సెరెనా విలియమ్స్: ’యూఎస్ ఓపెన్‌ ఫైనల్‌లో అంపైర్ లింగవివక్ష చూపారు‘

సెరెనా విలియమ్స్

యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో అంపైర్ తనకు పెనాల్టీ పాయింట్ విధించటంలో లింగవివక్ష చూపారని సెరెనా విలియమ్స్ ఆరోపించారు. మ్యాచ్‌లో తాను మోసానికి పాల్పడలేదని ఆమె చెప్పారు.

ఫైనల్ మ్యాచ్‌లో సెరెనాతో తలపడిన జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒసాకా 6-2, 6-4 పాయింట్లతో గెలిచి చాంపియన్‌గా అవతరించారు. అయినప్పటికీ.. ఈ మ్యాచ్‌ రెండో సెట్‌లో సెరెనా అసాధారణ రీతిలో ఆగ్రహం వ్యక్తం చేయటం మీదే ప్రేక్షకులు, మీడియా దృష్టి నిలిచింది.

సెరెనా కోచ్ బాక్స్ నుంచి ఆమెకు కోచింగ్ ఇస్తున్నారంటూ.. నిబంధనల ఉల్లంఘన కింద అంపైర్ తొలుత హెచ్చరించారు. దానిపై ఆగ్రహించిన సెరెనా కోచ్‌ను ‘అబద్ధాలకోరు’ అని ‘దొంగ’ అని నిందిస్తూ తన రాకెట్‌ను నేలకేసి కొట్టారు. దీంతో అంపైర్‌ నిజాయితీని ప్రశ్నించటం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆమెకు ఒక పాయింట్ జరిమానా విధించారు.

మ్యాచ్‌లో తనకు ఒక పాయింట్ జరిమానా విధించటం ‘లింగవివక్షే’నని సెరెనా ఆ తర్వాత అభివర్ణించారు.

‘‘ఆయన ఒక పురుషుడికి ఎప్పుడూ ఒక పాయింట్ జరిమానా విధించలేదు.. వాళ్లు ఆయనను ‘దొంగ’ అని పిలిచేవారు’ అని సెరెనా పేర్కొన్నారు.

‘‘ఇతర పురుషులు ఇతర అంపైర్లను అనేక రకాలుగా నిందించటం నేను చూశాను. ఇక్కడ మహిళల హక్కులు, మహిళల సమానత్వం మొదలైన వాటి కోసం నేను పోరాడుతున్నాను’’ అని ఆమె చెప్పారు.

రెండో సెట్ ఆరంభంలో సెరెనా కోచ్.. ఆమె దిశగా చేతితో సంజ్ఞ చేయటంతో ఈ వివాదం మొదలైంది.

అయితే మ్యాచ్‌లో తాను కోచ్ సాయం తీసుకున్నానన్న ఆరోపణను సెరెనా తిరస్కరించారు. ‘‘గెలవటం కోసం నేను ఎప్పుడూ మోసం చేయను.. దానికన్నా ఓడిపోవటానికే ఇష్టపడతాను’’ అని పేర్కొన్నారు. అంపైర్ కార్లోస్ రమోస్ తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే.. ఆమె కోచ్ మోరటోగ్లో తాను ఆమెకు సంజ్ఞ ద్వారా కోచ్ చేసినట్లు అంగీకరించారు.

ఆ తర్వాత సెరెనా తన రాకెట్‌ను నేలకు విసిరికొట్టటం ద్వారా మరోసారి నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాగా.. ఆమె ప్రత్యర్థి ఒసాకాకు అంపైర్ ఒక పాయింట్ ఇచ్చారు.

సెరెనా తీవ్రంగా ఆగ్రహించారు. రామోస్ వద్దకు వెళ్లి ఆయన వైపు వేలెత్తి చూపుతూ కేకలు వేశారు. మాజీ వరల్డ్ నంబర్ వన్ అయిన సెరెనాకు మద్దతుగా ప్రేక్షకులు అంపైర్‌ను ‘బూ’ అంటూ గేలిచేశారు.

ఆ తర్వాత క్రీడాకారిణిలు కోర్టులో అటూ ఇటూ మారే సమయంలోనూ రామోస్‌ను ఉద్దేశించి.. ‘నువ్వు అబద్ధాలకోరువి...’, ‘క్షమాపణ చెప్పు...’ అంటూ తన విమర్శల దాడి కొనసాగించారు. ఒసాకాకు పాయింట్ ఇచ్చినందుకు ఆయనను ‘దొంగ’ అని నిందించారు.

‘‘ఇది నా బుర్రను బద్దలుకొడుతోంది. కానీ మహిళల కోసం, మమ్మల్ని సమానంగా చూడటం కోసం నేను పోరాటం కొనసాగిస్తాను’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం 36 ఏళ్ల సెరెనా ఇప్పటివరకూ 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నారు.

‘‘ఇదంతా నేను చేయాల్సిన అవసరముందని నేను నమ్ముతున్నాను. భావోద్వేగాలున్న వ్యక్తి, తన భావోద్వేగాలను వ్యక్తీకరించాలనుకున్న వ్యక్తి.. బలమైన మహిళగా ఉండాలనుకుంటున్న వారికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ రోజు కారణంగా వారిని అందుకు అనుమతిస్తారు. ఇదిప్పుడు నాకు ఫలితం ఇవ్వకపోవచ్చు. కానీ తర్వాత రాబోయే వ్యక్తికి ఇది ఫలితమిస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో క్యాప్షన్,

కోచ్ మోరటోగ్లో 2012 నుంచి సెరెనాకు కోచింగ్ ఇస్తున్నారు

‘‘మ్యాచ్‌లో నేను కోచ్ సాయం తీసుకోవట్లేదు’’

మ్యాచ్‌లో సెరెనాకు సూచనలు చేస్తున్నట్లు మోరటోగ్లో మ్యాచ్ అనంతరం అంగీకరించారు. అయితే.. ‘‘కానీ ఆమె నావైపు చూశారని నేననుకోవటం లేదు’’ అని చెప్పారు. ఒసాకా కోచ్ కూడా ఇదే పనిచేస్తున్నారని.. ‘‘అందరూ ఇలా చేస్తారు’’ అని కూడా ఆయన పేర్కొన్నారు.

డబ్ల్యూటీఏ పోటీల్లో కోర్టులో కోచింగ్ అనుమతి ఉంది. కానీ.. గ్రాండ్ స్లామ్ పోటీల్లో అనుమతి లేదు. క్రీడాకారులు - వారి కోచ్‌ల మధ్య ‘‘ఎటువంటి తరహా సంభాషణ’’ అయినా నిషిద్ధమని నిబంధనలు చెప్తున్నాయి.

మ్యాచ్ అనంతరం సెరెనా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను కోచ్ నుంచి సూచనలు తీసుకోవటం లేదని, ఆయన ఎందుకలా చెప్తున్నారో తనకు అర్థం కాలేదని పేర్కొన్నారు.

ఫొటో క్యాప్షన్,

మ్యాచ్ అనంతరం ట్రోఫీ ప్రదానోత్సవంలో ఒసాకా కంటతడి పెట్టారు

తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్‌లో ఆడిన ఒసాకా.. తన మార్గదర్శిగా అభివర్ణిస్తున్న సెరెనా మీద మ్యాచ్ తొలి సెట్‌లో పైచేయి సాధించారు. రెండో సెట్‌లో అంపైర్ మీద సెరెనా ఆగ్రహం వ్యక్తం చేయటంతో వాతావరణం గంభీరంగా మారినప్పటికీ ఒసాకా ఏకాగ్రత కోల్పోకుండా విజయం సాధించారు.

సెరెనాకు, అంపైర్‌కు మధ్య ఏం జరుగుతోందన్న విషయం తనకు తెలియదని ఆమె మ్యాచ్ తర్వాత పేర్కొన్నారు.

‘‘ఏకాగ్రతతో ఉండటానికి మాత్రమే నేను ప్రయత్నిస్తూ ఉన్నా’’ అని చెప్పారు.

‘‘సెరెనా బెంచ్ దగ్గరికి వచ్చి తనకు ఒక పాయింట్ జరిమానా విధించారని చెప్పారు. ఆమెకు ఆ జరిమానా ఎప్పుడు విధించారో కూడా నాకు తెలియదు’’ అని ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)