'దళిత' పదం: అవమానకరమా... ఆత్మగౌరవ సంకేతమా?

  • 4 సెప్టెంబర్ 2018
దళిత పదం Image copyright Getty Images

ప్రైవేట్ శాటిలైట్ టీవీ చానెళ్లు..'దళిత' పదానికి బదులుగా షెడ్యూల్డ్ కాస్ట్ పదాన్ని ఉపయోగించాలని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది.

జూన్ 6న బాంబే హైకోర్టు (నాగపూర్ బెంచ్) ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ ప్రకటన జారీ చేసినట్లు తెలిపింది.

అయితే, ఈ సూచనలపై దళిత సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

'దళిత' పదం తమ ఆత్మగౌరవాన్ని సూచించేదని, దాన్ని వాడకూడదనడం సరికాదని అంటున్నాయి.

కేంద్ర సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ కూడా ఇటీవల ఇదే విధమైన సూచనలు చేసింది.

అన్ని అధికారిక కార్యకలాపాల్లో దళిత పదానికి బదులుగా రాజ్యాంగంలో పేర్కొన్న షెడ్యూల్డ్ కాస్ట్ పదాన్ని వినియోగించాలని మార్చి 15న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది.

'రాజ్యాంగంలో ఆ పదం లేదు'

ప్రసార మాధ్యమాల్లో, అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో దళిత పదాన్ని వాడటం నిషేధించాలని మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త పంకజ్ మెష్రం 2016లో బాంబే హైకోర్ట్‌లో ప్రజాప్రయోజ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

షెడ్యూల్డ్‌ కులాల వారిని అవమానించేందుకు అగ్రకులాలు దళిత పదాన్ని వాడుకలోకి తెచ్చాయని పిటిషనర్‌ పేర్కొన్నారు.

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. అధికారికంగా ఇచ్చే సమాచారంలో ఇకపై 'దళిత' పదాన్ని ఉపయోగించరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రసార మాధ్యమాలు దళిత పదం ఉపయోగించకుండా సూచనలు చేయాలని కోరింది.

దళిత పదానికి బదులుగా రాజ్యాంగంలో పేర్కొన్న 'షెడ్యూల్డ్‌ కులాలు' పదం వాడాలని సూచించింది.

రాజ్యాంగంలో ఎక్కడా దళిత పదం లేదని ధర్మాసనం పేర్కొంది.

'అలా పిలవడం అవమానంగా ఉంది'

వెనుకబడిన, అణగదొక్కిన కులాలకు సరైన గౌరవం తీసుకరావాలనే ఉద్దేశంతోనే ఈ పిల్ వేశానని పిటిషనర్ పంకజ్ మెష్రం బీబీసీకి తెలిపారు.

''దళిత పదానికి అర్థం ఏంటో తెలుసుకోడానికి ప్రయత్నించాను. కొన్ని డిక్షనరీల్లో దళితులు అంటే అంటరాని వారు, నిస్సహాయులు, తక్కువవారు అనే అర్థాలున్నాయి. కులాన్ని కించపరుస్తున్నట్లుగా ఉంది.'' అని తెలిపారు.

Image copyright Getty Images

రాజ్యాంగంలో దళిత పదం లేదని, అలాంటప్పుడు ఎందుకు ఆ పదాన్ని వాడాలని పంకజ్ ప్రశ్నించారు.

''దళితుడు అని పిలవడం కించపరిచినట్లు ఉంది. అందుకే ఆ పదాన్ని తొలగించాలని కోర్టుకెళ్లాను.'' అని చెప్పారు.

అయితే, దళిత పదం మీడియాలో వాడొద్దని కేంద్రం సూచించడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి.

Image copyright Getty Images

'దళితులను విడదీసే చర్య'

అణచివేత చర్యల నుంచి ఉద్యమ భావజాలం నుంచి వచ్చిన దళిత పదాన్ని వీడియాలో, అధికారిక కార్యకలాపాల్లో వాడకూడదని చెప్పడం సరికాదని ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత అన్నారు.

దళిత పదం వాడకంపై కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.

'హరిజనులు, వెలివేయబడ్డవాళ్లు, అంటరానివాళ్లు తదితర పదాలు అభ్యంతరకరం కానీ, దళిత పదం వాడటంలో ఇబ్బంది ఏమీ లేదు' అని తెలిపారు.

'దేశంలో అణచి వేయబడిన కులాలన్నింటినీ ఏకం చేసే పదం దళిత్. దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి ' అని ప్రశ్నించారు.

ఐక్యంగా ఉన్న దళితలను విడగొట్టే చర్యగా దీన్ని భావిస్తున్నామని తెలిపారు.

Image copyright ministry of social justice and empowerment

'అణచివేతకు గురైన కులాలను ఏకం చేసే భావన'

దళిత అనే భావన ఒక కులానికి సంబంధించిన పేరును సూచించేది కాదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని ఎదుర్కొనే పదమని అభివర్ణించారు.

దేశంలోని అణచేవేతకు గురైన కులాలన్నింటినీ ఏకం చేసిన భావనగా దళిత పదం గుర్తింపు పొందిందని చెప్పారు.

‘‘దళిత పదం పాళి భాష నుంచి పుట్టింది. బుద్ధుడి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పదం తర్వాత కాలంలో అన్ని భాషల్లో వాడుకలోకి వచ్చింది'' అని తెలిపారు.

ప్రభుత్వం దళిత పదం వాడకూదని నిర్దేశించరాదని, దేశంలోని 20 కోట్ల అంటరాని ప్రజల ఆత్మగౌరవ సంకేతంగా ఉన్న ఆ పదాన్ని ప్రజలు, మీడియా వాడొచ్చని ఐలయ్య పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు