సిరియా: ఇది సైన్యాల మధ్య పోరాటం కాదు.. ప్రజలపై జరుగుతున్న యుద్ధం

సిరియా బాలిక

ఫొటో సోర్స్, Getty Images

అబూ ఇబ్రహీం కుటుంబానికి ఈ ప్రపంచం రోజురోజుకూ చిన్నదైపోతోంది. ఎందుకంటే... తొమ్మిది మంది సభ్యులు గల ఇతని కుటుంబం రెండు గదులలో నివసిస్తోంది. ఇతని కుటుంబం నివసిస్తున్న భవనంలో మొత్తం అరవై కుటుంబాలు నివసిస్తున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను వ్యతిరేకించిన వారు తలదాచుకునేందుకు మిగిలి ఉన్న చిట్టచివరి ప్రాంతం ఇడ్లిబ్.

టర్కీ తమ సరిహద్దులను మూసేసిందని, ఎలాగైనా సరిహద్దును దాటాలనుకునే వారిని స్నైపర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని అబూ ఇబ్రహీం తెలిపారు.

‘‘నాకు నా బిడ్డల గురించే బెంగ. మేము వెళ్లేందుకు సురక్షిత ప్రాంతం లేదు. బాంబుల దాడి కొనసాగుతున్నప్పుడు పిల్లలతో సహా పారిపోవడం కష్టంగా ఉంటోంది. టర్కీతో పాటు ఇతర మార్గాలు మూతబడ్డాయి. మేము ఇక్కడ ఇరుక్కుపోయాం" అని ఉమ్ ఇబ్రహీం చెప్పారు.

వీడియో క్యాప్షన్,

వీడియో: "క్లోరిన్, సరీన్ వంటి రసాయనిక ఆయుధాలు ఉపయోగిస్తారేమోనని ప్రజలు భయపడుతున్నారు. భగవంతుడి పైనే భారమేసి సిద్ధంగా ఉన్నాం"

ఇడ్లిబ్ కోసం పోరాటం ఇంకా పూర్తి స్థాయిలో మొదలవలేదు. కానీ దక్షిణాన ఉన్న అల్ తమానాలో మాత్రం సంఘర్షణ మొదలయింది. రష్యా యుద్ధవిమానాల సహకారంతో వేల సంఖ్యలో ప్రభుత్వ దళాలను అక్కడ మోహరించారు. అత్యంత క్రూరమైన యుద్ధంలో ఇడ్లిబ్ కోసం పోరు భయంకరంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే హెచ్చరించింది.

తిరుగుబాటుదారులు, ప్రభుత్వ వ్యతిరేక ఇస్లామిస్టులతో ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో ఇప్పటికే జనాభా రెండింతలు అయింది. అయితే ఇడ్లిబ్ వీధులు రాబోయే రోజులలో మరింత భయంకరంగా మారే అవకాశం ఉందని వీరు అనుకుంటున్నారు.

"క్లోరిన్, సరీన్ వంటి రసాయనిక ఆయుధాలు ఉపయోగిస్తారేమోనని ప్రజలు భయపడుతున్నారు. భగవంతుడి పైనే భారమేసి సిద్ధంగా ఉన్నాం."

తిరుగుబాటుదారులు ఇక్కడ కందకాలు తవ్వుతున్నారు. ఫెలాక్ అల్ షామ్‌కు టర్కీ మద్దతు ఉంది.

"మేము పోరాటానికి సన్నద్ధమవుతున్నాం. ఇక్కడ కందకాలు తవ్వుతున్నాం. ఆయుధాల వాడకంలో మా సైనికులకు మరింత శిక్షణ ఇస్తున్నాం. రష్యా మద్దతున్న ప్రభుత్వ ఆక్రమణ నుంచి మా భూభాగాన్ని కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని కల్నల్ ఖాలెద్ బక్కార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఒక వైపు ఫెలాక్ ఫైటర్లు సన్నద్ధమవుతుంటే మరో వైపు రష్యా మాత్రం ఈ ప్రాంతంలో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తున్న గ్రూప్- హెచ్‌టీఎస్ నుస్రాను లక్ష్యం చేసుకుంటున్నట్టు చెబుతోంది. ఈ జిహాదిస్టు తిరుగుబాటుదారులకు అల్ ఖైదాతో సంబంధముందని చెబుతున్నారు. వీళ్ళని చెల్లాచెదురు చేస్తామని మాస్కో గట్టిగా చెబుతోంది.

అయితే సిరియా యుద్ధం వివిధ సైన్యాల మధ్య పోరాటం కాదు. ఇది ప్రజలపై జరుగుతోన్న యుద్ధం. పాతిక లక్షల మందికి పైగా ప్రజలు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు.

అనేక మంది ప్రజలకు ఆశ్రయం కల్పిస్తోన్నఅట్మా క్యాంపు టర్కీ సరిహద్దు దగ్గర ఉంది. ఈ క్యాంపు పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చే వారికి ఇక్కడ చోటు లేకుండా పోయింది.

సిరియా అంతర్యుద్ధంలోని చివరి ఘట్టం, భవిష్యత్తు పోరు మొదలుకాకముందే నిర్ణయమైపోయినట్టుంది. ఇంకా మొదలవని ఇడ్లిబ్ పోరాటంలో తిరుగుబాటుదారులు ఇప్పటికే ఓటమి అంచుకు చేరుకొని ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)