ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక: శారీరక వ్యాయామం చేయని ప్రతి నలుగురిలో ఒకరికి ముప్పు
- అలెక్స్ థెరియెన్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, iStock
ప్రపంచవ్యాప్తంగా శారీరక వ్యాయామం చేయడం బాగా తగ్గిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచంలో నాలుగో వంతు జనాభా, అంటే 140 కోట్ల మంది తగినంత శారీరక వ్యాయామం చేయడం లేదని, 2001 తర్వాత వ్యాయామం చేసేవారి సంఖ్య చాలా తక్కువగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో చెప్పింది.
వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె వ్యాధులు, టైప్-2 మధుమేహం, కొన్ని క్యాన్సర్లు లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతోంది.
బ్రిటన్ సహా అధిక ఆదాయం వచ్చే దేశాల్లో చాలా తక్కువ మంది వ్యాయామం చేస్తున్నారని ఈ నివేదికలో చెప్పారు.
ఆప్రికాలోని రెండు ప్రాంతాలు మినహా, ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎక్కువగా వ్యాయామం చేయడం లేదని కూడా ఇందులో గుర్తించారు.

ఫొటో సోర్స్, Thinkstock
ప్రధాన ఆందోళన
168 దేశాల్లో 19 లక్షల మందిపై చేసిన 358 జనాభా ఆధారిత సర్వేల్లోని వ్యాయామం వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) పరిశీలించింది. లాన్సెట్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం కోసం గణాంకాలు రూపొందించింది.
బ్రిటన్, అమెరికా సహా ఎక్కువ ఆదాయం వచ్చే దేశాల్లో శారీరక శ్రమ చేయని ఉన్న వారి సంఖ్య 2001లో 32 శాతం నుంచి 2018లో 37 శాతానికి పెరిగిందని ఇందులో గుర్తించారు. అయితే తక్కువ ఆదాయం వచ్చే దేశాల్లో మాత్రం అది స్థిరంగా 16 శాతం దగ్గరే ఉంది.
ఒక వారంలో 150 నిమిషాలకంటే తక్కువగా సాధారణ వ్యాయామం చేసేవారు లేదా 75 నిమిషాల కంటే తక్కువగా కఠిన వ్యాయామం చేసేవారిని కూడా ఈ జాబితాలో చేర్చారు.
తగినంత శారీరక వ్యాయామం చేయని వారున్న దేశాల్లో జర్మనీ, న్యూజీలాండ్, అమెరికా కూడా ఉన్నాయి.
తూర్పు, ఆగ్నేయ ఆఫ్రికాలో తప్ప దక్షిణాసియా, మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ దేశాల్లో పురుషుల కంటే మహిళలు తక్కువ యాక్టివ్‌గా ఉన్నారని ఈ నివేదికలో చెప్పారు.
పిల్లల పోషణ, కొన్ని ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయాల వంటి చాలా కారణాల వల్ల మహిళలకు వ్యాయామం చేయడం కష్టం అయ్యుండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
బ్రిటన్‌లో, శారీరక శ్రమ చేయని వారు 2016లో ఒవరాల్‌గా 36 శాతం ఉండగా అది పురుషులలో 32 శాతం, మహిళలో 40 శాతం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
లక్ష్యం అందుకోవడం సాధ్యమేనా?
సంపన్న దేశాల్లో ఎక్కువగా స్థిరమైన ఉద్యోగాలు ఉండడం, రవాణాకు ఎక్కువగా తమ వాహనాలు ఉపయోగించడం, వారి అలవాట్లు కూడా వారిని శారీరక వ్యాయామం లేకుండా చేస్తున్నాయని ఈ పరిశోధనలో తేలింది.
అయితే, తక్కువ ఆదాయం వచ్చే దేశాల్లో మాత్రం ప్రజలు ఎక్కువగా తమ పనుల్లో చురుకుగా ఉంటున్నారు, నడవడం లేదంటే ప్రజా రవాణాను ఉపయోగించడం వంటివి చేస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి శారీరక వ్యాయామం చేయకపోవడం అనే సమస్యను 10 శాతం తగ్గించాలనుకుంటోంది. కానీ, ఇది ఇలాగే కొనసాగితే ఆ లక్ష్యం చేరలేకపోవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
"ప్రపంచంలో చాలా మంది తగినంత శారీరక శ్రమ చేస్తున్నారు. కానీ పెద్దవారిలో సగటున నాలుగోవంతు మంది ఆరోగ్యంగా ఉండడానికి నిర్దేశించిన శారీరక వ్యాయామం చేయడం లేదు" అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డబ్ల్యుహెచ్ఓ డాక్టర్ రెజీనా గుతోల్డ్ చెప్పారు.
రోజూ తగినంత శారీరక వ్యాయామం చేయని వారి సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల ఆరోగ్యం, వ్యాధుల నివారణ, వాటి అదుపు గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"శారీరక వ్యాయామం చేసే పురుషులు, మహిళల మధ్య ఉన్న ఈ అసమానతల ప్రకారం గ్లోబల్ యాక్టివిటీ టార్గెట్ సాధించడం కష్టం. మహిళలకు సురక్షితంగా, తక్కువ ధరలో, వారి సంస్కృతికి ఆమోదయోగ్యంగా వ్యాయామం చేసే అవకాశాలను అందించాలి. వాటి గురించి ప్రచారం చేయాలి" అని డబ్ల్యుహెచ్ఓకు చెందిన మరో డాక్టర్ ఫియోనా బుల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
19 నుంచి 64 ఏళ్ల వారికి వ్యాయామం గైడ్‌లైన్స్
వ్యాయామం ఎంత సేపు చేయాలి?
- ప్రతివారం కనీసం 150 నిమిషాలు మితంగా ఉండే ఏరోబిక్ యాక్టివిటీ లేదా 75 నిమిషాల కఠిన వ్యాయామం చేయాలి
- వారంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ప్రధాన కండరాలన్నీ పనిచేసేలా బలమైన వ్యాయామం చేయాలి
- తేలికపాటి పనులు చేసేటపుడు ఎక్కువ సేపు కూచోకుండా విరామం ఇస్తుండాలి
మిత ఏరోబిక్ వ్యాయామం అంటే?
- వేగంగా నడవడం, వాటర్ ఏరోబిక్స్, సమంగా ఉన్న నేలపై లేదా చిన్న గుట్టలపై సైకిల్ తొక్కడం, టెన్నిస్ డబుల్స్ ఆడడం, లాన్ మూవర్ నెట్టడం, హైకింగ్, స్కేట్ బోర్డింగ్, రోలర్ బ్లేడింగ్, వాలీబాల్, బాస్కెట్ బాల్ ఆడటం వంటివి.
కఠిన వ్యాయామంలో ఏమేం ఉంటాయి?
- జాగింగ్ లేదా రన్నింగ్, వేగంగా ఈత కొట్టడం, వేగంగా లేదా కొండపై సైకిలు తొక్కడం, సింగిల్స్ టెన్నిస్, ఫుట్ బాల్, రగ్బీ, రోప్ స్కిప్పింగ్, హాకీ, ఏరోబిక్స్, జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ వంటివి.
కండరాలకు బలం ఇచ్చే వ్యాయామం ఏది?
- బరువులు ఎత్తడం, సాగే బ్యాండ్స్‌తో వ్యాయామం, మీ శరీరం బరువు ఉపయోగించి పుషప్స్, సిటప్స్ లాంటి వ్యాయామం, గుంతలు తవ్వడం లాంటి కఠినమైన తోట పనులు, యోగా చేయటం.
ఏరోబిక్ వ్యాయామం, కండరాలకు బలం కోసం ఏం చేయాలి?
- సర్క్యూట్ ట్రైనింగ్, ఏరోబిక్స్, రన్నింగ్, ఫుట్ బాల్, రగ్బీ, నెట్ బాల్, హాకీ వంటివి.
-ఎన్‌హెచ్ఎస్ సౌజన్యంతో

ఫొటో సోర్స్, Getty Images
శారీరక శ్రమ చేయనివారు ఎక్కువగా ఉన్న దేశాలు:
- కువైట్ 67 శాతం
- సౌదీ అరేబియా 53 శాతం
- ఇరాక్ 52 శాతం
శారీరక శ్రమ చేయని వారు తక్కువగా ఉన్న దేశాలు
- యుగాండా, మొజాంబిక్ 6 శాతం
క్రీడలను ప్రచారం చేసి, తగిన మౌలిక సదుపాయాలను కల్పించాలని, నడక, సైకిలుపై వెళ్లేవారిని ప్రోత్సహించాలని నిపుణులు ప్రభుత్వాలను కోరుతున్నారు.
"ఆర్థికాభివృద్ధి జీవనశైలిలో మార్పులకు కారణమైనప్పుడు, అది ప్రజలకు శారీరక శ్రమ దూరమయ్యేలా చేస్తుంది, ప్రజలు మరింత చురుకుగా ఉండేందుకు ప్రభుత్వం సాయం చేయాలి. సైకిల్, నడక సులభం అయ్యేలా ప్రజా రవాణాను మెరుగు పరచాలి" అని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మెలొడీ డింగ్ అన్నారు.
ఇవికూడా చదవండి:
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- ఎవరు ఎక్కువ ఆరోగ్యవంతులు.. మగవాళ్లా లేక ఆడవాళ్లా?
- వృద్ధుల్లోనూ బలంగానే సెక్స్ కోరికలు
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- ఈ మిరపకాయ తింటే ఆసుపత్రిపాలే!
- మీ మైండ్ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- నిద్రలోకి జారే ముందు అసలేం జరుగుతుంది?
- ‘జీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లు’
- ‘రాహుల్ గాంధీ కైలాశ్ మానస సరోవర్ యాత్రకు నిజంగానే వెళ్లారా? ఫొటోషాప్ చేస్తున్నారా?’
- న్యూజీలాండ్: ప్రత్యేక విమానంలో ప్రయాణించిన ప్రధాని జసిండా ఆర్డెర్న్.. రూ.38 లక్షల అదనపు వ్యయంపై విమర్శలు
- క్రయానిక్స్: చనిపోయాక బతకొచ్చా? మృత్యువును కూడా మోసం చేయొచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)