ఫ్యాషన్ ప్రపంచంలో జుట్టు లేకుండా మోడలింగ్ చేయడం సాధ్యమా?

బట్టతల మోడల్

బట్టతల రావడం మొదలైందంటే చాలా మంది బాధపడిపోతుంటారు. దాన్ని దాచుకోవడానికి నానా హైరానా పడుతుంటారు. అలాంటిది ఫ్యాషన్ ప్రపంచంలో జుట్టు లేకుండా మోడలింగ్ చేయడం సాధ్యమా? అంటే... యెస్... సాధ్యమే అని కొందరు నిరూపిస్తున్నారు. అలోపీషియా ఫ్యాషన్ (#Alopeciaisfashion) పేరిట ఒక హ్యాష్‌టాగ్‌తో దీనికి మద్దతుగా ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. లండన్‌లో అలాంటి కొందరు మోడల్స్‌పై బీబీసీ కథనం.

‘‘నేను చాలా వింతగా కనిపిస్తున్నానని చాలా మంది అంటుంటారు. మరేం ఫర్వాలేదు, నాకు నాలా ఉండటమే ఇష్టం. మోడళ్లు తమకు నచ్చినట్లుగా ఉండే దిశగా ఫ్యాషన్ ప్రపంచం మారుతోంది. అయితే ఇది ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా సమయమే పట్టింది’’ అన్నారు ఫ్యాషన్ మోడల్ ఈవ్.

అలోపీషియాతో ఈవ్, నికోలా జుట్టు కోల్పోయారు. జుట్టులేకపోవడాన్ని ఇబ్బందిగా చూడాల్సిన అవసరం లేదని, ఫ్యాషన్ ప్రపంచం దాన్ని గుర్తించాలని వారు ప్రచారం చేస్తున్నారు.

కొన్ని రకాల లోషన్ల వల్ల జుట్టు పోగొట్టుకున్న క్లయిర్, అలోపీషియా ఈజ్ ఫ్యాషన్ అనే ప్రచారాన్ని ప్రారంభించారు.

వీడియో క్యాప్షన్,

ఫ్యాషన్ ప్రపంచంలో జుట్టు లేకుండా మోడలింగ్ చేయడం సాధ్యమా?

‘‘కొన్ని రకాల లోషన్లు వాడటం వల్ల కొంత జుట్టు రాలి పోయింది. పిల్లలు పుట్టాక మరికొంత ఊడింది. దీంతో ఆత్మన్యూనత పెరిగింది. ఒంటరితనం ఆవహించేది. ఒక మహిళా మోడల్ ఇలానే ఉండాలంటూ కొన్ని ప్రమాణాలున్నాయి. క్యాట్ వాక్ చేయాలంటే అందమైన, పొడవైన జుట్టు ఉండాలి. ఈ దృక్పథాన్ని మార్చేందుకు ప్రచారం ప్రారంభించాం’’ అని క్లయిర్ తెలిపారు.

జుట్టులేని మోడళ్లు చాలా అరుదు. దీనిపై నికోలా, ఈవ్‌లు స్పందిస్తూ..

‘‘ఫ్యాషన్ ప్రపంచంలో వీరు అసలే కనిపించరు. అందమైన, పొడవైన జుట్టు ఉండేవాళ్లే ఎక్కువ.

11 ఏళ్ల వయసులో నా జుట్టు పోయింది. చాలా రోజులపాటు ఏం చేయాలో నాకు పాలుపోలేదు.

నలుగురికీ తెలిసిపోతుందనే కంగారుతో బయటకు వెళ్లడానికి ఎంతో భయపడేదాన్ని.

నేను డేటింగ్‌లో ఉన్నప్పుడు అందరూ నా జుట్టు గురించే మాట్లాడేవారు. అది నాకు చాలా బాధ కలిగించింది. అలా వారు లోపాలను వెతకడాన్ని నేను సహించలేకపోయాను.

ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. అతను 'అయ్యో! ఈ పిల్లకు నేనంటే ఇష్టమంట. మరి ఆ అమ్మాయికి జుట్టు అసలే లేదని విన్నాను' అన్నాడు. ఆ మాటలు నాకు చాలా బాధ కలిగించాయి.

మా గురించి చెడుగా మాట్లాడుకుంటారని, మమ్మల్ని భూతాల్లా చూస్తారని, అబ్బాయిలు మమ్మల్ని ఇష్టపడరని... ఇటువంటి ఆలోచనలతో పెరిగాం.

జుట్టులేకపోతేనేం? బాగానే ఉంది. పొడవాటి జుట్టు ఉన్నా లేక అసలు లేకపోయినా ఇబ్బంది లేదు.

ఇలా నలుగురిలో అందరూ చూస్తుండగా నేను, ఈవ్ ఫ్యాషన్ షూటింగ్ చేస్తున్నాం. దీని వల్లనైనా మరికొంత మంది తమపై తాము విశ్వాసం పెంచుకుంటారని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)