స్వలింగ సంపర్కం - సెక్షన్ 377 : ఆరు రంగుల జెండా అసలు కథ

ఆరు రంగుల జెండా

ఫొటో సోర్స్, Getty Images

దేశ వ్యాప్తంగా గురువారం చాలా ప్రాంతాల్లో ఆరు రంగుల జెండా రెపరెపలాడింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు ప్రకటించడంతో ఎల్‌జీబీటీ సభ్యులు, మద్దతుదారులంతా ఆరు రంగుల జెండాతో సంబరాలు చేసుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇంద్ర ధనుస్సు రంగుల జెండాకు చాలా గుర్తింపు ఉంది. అనేక దేశాల్లో ప్రదర్శనలు, ఆందోళనల్లో ఈ పతాకాన్నే ఎగురవేస్తారు. ఎల్‌జీబీటీల కార్యక్రమాల్లో ఇది ఎక్కువగా కనిపించినా ఇది కేవలం వాళ్లకు మాత్రమే పరిమితమైంది కాదు. మానవ హక్కులకు సంబంధించిన ప్రదర్శనల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు.

ఎల్‌జీబీటీల కార్యక్రమాల కోసం ఈ జెండాను ఉపయోగించడం నలభై ఏళ్ల క్రితం... అంటే 1978లోనే మొదలైంది.

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన గిల్బర్ట్ బేకర్ అనే కళాకారుడు మొదట ఎనిమిది రంగులతో ఈ జెండాను డిజైన్ చేశారు. లెస్బియన్, గే, బై సెక్సువల్ లాంటి భిన్న వర్గాలను సూచించేందుకు ఈ రంగులు వాడారు. ఆ ఏడాది జూన్ 25న ‘గే ఫ్రీడం డే’ నాడు మొదటిసారి ఈ జెండాలు వీధుల్లో రెపరెపలాడాయి.

‘లైంగిక భావన అనేది ప్రకృతి సహజమైనది. అందుకే ప్రకృతిలో ఉండే వనరులతోనే ఆ భావనను సూచించాలని ఇంద్ర ధనుస్సు రంగులను ఎంచుకున్నా’ అని బేకర్ గతంలో చెప్పారు.

క్రమంగా ఆ జెండా శాన్‌ఫ్రాన్సిస్కోను దాటి ఆ జెండా న్యూయార్క్, లాస్ ఏంజెలెస్ లాంటి నగరాలకూ చేరింది. 1990ల నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆ జెండాను ఎల్‌జీబీటీల హక్కులకు సంకేతంగా గుర్తించడం మొదలైంది.

ఆరు రంగుల జెండా

ఫొటో సోర్స్, Getty Images

గతంలో ఇలాంటి కార్యక్రమాలకు ‘గులాబీ త్రికోణాన్ని’ ఉపయోగించేవారు. కానీ ఇంద్రధనుస్సు రంగులు మరింత సానుకూల భావనను, స్ఫూర్తిని రగిలిస్తాయనే ఉద్దేశంతో క్రమంగా ఈ జెండాను ఉపయోగించడం మొదలుపెట్టారు.

బేకర్ రూపొందించిన జెండాలోని ఒక్కో రంగు ఒక్కో భావనకు ప్రతీక

గులాబీ: లైంగికత

ఎరుపు: జీవితం

ఆరెంజ్: స్వస్థత

పసుపు: సూర్య రశ్మి

ఆకుపచ్చ: ప్రకృతి

లేత నీలం: కళ

ఇండిగో: సుహృద్భావం

ఊదా రంగు: మానవత్వ స్ఫూర్తి

ఆరు రంగుల నాట్

ఫొటో సోర్స్, Getty Images

మొదట జెండా రూపొందించినప్పుడు ఉన్న 8 చారలను తరువాత 6 చారలకు, రంగులకు కుదించారు. లేత నీలం రంగును నీలంలోకి మార్చి, గులాబీ, ఊదా రంగులను తొలగించారు.

గతంలో గులాబీ రంగును తయారు చేయడం కష్టంగా ఉండేది. దానికితోడు ఇప్పటిలా జెండాలను ముద్రించడం కాకుండా, అందుబాటులో ఉన్న వస్త్రాలతోనే జెండాలను కుట్టేవారు. ఈ జెండా కోసం ఉపయోగించిన రంగులు సాదాగా ఉండటంతో వీటికి త్వరగా ఆమోదముద్ర పడింది.

కానీ ఈ జెండాను వ్యతిరేకించే దేశాలు కూడా చాలా ఉన్నాయి. జమైకా కూడా అందులో ఒకటి. ఆ దేశంలో గే సెక్స్ నేరం. ఆర్లెండో కాల్పులు జరిగినప్పుడు ఆ దేశంలో ఉన్న అమెరికన్ ఎంబసీపై ఇంద్రధనుస్సు రంగుల జెండాను ఎగురవేయడాన్ని జమైకా అటార్నీ జనరల్ అవమానంగా భావించారు. ఎల్‌జీబీటీలను సూచించే ఆ జెండా ఎగురవేయడమంటే తమను కించపరిచినట్లేనని ఆయన అన్నారు.

ఎల్‌జీబీటీల కోసమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సుహృద్భావం, మానవ హక్కుల కోసం నిర్వహించే అనేక ప్రదర్శనల్లో ఈ జెండాను ఉపయోగించడం ఆనవాయతీగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)