'ఎన్నికల్లో లబ్ధి కోసమే భారత్ మా స్నేహహస్తాన్ని అందుకోవడం లేదు': పాక్ సమాచార మంత్రి ఫవాద్

పాకిస్తాన్ మంత్రి ఫవాద్, ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఎంతగా స్నేహహస్తం అందిస్తున్నా భారత్ అందుకోవడం లేదని, భారత్‌లో ఎన్నికలు ఉండడంతో తమతో స్నేహం వారికి ఓట్లను రాల్చదన్న భయంలో అక్కడి పాలక బీజేపీ ఉందని పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి అన్నారు.

బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఫవాద్ చౌదరి, 'ఉపఖండంలో శాంతి స్థాపన దిశగా భారత్‌తో చర్చల విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం రెండూ ఒకే మాటపై ఉన్నాయని' ఫవాద్ చెప్పారు. అయితే, పాక్ కొత్త ప్రభుత్వానికి ఇంతవరకు భారత్ వైపు నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు.

మరోవైపు, భారత్ నుంచి వచ్చే సిక్కు యాత్రికులకు వీసా రహిత ప్రయాణ అవకాశం కల్పించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. గురుద్వారా దర్బార్ సాహెబ్‌లో ప్రార్థనల కోసం కర్తార్‌పూర్ సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌ వచ్చే సిక్కు యాత్రికులకు త్వరలో ఈ అవకాశం ఉంటుందన్నారు.

రావి నది ఒడ్డున ఉన్న దర్బార్ సాహెబ్ గురుద్వారాను దర్శించుకునేందుకు సిక్కులు పెద్దసంఖ్యలో వెళ్తుంటారు. నరోవాల్ జిల్లాలోని కర్తార్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఈ గురుద్వారా డేరా దర్బార్ సాహెబ్ రైల్వే స్టేషన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

‘నాయకుల మధ్య కాదు, దేశాల మధ్య సంబంధాలు పెంచుకోవాలనుకుంటున్నాం’

పాక్ ప్రధానిగా ఎన్నికైన తరువాత ఇమ్రాన్ ఖాన్ భారత్‌కు ఎన్నోరకాలుగా సానుకూల సంకేతాలు పంపించారని ఫవాద్ అన్నారు.

''శాంతి, సుస్థిరతలు సాధించనంత కాలం ఈ ప్రాంతంలోని ఏ దేశమూ ప్రగతి సాధించలేదని పాక్ ప్రధాని, సైన్యాధ్యక్షులిద్దరూ నమ్ముతున్నార'ని చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ తన ప్రమాణ స్వీకారానికి ముగ్గురు భారతీయ ఆటగాళ్లను ఆహ్వానించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడిన ఇమ్రాన్.. శాంతి స్థాపన దిశగా భారత్ ఒక్క అడుగు ముందుకేస్తే పాక్ రెండడుగులు ముందుకేస్తుందని చెప్పారు. భారత ప్రధానితోనూ ఇమ్రాన్ మాట్లాడారు. కానీ, భారత్ నుంచే ఇంతవరకు ఎలాంటి సానుకూలతా రాలేదని ఫవాద్ అన్నారు.

''భారత్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో పాక్‌తో స్నేహం పెంచుకుంటే ఓట్లు కోల్పోతామన్న ఆలోచనలో బీజేపీ ఇరుక్కుంది'' అని ఫవాద్ విశ్లేషించారు.

పాలక 'పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్' పార్టీ విధానాలు గత ప్రభుత్వాల విధానాల కంటే ఎలా భిన్నంగా ఉండబోతున్నాయన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. గతంలో భారత్, పాక్ సంబంధాలు నవాజ్ షరీఫ్, జిందాల్.. నవాజ్ షరీఫ్, మోదీ మధ్య సంబంధాలుగా ఉండేవి. కానీ, ఇప్పుడు భారత్, పాక్ మధ్య సంబంధాలుగానే ఉండబోతున్నాయి అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అమెరికా, భారత్ విదేశాంగ మంత్రులు మైక్ పాంపియో, సుష్మ స్వరాజ్

‘సైన్యం, ప్రభుత్వం రెండిటిదీ ఒకే మాట’

పాక్‌లోని అన్ని రాజకీయ, భద్రతా సంస్థలూ ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని అనుకుంటున్నాయని ఫవాద్ తెలిపారు.

ఇంతకుముందు పాకిస్తాన్ నాయకత్వం ఒక వైఖరి కనబరిస్తే, సైన్యం మరో వైఖరి కనబరుస్తుందన్న ఫిర్యాదు ఉండేదని.. కానీ, ఇకపై అలాంటి సందర్భం రాదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం, సైన్యం ఒకే మాటపై ఉన్నాయన్నారు.

భారత్ సహా పొరుగుదేశాలతో సంబంధాల విషయంలో ఇమ్రాన్ ఖాన్‌కు సైన్యం నుంచి పూర్తి మద్దతు ఉందని చెప్పారు.

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పర్యటన తరువాత అమెరికా ప్రకటనకు, పాక్ ప్రకటనకు పొంతన లేకపోవడంపై ప్రశ్నించగా ఫవాద్.. అమెరికా ప్రతినిధి బృందంతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పారు.

అమెరికా ఎంతో సానుకూలంగా ఉందని.. ప్రతినిధులతో మనసు విప్పి మాట్లాడుకున్నామని, రెండు దేశాల మధ్య సంబంధాలు తాను అనుకున్నంతగా ఏమీ దెబ్బతినలేదని ఇమ్రాన్ తనతో చెప్పారని ఫవాద్ బీబీసీకి తెలిపారు.

పాక్‌కు ఇంతకుముందు ప్రధానులుగా ఉన్న అందరికంటే ఇమ్రాన్‌ఖాన్‌కు అఫ్గాన్, పస్తూన్ సంస్కృతిపై ఎక్కువ అవగాహన ఉందని.. పస్థూన్లలో ఇమ్రాన్ పట్ల మంచి ఆదరణ ఉందనీ ఆయన చెప్పారు. అఫ్గానిస్తాన్ సమస్య పరిష్కారానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఫవాద్ అన్నారు.

ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారన్న ఆరోపణలపై పార్లమెంటరీ కమిషన్ వేయాలన్న విపక్షాల డిమాండ్ గురించి అడిగినప్పుడు, దానిపై ఇమ్రాన్ ఇప్పటికే కమిషన్ ఏర్పాటుకు హామీ ఇచ్చారని ఫవాద్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)