ఉత్తర కొరియా: ఖండాంతర క్షిపణులు లేకుండానే సైనిక ప్రదర్శన

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, AFP

ఉత్తర కొరియా తన 70వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సైనిక కవాతులో ఖండాంతర క్షిపణులను (ఐసీబీఎంలను) ప్రదర్శించలేదని వార్తలు వచ్చాయి.

ఈ కార్యక్రమంలో దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ ప్రసంగించారా లేదా అన్న విషయం కూడా అస్పష్టంగానే ఉంది.

ఉత్తర కొరియా ఆయుధ భాండాగారం గురించి, అణు నిరాయుధీకరణకు ఇచ్చిన హామీకి ఎంతవరకూ కట్టుబడిందనే దాని గురించి తెలుసుకోవటానికి ఈ సైనిక కవాతును నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కొద్ది కాలం కిందట భేటీ అయిన కిమ్.. తమ దేశ ఆయుధ ప్రదర్శన తీవ్రతను తగ్గిస్తారని కొందరు విశ్లేషకులు ముందుగా అంచనావేశారు.

అమెరికా నేలను తాకగల ఖండాంతర క్షిపణులను.. అందునా అణ్వస్త్రాలను తీసుకెళ్లగల క్షిపణులను భారీగా ప్రదర్శించినట్లయితే అది రెచ్చగొట్టే చర్య అయ్యుండేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజా సైనిక కవాతుకు సంబంధించిన వీడియో దృశ్యాలేవీ ఉత్తర కొరియా ఇంకా విడుదల చేయలేదు. అయితే.. ఆ కార్యక్రమానికి హాజరైన ఏఎఫ్‌పీ వార్తా సంస్థ ప్రతినిధి, ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ నుంచి ఫొటోలు సంపాదించిన ఎన్‌కే న్యూస్‌లు మాత్రం.. ఐసీబీఎంలు ఏవీ కనిపించలేదని చెప్తున్నాయి.

కొరియా ద్వీపకల్పాన్ని అణు నిరాయుధీకరణ చేయటం కోసం కిమ్, ట్రంప్‌లు గత జూన్ నెలలో ఒక అస్పష్టమైన ఒప్పందం మీద సంతకాలు చేశారు. అయితే.. అందులో ఒక కాలపరిమితి కానీ, వివరాలు కానీ, ఆ ప్రక్రియను తనిఖీ చేసే వ్యవస్థల గురించి కానీ ఏమీ లేదు.

ఉన్నత స్థాయి చర్చలు, పర్యటనలు కొనసాగాయి. కానీ.. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో ఉత్తర కొరియా పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఒప్పందం పురోగతికి కట్టుబడి ఉన్నామని ఇరు పక్షాలూ ఉద్ఘాటిస్తూనే.. ఆ చర్చల్లో ప్రతిష్టంభనకు కారణం మీరంటే మీరంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, AFP

ఖండాంతర క్షిపణులను ప్రదర్శించినట్లయితే.. భవిష్యత్తు చర్చలు, కొరియా యుద్ధం ముగిసినట్లు ప్రకటన చేయటానికి సంబంధించి ఒప్పందం ప్రమాదంలో పడి ఉండేవని బీబీసీ సోల్ ప్రతినిధి లారా బికర్ పేర్కొన్నారు.

మరోవైపు.. ఉత్తర కొరియా ఈ ఏడాది భారీ క్రీడలను కూడా నిర్వహించాల్సి ఉంది. ఆరిరాంగ్ మాస్ గేమ్స్ పేరుతో నిర్వహించే ఈ క్రీడలను.. ఆ దేశం తన ప్రచారానికి ఉపయోగించుకుంటుంది.

‘ద గ్లోరియస్ కంట్రీ’ పేరుతో ఉత్తర కొరియా చరిత్రను ప్రతీకాత్మకంగా చెప్పటానికి ఈ ఏడాది క్రీడలను నిర్వహించబోతున్నారు.

ఫొటో సోర్స్, Reuters

సెప్టెంబర్ నెల మొత్తం జరగబోయే ఈ క్రీడలు చాలా భారీగా ఉండబోతున్నాయని ఉపగ్రహ చిత్రాలను పరిశీలించటం ద్వారా తెలుస్తోంది.

గతంలో నిర్వహించిన క్రీడలు అత్యంత భారీ స్టేడియంలు, అత్యధిక సంఖ్యలో ప్రదర్శకులు, జిమ్నాస్టిక్స్, నృత్యాలు ప్రదర్శించారు.

అయితే.. ఈ క్రీడల్లో పిల్లలను బలవంతంగా పాల్గొనేలా చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి గతంలో ఆరోపించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)