సిరియా యుద్ధం: ఇరాన్, రష్యా, టర్కీ దేశాలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి?

సిరియా యుద్ధం: ఇరాన్, రష్యా, టర్కీ దేశాలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి?

ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో "తీవ్రవాదంపై యుద్ధం" కొనసాగుతుందని సిరియా మిత్రపక్షమైన ఇరాన్ ప్రకటించింది. సిరియా ప్రభుత్వం తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఇరాన్ ఈ ప్రకటన చేసింది.

అయితే, సామాన్య పౌరులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహానీ చెప్పారు. టెహ్రాన్‌లో రష్యా, టర్కీ నేతలతో ఏర్పాటైన సదస్సులో ఆయన ప్రసంగించారు.

సిరియా తిరుగుబాటుదారుల చివరి స్థావరమైన ఇడ్లిబ్‌లో పూర్తి స్థాయి యుద్ధం కనుక మొదలైతే అది తీవ్ర రక్తపాతానికి దారితీసే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

శుక్రవారం ఉదయం కూడా తిరుగుబాటుదారుల మీద వైమానిక దాడులు జరిగాయనే వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే, సిరియా ప్రభుత్వం రసాయనిక ఆయుధాలను ప్రయోగించేందుకు సిద్ధమతువుతున్నట్లు "సమాచారం" ఉందని సిరియాలోని అమెరికా రాయబారి తెలిపారు.

ఎందుకు ఈ దేశాలు జోక్యం చేసుకుంటున్నాయి?

ఇరాన్, రష్యా, టర్కీ దేశాలు సిరియా సంక్షోభంలో కీలక పాత్ర పోషించాయి.

చాలా కాలంగా తిరుగుబాటు వర్గాలకు మద్దతు ఇస్తున్న టర్కీ, పూర్తి స్థాయి యుద్ధం కనుక వస్తే అది దక్షిణ సరిహద్దు ప్రాంతంలో అతిపెద్ద శరణార్థి సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇక, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు అండగా నిలిచిన రష్యా, ఇరాన్ దేశాలు మాత్రం ఇడ్లిబ్‌లో జిహాదీ గ్రూపులను తుడిచిపెట్టేయడమే అసలైన పరిష్కారమని భావిస్తున్నాయి.

వాయువ్య సిరియాలో తిరుగుబాటుదారులున్న ప్రాంతాలలో రష్యా విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)