బిల్ క్లింటన్‌పై ప్రశ్న అడగటంతో టీవీ ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన మోనికా లూవిన్‌స్కీ

ఫొటో సోర్స్, Getty Images
మోనికా లూవిన్‌స్కీ గుర్తుంది కదా... అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో వార్తల్లోకెక్కిన వనిత. ఆమె తాజాగా ఓ ఇజ్రాయలీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. అందుకు కారణం, బిల్ క్లింటన్‌తో ఆమెకున్న సంబంధం గురించి ప్రశ్నించడమే.
'పరిధులు దాటి' ప్రశ్నలు అడగడం వల్లనే ఆ ఇంటర్వ్యూ నుంచి బయటకు వెళ్ళిపోయానని ఆ తరువాత లూవిన్‌స్కీ ఒక ట్వీట్ చేశారు.
ఫొటో సోర్స్, Tal Schneider/Twitter
ఇజ్రాయల్ లోని 'చానెల్ 2 న్యూస్' ఆమెకు ధన్యవాదాలు చెబుతూ, 'మీ సున్నితత్వాన్ని' గౌరవిస్తున్నామని ఒక ప్రకటన చేసింది.
ఈ వైట్ హౌస్ మాజీ ఇంటర్న్, ఆనాటి అధ్యక్షుడు క్లింటన్‌తో తనకున్న సంబంధం గురించి చెబుతూ, ఆయన వైపు నుంచి అదొక తీవ్రమైన 'అధికార దుర్వినియోగం' అని వ్యాఖ్యానించారు.
అప్పటి అధ్యక్షుడితో ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్నప్పుడు ఆమె వయసు 22 ఏళ్ళు. అధ్యక్షుడు ఆమెకు 27 ఏళ్ళ సీనియర్.
సోషల్ మీడియాతో మేలు-కీడు అనే అంశం మీద ప్రసంగించడానికి లూవిన్‌స్కీ జెరూసలేం వెళ్ళారు. అయితే, ఆ తరువాత చానెల్ 2 న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, క్లింటన్‌తో సంబంధం గురించి ప్రశ్న అడగ్గానే ఆమె మౌనంగా ఆమె అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు.
వ్యానిటీ ఫెయిర్ అనే పత్రికలో 2017లో రాసిన వ్యాసంలో ఆమె తనను పత్రికలు, ప్రసార సాధనాలు, కోర్టులు తనకు సమాజం నుంచి వెలివేతకు గురైన భావనను కలిగించాయని చెప్పారు. ఆ తరువాత తాను మానసిక సంక్షోభం నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
'జెరూసలేంకు తాను సోషల్ మీడియా గురించి మాట్లాడడానికి వచ్చానని, దానికి కొనసాగింపుగానే ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఉండాల్సిందని' ఆమె ట్విటర్లో ప్రకటించారు.
కాగా, లూవిన్‌స్కీ అభిప్రాయాలను తాము మన్నిస్తామని, గౌరవిస్తామని చానల్ 2 న్యూస్ తెలిపింది.
అయితే, 'ఆ ప్రశ్న పరిధులకు లోబడినది, మర్యాదపూర్వకమైనదే, లూవిన్‌స్కీ అభ్యర్థనకు అతీతమైనది కాదు' అని భావిస్తున్నామని కూడా ఆ చానల్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)