సిరియా యుద్ధం: ఇరాన్, రష్యా, టర్కీ దేశాలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి? ఇడ్లిబ్ కాల్పుల విరమణను పుతిన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో "తీవ్రవాదంపై యుద్ధం" కొనసాగుతుందని సిరియా మిత్రపక్షమైన ఇరాన్ ప్రకటించింది. సిరియా ప్రభుత్వం తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఇరాన్ ఈ ప్రకటన చేసింది.
అయితే, సామాన్య పౌరులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహానీ చెప్పారు. టెహ్రాన్‌లో రష్యా, టర్కీ నేతలతో ఏర్పాటైన సదస్సులో ఆయన ప్రసంగించారు.
సిరియా తిరుగుబాటుదారుల చివరి స్థావరమైన ఇడ్లిబ్‌లో పూర్తి స్థాయి యుద్ధం కనుక మొదలైతే అది తీవ్ర రక్తపాతానికి దారితీసే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
శుక్రవారం ఉదయం కూడా తిరుగుబాటుదారుల మీద వైమానిక దాడులు జరిగాయనే వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే, సిరియా ప్రభుత్వం రసాయనిక ఆయుధాలను ప్రయోగించేందుకు సిద్ధమతువుతున్నట్లు "సమాచారం" ఉందని సిరియాలోని అమెరికా రాయబారి తెలిపారు.
వీడియో: టర్కీ, ఇరాన్, రష్యా దేశాల ముక్కోణ సమావేశం విఫలమైంది
ఎందుకు ఈ దేశాలు జోక్యం చేసుకుంటున్నాయి?
ఇరాన్, రష్యా, టర్కీ దేశాలు సిరియా సంక్షోభంలో కీలక పాత్ర పోషించాయి.
చాలా కాలంగా తిరుగుబాటు వర్గాలకు మద్దతు ఇస్తున్న టర్కీ, పూర్తి స్థాయి యుద్ధం కనుక వస్తే అది దక్షిణ సరిహద్దు ప్రాంతంలో అతిపెద్ద శరణార్థి సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇక, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు అండగా నిలిచిన రష్యా, ఇరాన్ దేశాలు మాత్రం ఇడ్లిబ్‌లో జిహాదీ గ్రూపులను తుడిచిపెట్టేయడమే అసలైన పరిష్కారమని భావిస్తున్నాయి.
వాయువ్య సిరియాలో తిరుగుబాటుదారులున్న ప్రాంతాలలో రష్యా విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.
సదస్సులో ఏం చెప్పారు?
"సిరియాలో శాంతిస్థాపన జరగాలంటే తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయక తప్పదు" అని రోహానీ అన్నారు. రష్యా, టర్కీ అధినేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, "అయితే, ఈ పోరాటం సామాన్య పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు" అని ఆయన అన్నారు.
ఫొటో సోర్స్, Reuters
ఈ ముక్కోణ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, "తన దేశ భూభాగాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని, దాని మీద నియంత్రణ సాధించే చట్టబద్ధమైన హక్కు సిరియాకు ఉంది" అని అన్నారు.
కాగా, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తాయిప్ ఎర్డొగాన్ మాత్రం, లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో రక్తపాతాన్ని నివారించడానికి ఇదే చివరి అవకాశమని వ్యాఖ్యానించారు.
అయితే, వారి సంయుక్త ప్రకటన ఇడ్లిబ్ విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించాలన్నది స్పష్టం చేయలేదు.
సిరియాలో అమెరికా కొత్త రాయబారి ఏమన్నారు?
ఈ ఘర్షణ చేయిదాటిపోయే పరిస్థితి కనిపిస్తోందని జిమ్ జెఫ్రీ అన్నారు. సిరియాలో రాయబారిగా నియమితులైన తరువాత ఆయన మొదటిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, "ఇలాంటి హెచ్చరికలు చేయడానికి చాలా బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో సందేహం లేదు" అని అన్నారు. "యుద్ధం తీవ్రరూపం దాల్చితే అది చేయిదాటిపోతుంది. రసాయనిక ఆయుధాలు కూడా సిద్ధం చేస్తున్నట్లు చాలా స్పష్టమైన ఆధారాలున్నాయి" అని ఆయన చెప్పారు.
అయితే, ఆ ఆధారాలు ఏమిటన్నది ఆయన చెప్పలేదు. కానీ, ఏడేళ్ళ కాలంగా రగులుతున్న ఈ యుద్ధాన్ని ఆపడానికి "ఉన్నత స్థాయి దౌత్య ప్రయత్నం జరగాలి" అని ఆయన అన్నారు.
రసాయినిక ఆయుధాల గురించి మనకు ఏం తెలుసు?
సిరియా ప్రభుత్వం, రెబెల్స్ ఇద్దరికీ క్లోరిన్-ఆధారిత రసాయినిక ఆయుధాలు తయారు చేయగలిగే సామర్థ్యం ఉందని సిరియాలో ఐక్యరాజ్యసమితి రాయబారి స్టఫాన్ డి మిస్టురా గతవారం అన్నారు.
ఫొటో సోర్స్, AFP
సిరియాలోని ఇతర ప్రాంతాలకు వలసపోతున్న ఇడ్లి్బ్ ప్రజలు
అయితే, రసాయనిక ఆయుధాలను తాము ఎన్నడూ ఉపయోగించలేదని సిరియా ప్రభుత్వం చెబుతోంది.
కానీ, ఐక్యరాజ్యసమితి, రసాయనిక ఆయుధాల నిషేధ సంస్థ (ఓపిసిడబ్ల్యు) నిపుణులు మాత్రం, 2017 ఏప్రిల్ నెలలో దక్షిణ ఇడ్లిబ్ మీద జిరిగిన నెర్వ్ ఏజెంట్ సరీన్‌తో చేసిన దాడుల వెనుక సిరియా ప్రభుత్వ దళాలు ఉన్నాయని తాము కచ్చితంగా భావిస్తున్నామని చెబుతున్నారు. ఆ దాడిలో 80 మంది చనిపోయారు.
ఇడ్లిబ్ పరిస్థితి ఎలా ఉంది?
ఇడ్లిబ్ నగరంలో దాదాపు 30 వేల మంది తిరుగుబాటుదారులు, జిహాదీ ఫైటర్లు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రాంతంలో 29 లక్షల మంది సామాన్య పౌరులు ఉన్నారని, వారిలో పది లక్షల మంది చిన్నారులని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
సిరియాలో ఇప్పటికే సగానికి పైగా జనాభా బతుకు భయంతో ఉన్న చోటు నుంచి తరలిపోయారు. ఇంకా, ఎక్కడికి తరలిపోవాలో కూడా వారికి తెలియని పరిస్థితి.
ఈ యుద్ధం మూలంగా గణనీయంగా 8 లక్షల మంది నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని, ఇప్పటికే లక్షల మంది ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ఐక్యరాజ్యసమితి అధికారులు చెబుతున్నారు.
మా ఇతర కథనాలు:
- థియేటర్లన్నీ హౌస్‌ఫుల్.. సీట్లలో ఎవరూ ఉండరు: చైనాలో సినీమాయాజాలం
- హ్యారీపోటర్ ఎక్స్‌ప్రెస్: పాత ఇనుము కింద అమ్మేసినా మళ్లీ ప్రాణం పోసుకుంది
- నాగ్‌పూర్ అత్యాచారం: పాతికేళ్ల నా సర్వీసులో.. అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- ''మమ్మల్ని సెక్స్ బానిసలుగా అమ్మేశారు, అత్యాచారం చేశారు''
- హైదరాబాద్ ఘన చరిత్రకు ఆనవాళ్ళు... నిజాం మ్యూజియంలోని కళాఖండాలు
- చైనా అంటే ఆఫ్రికా దేశాలకు ఎందుకంత భయం?
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- 'ఎన్నికల్లో లబ్ధి కోసమే భారత్ మా స్నేహహస్తాన్ని అందుకోవడం లేదు': పాక్ సమాచార మంత్రి ఫవాద్
- అభిప్రాయం: ప్రకృతి వైపరీత్యానికీ శబరిమల దేవుడికీ ఎలా ముడిపెడతారు?
- ‘జీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లు’
- ‘రాహుల్ గాంధీ కైలాశ్ మానస సరోవర్ యాత్రకు నిజంగానే వెళ్లారా? ఫొటోషాప్ చేస్తున్నారా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)