న్యూజీలాండ్: ప్రత్యేక విమానంలో ప్రయాణించిన ప్రధాని జసిండా ఆర్డెర్న్.. రూ.38 లక్షల అదనపు వ్యయంపై విమర్శలు

జసిండా ఆర్డెర్న్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

"అక్కడికి వెళ్లకపోతే 1971 తర్వాత పసిఫిక్ ఐలాండ్స్ ఫోరంకు హాజరు కాని తొలి (న్యూజీలాండ్) ప్రధాన మంత్రిగా నిలిచేదాన్ని" అని అర్డెర్న్ చెప్పారు

బిడ్డకు ఎక్కువ సమయం దూరంగా ఉండలేక వైమానిక దళం ప్రత్యేక విమానంలో ప్రయాణించిన న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

బిడ్డకు ఇంకా పాలు పడుతున్న ఆర్డర్న్ నవూరూలో సోమవారం ప్రారంభమైన పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం మూడు రోజుల సదస్సులో పాల్గొనడానికి సెప్టెంబర్ 5వ తేదీ బుధవారం ఒక్క రోజే ఆమె వెళ్లారు.

వైమానిక దళానికి చెందిన బోయింగ్ 757లో న్యూజీలాండ్ ఉప ప్రధాని విన్‌స్టన్ పీటర్స్‌తో కలిసి ఆమె సోమవారమే ఈ ఫోరం కోసం వెళ్లాల్సి ఉంది. కానీ, బిడ్డకు ఎక్కువ సేపు దూరంగా ఉండకూడదనే కారణంతో ఆమె ఆరోజు అక్కడికి వెళ్లలేకపోయారు.

సోమవారం ఉప ప్రధానిని నవూరూలో దించిన వైమానిక దళ విమానం, అక్కడ పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో అక్కడికి గంట దూరంలో ఉన్న మార్షల్ ఐలండ్స్ వెళ్లింది. బుధవారం ప్రధాని జసిండాను మళ్లీ నవూరూకు తీసుకువెళ్లడానికి మళ్ళీ న్యూజీలాండ్ వచ్చింది.

వైమానిక దళం విమానం ఆమె కోసం అదనంగా ఇంత దూరం ప్రయాణించడానికి 80 వేల న్యూజీలాండ్ డాలర్లు అంటే దాదాపు 38 లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చయినట్టు అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

11 వారాల పాపకు ఎక్కువ సేపు పాలు ఇవ్వకుండా ఉండలేకపోవడంతో ఆర్డెన్ సమావేశాల తొలిరోజు నవూరూ వెళ్లలేకపోయారు

ఇది నా నిర్ణయమే...

"ఈ నిర్ణయం నాదే, నేను ఒక దశలో ఆస్ట్రేలియా విమానంలో అక్కడికి వెళ్లాలని కూడా అనుకున్నాను, అక్కడికి వెళ్లడానికి నేను చాలా రకాల మార్గాలు వెతకడానికి ప్రయత్నించాను" అని ఆమె సోమవారం ఎన్‌జడ్ హెరాల్డ్‌కు తెలిపారు.

"కాసేపు అక్కడికి వెళ్లాలా, వద్దా అని కూడా ఆలోచించా. ఒకవేళ వెళ్తే, నన్ను ఇలాగే అంటారని తెలుసు. వెళ్లకపోయినా నన్ను ఇదే స్థాయిలో విమర్శించేవారు".

వైమానిక దళం విమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో నావురులో ఉంచడం సాధ్యం కాదని, అక్కడికి గంట దూరంలో ఉన్న మార్షల్ ఐలాండ్స్‌లో పార్క్ చేయాల్సి ఉంటుందని అధికారులు తనతో అన్నారని ఆమె తెలిపారు.

ఫోరం కోసం పసిఫిక్ దేశాల మంత్రులు, నేతలు అందరూ రావడంతో నావురు ద్వీపంలో విమానాలు నిండిపోయాయి. దీంతో విమానాలన్నింటినీ మార్షల్ ఐలాండ్స్ పంపించారు.

న్యూజీలాండ్ నుంచి నవూరూ వెళ్లడానికి ఐదున్నర గంటల సమయం పడితే, అక్కడి నుంచి మార్షల్ ఐలాండ్స్ వెళ్లడానికి మరో గంట పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పాపకు అక్కడికి తీసుకెళ్లడానికి అవసరమైన వ్యాక్సిన్లు వేసే వయసు కూడా లేదు

ప్రధాని నిర్ణయానికి గర్విస్తున్నా

11 వారాల పాపకు ఎక్కువ సేపు పాలు ఇవ్వకుండా ఉండలేకపోవడంతో ఆర్డెర్న్ సోమవారం నవూరూ వెళ్లలేకపోయారు.

పాపకు అక్కడికి తీసుకెళ్లడానికి అవసరమైన వ్యాక్సిన్లు వేసే వయసు కూడా లేదు.

మూడు రోజులపాటు జరిగే ఫోరం కోసం ఒక రోజు నవూరూ వెళ్లి రావాలని జసిండా నిర్ణయించారు.

కానీ, వైమానిక దళం విమానంలో ప్రధాని ఒక్క రోజు ప్రయాణంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపించాయి.

"మా నేత ఒక్క రోజు పర్యటనకు నవూరూ వెళ్లాలని ప్రయత్నించడం (నాకు) గర్వంగా ఉంది" అని ట్విటర్ యూజర్ ఒకరు పోస్ట్ చేశారు.

కానీ, కొందరు మాత్రం ఆమె అక్కడికి వెళ్లాల్సిన అవసరమేముంది అని ప్రశ్నించారు. "ఉప ప్రధాన మంత్రి అక్కడకు వెళ్లినప్పుడు, ఇక ఆమె అవసరం ఏముంది" అని ఇంకొకరు పోస్ట్ చేశారు.

"అక్కడికి వెళ్లకపోతే 1971 తర్వాత పసిఫిక్ ఐలాండ్స్ ఫోరంకు హాజరు కాని తొలి (న్యూజీలాండ్) ప్రధాన మంత్రిగా నిలిచేదాన్ని" అని అర్డెర్న్ చెప్పారు.

ఇది చాలా ప్రత్యేక పరిస్థితి అని భవిష్యత్తులో ఇలా జరగదని ఆమె వివరించారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)