హాంకాంగ్‌: ఇక్కడ పాఠశాల విద్య ఖర్చు ఏడాదికి రూ.94 లక్షలు

  • పీటర్ రూబిన్‌స్టెయిన్
  • బీబీసీ ప్రతినిధి
విద్య, ఖర్చు

ఫొటో సోర్స్, Getty Images

ఏ దేశంలో పిల్లలు రోజులో అతి తక్కువ సమయం పాఠశాలకు వెళతారు?

ఏ దేశంలోని తల్లిదండ్రులు పాఠశాలలో తమ పిల్లాడికి అవసరమైన వస్తువులపై అతి ఎక్కువ ఖర్చు పెడతారు?

ఏ దేశంలో ప్రతి విద్యార్థి అత్యధికంగా సగటున 23 ఏళ్ల పాటు పాఠశాలకు వెళతారు?

పాఠశాల విద్యకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు..

ఫొటో సోర్స్, Getty Images

కంప్యూటర్లపైనే ఎక్కువ ఖర్చు

అమెరికాలో ఒక కుటుంబం తమ పిల్లాడి చదువుకు అవసరమైన వస్తువులపై సగటున ఏడాదికి రూ.50 వేలు ఖర్చు చేస్తుంది. అంటే మొత్తం అమెరికాలో ఏడాదికి పిల్లలకు అవసరమైన వస్తువులపై దాదాపు రూ.2 లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఇక యూనివర్సిటీల్లో చేస్తున్న ఖర్చును కలిపితే ఇది 6 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది.

దీనిలో అత్యధికంగా ప్రతి కుటుంబం కంప్యూటర్లపై ఖర్చు చేస్తోంది. సగటున ప్రతి కుటుంబం కంప్యూటర్‌పై రూ.21 వేలు ఖర్చు చేస్తోంది. దాని తర్వాత దుస్తులపై సగటున రూ.20 వేలు ఖర్చు చేస్తున్నారు. ఆ తర్వాత ట్యాబ్లెట్స్, కాలిక్యులేటర్లు వంటి వాటిపై రూ.19.4 వేలు ఖర్చు చేస్తున్నారు. పాఠశాలలో అవసరమైన వస్తువులపై తల్లిదండ్రులు చేస్తున్న ఈ ఖర్చు యేటా పెరుగుతూనే పోతోంది. (ఆధారం: స్టాటిస్టా/డెలాయిట్)

ఫొటో సోర్స్, Getty Images

పాఠశాలలో ఏడాదికి 1000 గంటలు

33 అభివృద్ధి చెందిన దేశాలలో రష్యా విద్యార్థులు అతి తక్కువ సమయం తరగతి గదిలో గడుపుతున్నారు. రష్యా విద్యార్థులు ఏడాదిలో పాఠశాలలో ఉండే సమయం 500 గంటలు (అంతర్జాతీయ సగటు 800 గంటలు). ప్రతి పీరియడ్‌కు మధ్య బ్రేక్‌లను లెక్కిస్తే పిల్లలు రోజుకు సుమారు 5 గంటలు పాఠశాలలో ఉంటారు. ఇక్కడ ఏడాదికి 8 నెలలు మాత్రమే పాఠశాల. అయినా కూడా ఈ దేశం చదువు విషయంలో వెనుకబడలేదు. రష్యా సార్వజనిక విద్య రేటు దాదాపు 100 శాతం అని చెప్పవచ్చు.

ఇక డెన్మార్క్ విషయానికి వస్తే, ఇక్కడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఏడాదికి దాదాపు 1000 గంటలు పాఠశాలలో గడుపుతారు.

అంటే రష్యా కన్నా దాదాపు రెట్టింపు. డెన్మార్క్‌లో పాఠశాలలు రష్యాకన్నా రెండు నెలలు ఎక్కువ ఉంటాయి. విద్య విషయంలో ఐదు అత్యున్నత దేశాలలో డెన్మార్క్ ఒకటి. విద్యాసంవత్సరం ఎక్కువ కాలం ఉండడం వల్ల కూడా లాభాలు ఉన్నాయని డెన్మార్క్‌ను చూసి గ్రహించవచ్చు. (ఆధారం : ఓఈసీడీ)

ఫొటో సోర్స్, Getty Images

అతి ఎక్కువ ఖర్చు హాంకాంగ్‌లో

ప్రపంచంలోనే పాఠశాల విద్యకు అతి ఎక్కువ ఖర్చయ్యేది హాంకాంగ్‌లో. క్లాస్ ఫీజులు, పుస్తకాలు, రవాణా తదితర ఖర్చులన్నీ కలిపి ప్రాథమిక నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడ తల్లిదండ్రులు యేటా దాదాపు రూ.94 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చే రాయితీ, స్కాలర్ షిప్పులు, రుణాలు అన్నీ తీసేశాక.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ తర్వాత స్థానంలో ఉంది. ఇక్కడ పిల్లల చదువుకు ఏడాదికి సుమారు రూ.70 లక్షలు ఖర్చవుతుంది. ఆ తర్వాత స్థానంలో సింగపూర్ (రూ.50 లక్షలు), అమెరికా (రూ.42 లక్షలు) ఉన్నాయి. అయితే అమెరికాలోని యూనివర్సిటీలలో చదువుకయ్యే ఖర్చు ఎంత పెరుగుతున్నా, తల్లిదండ్రులు మాత్రం ఏడాది ఖర్చులో కేవలం 23 శాతం మాత్రమే చెల్లిస్తున్నారు.

ఇక ఫ్రాన్స్ విషయానికి వస్తే అక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల మొత్తం చదువుపై రూ.12 లక్షలు ఖర్చు చేస్తున్నారు. (ఆధారం : హెచ్‌ఎస్‌బీసీ/సాలీ మాయి)

ఫొటో సోర్స్, Getty Images

పెన్సిళ్ల కోసం ఏటా 60-80 వేల సెడార్ చెట్ల నరికివేత

అయితే విద్య మీద ఖర్చవుతున్నది కేవలం తల్లిదండ్రుల డబ్బు మాత్రమే కాదు, చెట్లు కూడా. నేటి వర్చువల్ రియాలిటీ, 3డీ ప్రింటింగ్, డ్రోన్ల కాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఇంకా పెన్సిళ్లనే వాడుతున్నారు. పెన్సిళ్లు కనిపెట్టిన సుమారు 400 ఏళ్ల అనంతరం ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు 1500-2000 కోట్ల పెన్సిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి.

అమెరికాలోని పసిఫిక్ వాయువ్య ప్రాంతంలోని సెడార్ చెట్లను పెన్సిళ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఏటా సుమారు 60-80 వేల సెడార్ చెట్లను పెన్సిళ్ల తయారీ కోసం నరికేస్తున్నారు. (ఆధారం: ద ఎకనమిస్ట్)

ఫొటో సోర్స్, Getty Images

ఏ దేశంలో ఎక్కువ కాలం చదువుతారు?

ఆస్ట్రేలియా పిల్లలు దాదాపు ఆరేళ్ల నుంచి 28 ఏళ్ల వయసు వరకు చదువుకుంటున్నారు. ఇక్కడ సగటున ప్రతి ఒక్కరూ 23 ఏళ్ల పాటు చదువుకుంటున్నారు.

ఈ జాబితాలో నైగర్ చివరిస్థానంలో ఉంది. నైగర్ పిల్లలు సగటున ఏడేళ్ల వయసులో పాఠశాల విద్యను ప్రారంభించి కేవలం 5.3 మూడేళ్లు మాత్రం చదువుకుంటున్నారు. (ఆధారం: గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్)

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)