చైనా అంటే ఆఫ్రికా దేశాలకు ఎందుకంత భయం?

  • ల్యారీ మడోవో
  • బీబీసీ ఆఫ్రికా బిజినెస్ ఎడిటర్
చైనా

ఫొటో సోర్స్, Reuters

ఆఫ్రికా దేశాలకు చైనా చాలా ఉదారంగా రుణాలు ఇస్తోంది. ఆ రుణాలే త్వరలో ఆఫ్రికా పాలిట గుదిబండగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో చైనా ఇచ్చిన రుణాల సాయంతో ఎన్నో ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. యుగాండాలో మూడు నెలల క్రితం నిర్మించిన ఎంటెబె-కంపాలా ఎక్స్‌ప్రెస్ వే ఇప్పటికీ పర్యటక ఆకర్షణగా నిలుస్తోంది.

51కిలోమీటర్ల ఈ రహదారి యుగాండా రాజధాని కంపాలాను, ఎంటెబే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతుంది. ఈ రహదారిని చైనా ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చిన 476 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3400 కోట్లు) రుణంతో చైనాకు చెందిన ఓ కంపెనీ నిర్మించింది.

గతంలో ట్రాఫిక్ చిక్కుల మధ్య ఎంతో కష్టంగా ఉండే రెండు గంటల ప్రయాణం, ఈ రహదారి కారణంగా ప్రస్తుతం 45నిమిషాల ఆహ్లాదకర ప్రయాణంగా మారింది.

యుగాండా ఇప్పటిదాకా చైనా నుంచి 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.21,500 కోట్లు) రుణాన్ని పొందింది. ‘ఈ రుణాల వల్ల చైనా సంస్థలకు భారీ వ్యాపారం కూడా దొరుకుతోంది. ముఖ్యంగా చైనా నిర్మాణ రంగ సంస్థలన్నీ కలిసి ఆఫ్రికాను రైల్వే, రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టులు, స్టేడియంలు, వాణిజ్య భవనాల నిర్మాణ కేంద్రాలుగా మార్చేశాయి’ అని మకెరెరె యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ ఒకరు బీబీసీతో చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

యుగాండాలో చైనా నిర్మించిన రహదారి

ఈ రుణాల వల్ల ఆఫ్రికా దేశాలు మరోసారి అప్పుల్లో కూరుకుపోయి వాటిని తిరిగి చెల్లించలేని స్థితిలోకి జారుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆఫ్రికాలో తక్కువ ఆదాయం ఉన్న 40శాతం దేశాలు అప్పుల పాలయ్యాయి. వాటిలో కొన్ని దేశాల స్థితి మరింత క్లిష్టంగా ఉంది అని ఏప్రిల్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది.

2017 చివరి నాటికి చాద్, ఎరిత్రియా, మొజాంబిక్, కాంగో రిపబ్లిక్, దక్షిణ సూడాన్, జింబాబ్వేలు అప్పుల ఊబిలో కూరుకున్నాయి. జాంబియా, ఇథియోపియాల్లో పరిస్థితి మరింత దిగజారింది.

కేవలం 2017లోనే ఆఫ్రికాలో కొత్తగా సంతకం చేసిన చైనా ప్రాజెక్టుల కాంట్రాక్టుల విలువ 76.5బిలియన్ డాలర్లకు(దాదాపు రూ.5.5లక్షల కోట్లు) చేరిందని చైనాకు చెందిన ఆర్థికవేత్త జెరెమీ స్టీవెన్స్ పేర్కొన్నారు.

త్వరలో ఆఫ్రికన్ దేశాలకు కొత్త అప్పులు తీసుకొనే వెసులుబాటు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో రుణాల రూపంలో చైనా అందిస్తోన్న అభయ హస్తం తమను ఎటు తీసుకెళ్తుందోననే భయం ఆఫ్రికన్ దేశాల్లో పెరుగుతోంది.

ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ది యురోపియన్ కమిషన్, ది వరల్డ్ బ్యాంక్, జీ 8 దేశాలు, యురోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కమిషన్‌లు కలిసి ఆఫ్రికాలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అందిస్తున్న సాయం కంటే ఒక్క చైనా అందిస్తున్న ఆర్థిక సాయమే ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇథియోపియాలో చైనా నిర్మించిన రైల్వే వ్యవస్థ

చైనా ఇస్తున్న ఈ రుణాల ప్రభావం ఆఫ్రికావ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త విమానాశ్రయాలు, రహదారులు, భవంతులూ చకచకా వెలుస్తున్నాయి. ఉపాధి కల్పన మెరుగవుతోంది.

గతంతో పోలిస్తే 2012 నుంచి ఆఫ్రికాలో చైనా పెట్టుబడుల విలువ మూడింతలు పెరిగింది. అంగోలాలో అయితే మరింత ఎక్కువగా ఉంది. అంగోలాలో రుణాలకు ప్రతిగా చైనా ఆ దేశం నుంచి భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంది.

ఆఫ్రికా చైనాల లావాదేవీల్లో ఆఫ్రికా కూడా లాభపడినట్లే కనిపిస్తున్నా, పై చేయి మాత్రం చైనాదేనని, తమకు ఎక్కువ అనుకూలంగా ఉండే ఒప్పందాల ప్రకారమే రుణాలు మంజూరు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. 2025నాటికి ఆఫ్రికాలోని చైనా సంస్థల ఆదాయం 31లక్షల కోట్లకు చేరుతుందని వాళ్లు అంచనా వేస్తున్నారు.

కేవలం ఒక దేశంతోనే వ్యాపారం చేస్తే అత్యుత్తమ డీల్స్ ఎలా వస్తాయని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.

విదేశాల్లో వ్యాపార కాంట్రాక్టుల కోసం లంచం ఇవ్వడం అనేది కొన్ని పాశ్చాత్య దేశాల్లో నేరం. కానీ చైనాలో అలాంటి చట్టాలేవీ లేవు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దక్షిణ సూడాన్ అధ్యక్షుడు సాల్వాకిర్ మయరిట్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

‘ఏ ప్రాజెక్టునైనా దాని ద్వారా కలిగే ఉపయోగాలు, అందే లాభాల ఆధారంగానే లెక్కగట్టాలి. చైనాతో లావాదేవీల్లో ఆఫ్రికా ప్రభుత్వాలు కూడా ఎంత పారదర్శకంగా ఉంటున్నాయన్నది ముఖ్యం’ అని ఆర్థిక నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిజ్ బీబీసీతో చెప్పారు.

చైనా నుంచి పొందుతున్న రుణాలను ఆఫ్రికన్ దేశాలు తిరిగి చెల్లించలేకపోవచ్చనే అనుమానాలను 2015లోనే జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వ్యక్తం చేసింది. చైనాతో పాటు మరి కొన్ని దేశాలు, సంస్థల నుంచి తీసుకున్న రుణాలు కూడా ఆఫ్రికాపై అప్పుల ఒత్తిడి పెంచుతున్నాయి.

రహదారులు, రైల్వే లైన్లు కాకుండా ఉపాధిని కల్పిస్తూ ఇతర దేశాల పెట్టుబడులను ఆకర్షించే సెజ్‌లు, పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు కోసం ఆఫ్రికాలో చైనా డబ్బును ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

చైనా కూడా అలాంటి నిర్మాణాల్లో పెట్టుబడులు పెడతామని మాటిస్తూ వచ్చింది తప్ప, ఇప్పటిదాకా అలాంటి పని చేయలేదు.

ప్రస్తుతానికి ఆఫ్రికా వాసులు చైనా నిర్మించిన అత్యాధునిక రహదారులపై ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఈ రుణాలే తమను అప్పుల ఊబిలో పూర్తిగా ముంచేస్తాయనే భయాలు వాళ్లలో నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)