అఫ్గాన్ హఖానీ మిలిటెంట్ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ మృతి... తాలిబాన్ ప్రకటన

జలాలుద్దీన్ హక్కానీ

ఫొటో సోర్స్, AFP

హఖానీ మిలిటెంట్ నెట్‌వర్క్‌ను స్థాపించిన జలాలుద్దీన్ హఖానీ మరణించినట్లు అఫ్గాన్ తాలిబన్ ప్రకటించింది.

జలాలుద్దీన్ చాలా ఏళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.

అఫ్గానిస్తాన్‌లో ముఖ్యమైన మిలిటెంట్ నాయకుడైన ఆయనకు తాలిబన్, అల్-ఖైదా రెండింటితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

2001 నుంచి ఈ నెట్‌వర్క్‌ కార్యకలాపాలను జలాలుద్దీన్ కొడుకు చేపట్టినట్లు భావిస్తున్నారు.

అఫ్ఘాన్, నాటో దళాలపై గత కొన్నేళ్ళలో జరిగిన చాలా దాడుల వెనుక హఖానీ నెట్‌వర్క్ ఉంది.

హఖానీ ఎక్కడ చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు అన్న అంశాలపై అఫ్ఘాన్ తాలిబన్ చేసిన ప్రకటనలో స్పష్టంగా పేర్కొనలేదు.

‘‘ఇస్లాం వ్యాప్తి కోసం యువకుడిగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆయన గొప్ప కష్టాలను భరించారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడ్డారు’’ అని ఆ ప్రకటన తెలిపింది.

హఖానీ మృతిపై చాలా సంవత్సరాలు పుకార్లు వినిపించాయి.

కనీసం ఏడాది కిందటే నాయకుడు చనిపోయాడని హఖానీ నెట్‌వర్క్‌ సన్నిహిత వర్గాలు 2015లో బీబీసీకి తెలిపాయి. కానీ, ఈ సమాచారాన్ని ఎవ్వరూ ధ్రువీకరించలేదు.

అమెరికా సీఐఏకు గొప్ప ఆస్తి

1980ల్లో సోవియట్ దళాలు అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించుకున్నప్పుడు అఫ్ఘాన్ గెరిల్లా నాయకుడైన జలాలుద్దీన్ హక్కానీ వాటిపై పోరాడారు.

అప్పట్లో ఆయన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కి హక్కానీ గొప్ప ఆస్తి అని అమెరికా అధికారులు కూడా ఒప్పుకున్నారు.

1996లో తాలిబన్లు అఫ్ఘానిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్నప్పుడు హక్కానీ వారితో కలిశారు.

జలాలుద్దీన్ హక్కానీ ‘‘గొప్ప యోధుడు.. ఈ శకంలోని గౌరవనీయులైన జీహాదీ నాయకుల్లో ఒకరు’’ అని తాలిబన్ తన ప్రకటనలో అభివర్ణించింది.

అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా నేతృత్వంలో దళాలు సైనిక చర్యకు దిగి 2001లో తాలిబన్‌ను తరిమేశాయి. దీంతో అప్ఘాన్-పాకిస్తాన్ సరిహద్దు వెంట ఉన్న గిరిజన ప్రాంతాల నుంచి కార్యకలాపాలు కొనసాగించిన గ్రూపుల్లో హక్కానీ నెట్‌వర్క్‌ ఒకటి.

ఎక్కువగా.. పాకిస్తాన్ నుంచి పనిచేస్తుందని భావిస్తున్న ఈ గ్రూపు, అఫ్ఘానిస్తాన్‌లో దారుణమైన దాడుల్లో కొన్నింటికి కారణమని నిందిస్తారు. గతేడాది కాబుల్‌లో 150 మంది చనిపోయిన ట్రక్కు బాంబు పేలుడు కూడా ఈ దాడుల్లో ఒకటి.

మిలిటెంట్లకు ‘నష్టం’

మఫౌజ్ జుబైద్, బీబీసీ న్యూస్, కాబుల్

జలాలుద్దీన్ హక్కానీ మరణించే నాటికి గణనీయమైన కార్యకలాపాల్లో కానీ, వ్యూహాత్మక పాత్రలో కానీ లేరు. అయినప్పటికీ ఆయన స్థాపించిన మిలిటెంట్ సంస్థకు ఇది లాంఛనప్రాయ నష్టం.

కొన్నేళ్ల కిందటే సంస్థపై నియంత్రణ మొత్తాన్ని జలాలుద్దీన్ కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ పొందారు. అనంతరం సంస్థకు సలహాదారుగా జలాలుద్దీన్ వ్యవహరిస్తున్నారని, హక్కానీ నెట్‌వర్క్‌కు ఇది భారీ మానసిక నష్టమని భావిస్తున్నారు.

అఫ్ఘానిస్తాన్‌లో ఇప్పటికీ అత్యంత శక్తివంతమైన, భయానకమైన మిలిటెంట్ గ్రూపుల్లో హక్కానీ నెట్‌వర్క్ ఒకటిగా కొనసాగుతోంది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కంటే ఎక్కువ ఆదరణ హక్కానీ నెట్‌వర్క్‌కే ఉందని కొందరు అంటుంటారు.

సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతూ ‘సహజ కారణాల’ వల్లనే జలాలుద్దీన్ మరణించారని తాలిబన్ నొక్కి చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. జలాలుద్దీన్ మృతికి సంబంధించి వెలువడిన చాలా అపోహలను ఉద్దేశించి చేసిన ప్రస్తావన అది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)