను కోరింది.
మొత్తానికి ఈ దేశం భవిష్యత్తు విదేశీ పెట్టబడిదారుల విశ్వాసంపై ఆధారపడి ఉంది.
ఇప్పటికైతే విదేశీ పెట్టుబడిదారులు అంత ఆసక్తి కనబరచకపోవచ్చు.
ఇంకా చెప్పాలంటే.. 5000 కోట్ల డాలర్లు ఇవ్వాలని అర్జెంటీనా ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థను కోరింది. అయితే.. ఇందులో 1500 కోట్ల డాలర్లను ఇప్పటికే తీసేసుకుంది. దీని వల్ల ఇక్కడ మార్కెట్లు పుంజుకుంటాయని అందరూ అనుకున్నారు.
కానీ అలా జరగలేదు సరికదా ప్రతికూల ఫలితం వచ్చింది. గత రెండు రోజుల్లో పెసో 20 శాతం మేర పతనమైంది.
ఫొటో సోర్స్, Getty Images
టర్కీ, అర్జెంటీనా రెండింటికీ ఒకే తరహా సమస్య
మరి మాక్రీ ఏం చేస్తున్నారు?
అర్జెంటీనా అధ్యక్షుడు మాక్రీకి మంచి పేరుంది. ఆయన తన ఆర్థిక వ్యవహారాల బృందాన్ని గత 50 ఏళ్లలో అత్యంత ఉత్తమమైనదిగా చెబుతుంటారు.
ఆయన 2015 డిసెంబరులో పదవి చేపట్టారు. అంతకు ముందు ఇక్కడ 7.5 శాతం మేర ఆర్థిక లోటు ఉండేది.
దీన్ని తగ్గించేందుకు ఈయన చేపట్టిన చర్యల గురించి బీబీసీ ముండో ప్రతినిధి డానియల్ పార్డో.. ''సామాజిక ప్రతికూలతను తగ్గించేందుకు ఈయన కఠిన చర్యలు తీసుకోకుండా క్రమపద్ధతిలో చర్యలు అమలు చేశారు. కరెన్సీ మార్కెట్లో పెసోను ప్రవహింప చేసేందుకు పెట్టుబడులపై ఉన్న నియంత్రణలను ఎత్తేశారు'' అని చెప్పారు.
అయితే ఇది అంత గొప్ప ఫలితాలను ఇవ్వలేదని విశ్లేషకులు అంటున్నారు. టర్కీ, అర్జెంటీనా రెండూ ఒకే తరహా సమస్య ఎదుర్కొంటున్నాయని అంటున్నారు.
మేలో ఈ ప్రభుత్వం వార్షిక వడ్డీ రేట్లను 45 శాతానికి పెంచింది. కానీ అప్పటికీ మార్కెట్లు సంతృప్తి చెందలేదు.
ఇవికూడా చదవండి:
- రిక్షావాలా కూతురు రికార్డు బద్దలుకొట్టింది
- హైదరాబాద్‌కు 500 ఏళ్లు: ఎక్కడ మొదలైంది? ఎలా ఎదిగింది?
- భారతీయ యువతులు చైనా యువకుల్ని ఎందుకు పెళ్లి చేసుకోరు?
- సుప్రీంకోర్టు: ప్రియా ప్రకాశ్ వారియర్ దైవ దూషణకు పాల్పడలేదు
- గృహనిర్బంధంలో వరవరరావు ఏం చేస్తున్నారు?
- పుణే పోలీసుల అరెస్టులు: ఎల్గార్ పరిషత్ అంటే ఏమిటి?
- అభిప్రాయం: ఆ వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది.. కానీ ఎవరూ నమ్మలేదు
- హై హీల్స్ వేసుకుంటున్నారా... జాగ్రత్త
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)