జపాన్‌ మీద విరుచుకుపడిన 'టైఫూన్ జేబి'

  • 4 సెప్టెంబర్ 2018
జపాన్ తుపాను Image copyright AFP

జపాన్ మీద మరొక భీకర తుపాను విరుచుకుపడింది. గత 25 ఏళ్ళలో కనీవినీ ఎరుగని భారీ తుపాను దూసుకొస్తుండడంతో అధికారులు లక్షలాది మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ తుపాను తాకిడికి ఆరుగురు చనిపోయారు. 160 మందికి పైగా గాయపడ్డారు.

గంటకు 172 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో ముంచుకొస్తున్న ఈ భారీ తుపానుకు 'టైఫూన్ జేబి' అని పేరు పెట్టారు.

పశ్చిమ ప్రాంతం నుంచి దూసుకొస్తున్న ఈ తుపాను ధాటికి ఒసాకా తీరంలో ఒక ట్యాంకర్ వంతెన మీంచి కొట్టుకుపోయింది. క్యోటోలోని రైల్వే స్టేషన్ కప్పు ఊడిపడింది.

Image copyright EPA

ఉత్తర దిశగా ప్రయాణిస్తున్న కొద్దీ ఈ తుపాను బలహీన పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మంగళవారం నాడు షికోకు ద్వీపం మీద ఉప్పెనలా విరుచుకుపడజిన ఈ తుపాను ఆ తరువాత జపాన్ కు చెందిన ప్రధాన దీవి హోన్షూ మీదకు మళ్ళింది.

జేబి తుపాను 'అత్యంత బలమైనదని' జపాన్ వాతావరణ శాఖ వ్యాఖ్యానించింది. జపాన్ దీవుల్లో 48 మందిని మృతికి కారణమైన 1993 నాటి తుపాను తరువాత ఇదే అత్యంత ప్రమాదకరమైనదని విశ్లేషించింది.

ఇప్పటికే వందల సంఖ్యలో విమానాలను రద్దు చేశారు. నౌకలు, రైళ్ళు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే మీదకు వరద నీరు వచ్చి చేరింది.

ఒసాకాలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన జపాన్ యూనివర్సల్ స్టూడియోస్ ను మూసేశారు.

టైఫూన్ జేబీ ప్రయాణ మార్గం , స్థానిక కాలంమాన ప్రకారం:

తుపాను భయంకరంగా మారడంతో జపాన్ ప్రధాని షింజో ఆబె అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 'సత్వరమే ప్రాణ రక్షణ చర్యలు తీసుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని' ప్రజలను ఆదేశించారు.

తుపాను మూలంగా అలలు చాలా ఎత్తున ఎగసి పడుతున్నాయి. చెత్త పదార్థాలు గాలిలో తేలుతున్నాయి. ఈ సందర్భంగా కొండచరియలు విరిగిపడే అవకాశాలున్నాయని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు, తీవ్రమైన సుడిగాలులు సంభవించవచ్చని తెలిపింది.

Image copyright KYODO/VIA REUTERS
Image copyright AFP PHOTO / KAGAWA PREFECTURAL POLICE

జపాన్ తరచుగా భారీ తుపానుల తాకిడికి గురవుతోంది. ఈ ఏడాది వేసవి వాతావరణం అక్కడ చాలా చోట్ల ప్రాణాంతకంగా మారింది.

గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని స్థాయిలో జూలై నెలలో విరుచుకుపడిన వరదలు జపాన్ ను అతలాకుతలం చేశాయి. ఆ వరదల్లో 200 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఆ తరువాత అత్యంత దారుణమైన వడగాలులు చుట్టు ముట్టాయి. ఇప్పుడు మరోసారి ప్రకృతి జపాన్ మీదకు తుపాను రూపంలో పంజా విసిరింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు