నోవిచోక్ దాడి: 'ఆ దారుణాలకు బాధ్యుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌' -బ్రిటన్ మంత్రి బెన్

లండన్‌లో రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో సీసీ టీవీ కెమేరాలకు చిక్కిన అలెగ్జాండర్ పెత్రోవ్, రుస్లాన్ బొషిరోవ్

ఫొటో సోర్స్, Metropolitan police

ఫొటో క్యాప్షన్,

లండన్‌లో రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో సీసీ టీవీ కెమేరాలకు చిక్కిన అలెగ్జాండర్ పెత్రోవ్, రుస్లాన్ బొషిరోవ్

కలకలం సృష్టించిన నోవిచోక్ రసాయనిక విష ప్రయోగానికి రష్యాయే కారణమని ఆరోపిస్తూ ఆ దేశానికి ఇద్దరు పౌరుల పేర్లను బ్రిటన్ వెల్లడించింది. బ్రిటన్‌లోని సాలిస్‌బరీలో మార్చిలో జరిగిన నోవిచోక్ దాడిలో మాజీ గూఢచారి స్క్రిపాల్, ఆయన కుమార్తె యూలియాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం జూన్‌లోనూ ఈ విష ప్రభావానికి ఓ జంట గురికాగా అందులో ఒకరు మరణించారు.

ఈ విషప్రయోగ నేపథ్యంలో బ్రిటన్, రష్యాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా బలహీనమయ్యాయి.

తాజాగా బ్రిటన్ దీనిపై భద్రతా మండలి సమావేశం నిర్వహించాలని ఐరాసలో పట్టుపట్టడంతో గురువారం ఈ సమావేశం నిర్వహించారు.

కాగా తమ దేశంలో జరిగిన నోవిచోక్ విషప్రయోగానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బాధ్యత వహించాలని బ్రిటన్ భద్రతా మంత్రి బెన్ వాలెస్ అన్నారు.

'ఈ విషప్రయోగం వెనుక కచ్చితంగా పుతిన్ ఉన్నారు' అని ఆయన 'బీబీసీ'తో అన్నారు.

అయితే... ఈ దాడులతో తమకు సంబంధం లేదని రష్యా ఖండిస్తోంది. తమ దేశాధ్యక్షుడిపై వేస్తున్న నిందలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెబుతోంది.

మరోవైపు రష్యా సైనిక నిఘా సంస్థ 'జీఆర్‌యూ'కి చెందినవారిగా భావిస్తున్న ఇద్దరు ఈ దాడిలో ప్రధాన నిందితులంటూ బ్రిటన్ వారి పేర్లు వెల్లడించింది.

ఫొటో క్యాప్షన్,

అలెగ్జాండర్ పెత్రోవ్, రుస్లాన్ బొషిరోవ్

రష్యా మాజీ గూఢచారి సెర్గీ స్క్రిపాల్(66), ఆయన కుమార్తె యూలియా(33)లపై మార్చి 4న నోవిచోక్ విషప్రయోగం జరిగింది. ఈ ఘటనాస్థలానికి వెళ్లి వారిని రక్షించిన డిటెక్టివ్ సార్జెంట్ నిక్ బెయిలీ కూడా విష ప్రభావంతో అనారోగ్యం పాలయ్యారు.

కాగా జూన్ 30న జరిగిన మరో నోవిచోక్ విషప్రయోగ ఘటనకు దీనికి సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషప్రయోగంలో డాన్ స్టర్జెస్ ప్రాణాలు కోల్పోయారు.

‘రష్యా పాస్‌పోర్ట్‌లతోనే వచ్చారు’

బ్రిటన్ అభియోగాలు మోపిన ఇద్దరి పాత్ర ఈ ఘటనల్లో ఉందనడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయని న్యాయవాదులు అంటున్నారు. అలాగే ఈ దర్యాప్తునకు సంబంధించిన వివరాలను బ్రిటన్ అధికారులు ఐరాస భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్తున్నారు.

కాగా, అనుమానితులిద్దరూ అలెగ్జాండర్ పెత్రోవ్, రుస్లాన్ బొషిరోవ్ పేర్లతో ఉన్న రష్యా పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి తమ దేశంలోకి ప్రవేశించారని బ్రిటన్ ప్రధాని థెరెసా మే కూడా చెప్పారు.

ఇదేదో ఆకతాయిగా జరిగిన ఘటన కాదని.. రష్యాలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారి ఆమోదంతోనే జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

బ్రిటన్ భద్రతా మంత్రి బెన్ వాలెస్ దీనిపై మాట్లాడుతూ, ''ఆమోదయోగ్యం కాని రష్యా తీరు నిరసిస్తూ భద్రతా మండలి సమావేశంలో ఒత్తిడి పెంచుతాం'' అన్నారు.

ఈ వ్యవహారంపై చర్చించేందుకు గురువారం భద్రతా మండలి ప్రత్యేకంగా సమావేశమయ్యేలా బ్రిటన్ ఐరాసపై ఒత్తిడి చేసింది.

సైనిక నిఘా సంస్థ 'జీఆర్‌యూ'కు నిధులు సమకూర్చడం, ఆదేశాలివ్వడం అంతా రష్యా ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని.. ప్రభుత్వంపై పుతిన్ నియంత్రణ లేదని ఎవరూ అనుకోరని ఆయన అన్నారు.

ఇక మార్చిలో జరిగిన ఘటన విషయానికొస్తే మార్చి 4న ఇది జరిగిన నాడు హీత్రూ విమానాశ్రయ సీసీ కెమేరాల్లో అలెగ్జాండర్ పెత్రోవ్, రుస్లాన్ బొషిరోవ్‌లు ఒక సూట్‌కేస్‌తో బయటకు వెళ్లడం కనిపించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లండన్‌లోని పలు ప్రాంతాల్లో సీసీ టీవీల్లో వీరు కనిపించారు.

విమానశ్రయ కెమేరాల్లో పెత్రోవ్ వద్ద ఈ సూట్‌కేస్ కనిపించినప్పటికీ ఆయన లండన్‌లో దిగేటప్పుడు ఆయన వద్ద ఈ సూట్‌కేస్ లేదు.

దీనిపై కౌంటర్ టెర్రరిజం అధికారులూ దర్యాప్తు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Metropoltan Police

ఫొటో క్యాప్షన్,

అలెగ్జాండర్ పెత్రోవ్, రుస్లాన్ బొషిరోవ్

'వారిద్దరూ మార్చి 2నే వచ్చారు'

లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు చెబుతున్న ప్రకారం, ఆ ఇద్దరూ మార్చి 2నే మాస్కో నుంచి గాత్విక్ విమానాశ్రయానికి వచ్చారు. తూర్పు లండన్‌లోని ఒక హోటల్‌లో దిగారు.

మార్చి 4న వారు సాలిస్‌బరీ వెళ్లారు. అంతకుముందు రోజు వారు రెక్కీ నిర్వహించినట్లు భావిస్తున్నారు. స్క్రిపాల్‌పై దాడి తరువాత మార్చి 4 రాత్రి వారు హీత్రూ విమానాశ్రయం నుంచి మాస్కో వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు.

వారు లండన్‌లో బస చేసిన హోటల్ గదిలోనూ నోవిచోక్ ఆనవాళ్లు దొరికాయని, అయితే, ఆ హోటల్లో బస చేసిన ఇతర అతిథులెవరికీ దీనివల్ల అపాయం కలగలేదని పోలీసులు తెలిపారు.

ఆ రోజు నుంచి మే 4 వరకు అక్కడ బస చేసిన వారు ఎవరైనా దీనికి సంబంధించిన సమాచారం ఉంటే తమకు తెలపాలని పోలీసులు కోరుతున్నారు.

సాలిస్‌బరీకి సమీపంలోని అమెస్‌బరీలో స్ట్రగ్రెస్, చార్లీ రోలీలు నోవిచోక్ ప్రభావానికి గురయ్యారు. 'నీనా రిక్కీ ప్రీమియర్ జోర్ పెర్ఫ్యూమ్' అన్న పేరుతో కనిపించిన ఒక కంటెయినర్‌ను పట్టుకోవడంతో వారు ఈ విష ప్రభావానికి లోనయ్యారు.

తమకు దొరికిన బాక్స్‌లో ఒక బాటిల్, దాన్ని రాసుకునేందుకు వాడే సామగ్రి ఉన్నాయని.. వాటిని పట్టుకున్నప్పుడు అందులో ఉన్నది కొంత తనపై పడిందని.. కానీ, తన భాగస్వామి స్ట్రగ్రెస్ దాన్ని తన మణికట్టుకు రాసుకోవడంతో ఆమె అస్వస్థతకు గురైందని రోలీ తెలిపారు.

కాగా, ఆ సీసాలో నోవిచోక్ ఉండడంతోనే ఇలా జరిగిందని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, EPA/yuliaskripal/facebook

ఫొటో క్యాప్షన్,

స్క్రిపాల్, యూలియా

మార్చి 4న ఏమైంది..?

రష్యాలో సైనికాధికారిగా పనిచేసిన సెర్గీ స్క్రిపాల్(66), ఆయన కుమార్తె యూలియా(33)లు సాల్స్‌బరీలోని ఒక వీధిలోని బెంచ్‌పై అచేతనంగా పడి ఉండగా స్థానికులు చూశారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా రసాయనిక విషప్రయోగానికి గురైనట్లు వైద్యులు ప్రాథమిక పరీక్షలతోనే చెప్పేశారు.

దీంతో దర్యాప్తు జరిపిన పోలీసులు వీరిద్దరూ కలిసి భోజనం చేసిన జిజ్జీ రెస్టారెంట్‌లోని టేబుల్ మీద, టేబుల్ పరిసర ప్రాంతంలో నొవిఛోక్ అవశేషాలను గుర్తించారు. జీజ్జీ రెస్టారెంట్‌కు సమీపంలో ఉండే మిల్ పబ్‌లో కూడా ఈ అవశేషాలను గుర్తించారు.

అప్పటి నుంచి రష్యా, బ్రిటన్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్,

డాన్ స్టర్జెస్, ఛార్లీ రౌలే

రెండో ఘటనలో ఏమైంది?

ఈసారి సాల్స్‌బరీకి సమీపంలోనే ఛార్లీ రౌలే, డాన్ స్టర్జెస్‌ దంపతులు తీవ్ర అస్వస్థతకు గురై స్పృహతప్పి పడిపోయారు.

వైద్య పరీక్షలు నిర్వహించగా వారిపై నోవిచోక్ అనే నర్వ్ ఏజెంట్‌ను ప్రయోగించారన్న విషయం బయటపడింది.

దీంతో బ్రిటన్ మరింత అప్రమత్తమైంది.

ఏమిటీ 'నోవిచోక్'?

నోవిచోక్ అంటే రష్యా భాషలో.. 'కొత్తగా వచ్చిన వాడు' అని అర్థం. ఈ విష రసాయనం.. రష్యా గూఢచార సంస్థకు చెందినది. ఈ రసాయనాన్ని 1970-80 మధ్య కాలంలో రష్యా తయారు చేసింది.

ఏ-230 అనే మరో విష రసాయనం వీఎక్స్ నెర్వ్ ఏజెంట్ కంటే ఐదు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రమాదకారి. ఇది మనుషులను నిమిషాల వ్యవధిలోనే హతమారుస్తుంది.

ఇందులో కొన్ని ద్రవ రూపంలో ఉంటే, మరికొన్ని ఘన రూపంలో ఉంటాయి. తక్కువ సామర్థ్యం కలిగిన రెండు రకాల విష రసాయనాలు కూడా ఉంటాయి. కానీ, ఈ రెంటినీ కలిపినపుడు అత్యంత ప్రమాదకరమైన విషం తయారవుతుంది.

వీటిలో ఒకరకమైన రసాయనాన్ని 'రసాయన ఆయుధం'గా ఉపయోగించడానికి రష్యా మిలిటరీ ఆమోదం తెలిపింది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)