మైక్ పాంపియో: పాక్-అమెరికా సంబంధాల పునరుద్ధరణే లక్ష్యంగా ఇమ్రాన్ ఖాన్‌తో చర్చలు

  • 5 సెప్టెంబర్ 2018
మైక్ పాంపియో Image copyright AFP
చిత్రం శీర్షిక మైక్ పాంపియో

పాకిస్తాన్‌తో ఇటీవల కాలంలో సన్నగిలిన సంబంధాలను పునరుద్ధరించుకునే లక్ష్యంతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పాక్ పర్యటనకు వచ్చారు. పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో ఆయన చర్చలు జరపనున్నారు. ఆ తరువాత ఆయన భారతదేశంలో కూడా పర్యటిస్తారు.

అఫ్గాన్ తాలిబన్ మిలిటెంట్లకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తోందంటూ గత కొన్నాళ్లుగా అమెరికా ఆరోపిస్తున్న క్రమంలో రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. అమెరికా ఆరోపణలను పాక్ ఖండిస్తోంది.

ఇంతకుముందు ఈ ఏడాది అమెరికా.. పాకిస్తాన్‌కు తాను అందించే సుమారు బిలియన్ డాలర్ల రక్షణ సహాయాన్ని నిలిపివేసింది.

అమెరికాలో నిలిపివేసిన రక్షణ సహాయంలో సింహభాగం తాము ఇప్పటికే ఉగ్రవాదంపై పోరు కోసం చేసిన ఖర్చుకు గాను తమకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమని పాక్ అంటోంది.

కాగా పాక్‌లో ఒక రోజు పర్యటన తరువాత పాంపియో భారత్ రానున్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక పాకిస్తాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్

కొత్త నాయకుడితో సరికొత్త సంబంధాలు

పాంపియో తన పర్యటనపై మాట్లాడుతూ, అమెరికా-పాకిస్తాన్ సంబంధాలలో ఎన్నో సవాళ్లున్నాయని చెబుతూనే రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందన్న ఆశాభావం కనబరిచారు.

''పాక్‌లో కొత్త నాయకుడొచ్చారు. రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని ఆయన కూడా కోరుకుంటున్నార''ని పాంపియో అన్నారు.

మరోవైపు పాంపియో తన పర్యటనలో భాగంగా పాక్ సైన్యాధ్యక్షుడు ఖమర్ జావేద్ బజ్వాను కూడా కలవనున్నారు.

అఫ్గాన్ తాలిబన్ మిలిటెంట్లకు, వారి అనుబంధ హక్కానీ నెట్‌వర్క్‌కు పాకిస్తాన్ మద్దతిస్తోందని.. పాక్ భూభాగం నుంచి అఫ్గానిస్తాన్‌లో దాడులకు సహకరిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.

Image copyright AFP
చిత్రం శీర్షిక హఖానీ

‘అఫ్గాన్ తిరుగుబాటుదారులకు ఆశ్రయం’

అఫ్గాన్ యుద్ధ సమయంలో అంతర్జాతీయ బలగాలు తమ భూభాగాన్ని వాడుకునేందుకు పాక్ అనుమతివ్వడంతో పాటు అల్‌ఖైదా వంటి సంస్థలతో జరిగిన పోరాటంలో పశ్చిమ దేశాలకు పాక్ సహకరించింది.

అయితే, ప్రస్తుతం ఆ దేశం అఫ్గాన్ తిరుగుబాటుదారులకు ఆశ్రయం ఇస్తుండడంతో పాటు మద్దతునూ కొనసాగిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రాంతీయంగా తమకు ప్రధాన శత్రువైన భారత్ ప్రభావం అఫ్గాన్‌లో తగ్గించడమే లక్ష్యంగా పాక్ ఇలా చేస్తోందన్నది వారి మాట.

కాగా, అందరి లక్ష్యం అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొల్పడమేనని ఇమ్రాన్ ఖాన్ తనతో చెప్పారని, సరైన పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు సైనిక సహాయాన్ని పునరుద్ధరించే అవకాశం ఉందని ఆయన అన్నారు.

పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా చూసేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి ఆర్థిక ఉద్దీపనలు పొందే విషయంలో పాకిస్తాన్‌కున్న ప్రణాళిక మీద కూడా చర్చించే అవకాశం ఉందన్నారు.

Image copyright AFP

భారత్‌ పర్యటనలో..

ఇరాన్ నుంచి చమురు దిగుమతులు, రష్యా నుంచి క్షిపణుల కొనుగోళ్ల విషయంలో భారత్‌ మీద పాంపియో ఒత్తిడి పెంచే అవకాశాలున్నాయి.

భారత్-అమెరికా సైనిక సహకారానికి సంబంధించిన ఒప్పందాలను ఖరారు చేసుకోవాలనీ అమెరికా కోరుకుంటోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

శ్రీలంక పేలుళ్లు: మృతుల్లో 10 మంది భారతీయులు ‘ఏప్రిల్ మొదట్లోనే హెచ్చరించిన భారత్, అమెరికా నిఘా సంస్థలు’

ఈవీఎం వీవీ ప్యాట్‌ నుంచి రశీదు వస్తుందనుకుంటే పాము వచ్చింది

డాకర్ ర్యాలీ: 5,600 కి.మీ. అత్యంత క్లిష్టమైన బైక్ రేస్‌ను పూర్తిచేసిన ఏకైక మహిళ

లోక్‌సభ ఎన్నికలు 2019: సాయంత్రం 5 గంటలకు 62.16 శాతం పోలింగ్.. బెంగాల్‌లో ఘర్షణలు ఒకరి మృతి

భారత ఓటర్లు ఏం కోరుకుంటున్నారు.. బలమైన నాయకత్వమా, ప్రజాస్వామ్యమా

సీజేఐ గొగోయ్ మీద లైంగిక ఆరోపణలు: ఈ కేసు #MeToo కంటే పెద్దది. ఎందుకంటే..

ప్రెస్ రివ్యూ: ‘ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ. 8750 కోట్లు.. అంతా అవినీతి డబ్బే’

భారత్‌లో ఫేక్ న్యూస్, వదంతుల కారణంగా జరిగిన మొదటి మూకదాడి, హత్య ఇదేనేమో - Ground Report