పారిస్: కత్తితో రెచ్చిపోయిన దుండగుడు... ఏడుగురికి తీవ్ర గాయాలు

పారిస్ దాడి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ఈశాన్య పారిస్‌లో ఘటనాస్థలం

పారిస్‌లో ఓ దుండగుడు కత్తితో దాడి చేసి ఏడుగురు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచాడు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ దాడికి పాల్పడింది అఫ్గానిస్తాన్‌కు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. ఇది తీవ్రవాదుల దాడి అని చెప్పడానికి ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదని కొందరు అంటున్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు బ్రిటన్ పర్యాటకులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈశాన్య పారిస్‌లోని ఊర్క్ కెనాల్ ఒడ్డున రాత్రి 11 గంటలకు ఈ దాడి జరిగింది. ఒక సినిమా థియేటర్ దగ్గర ఉన్న ముగ్గురిపై దుండగుడు మొదట దాడి చేశాడు. అక్కడే ఒక గేమ్ ఆడుతున్న చాలా మంది ఆ దాడిని అడ్డుకునేందుకు అతడిపై బాల్స్ విసిరినట్టు చెబుతున్నారు.

దాడి చేసి పారిపోయిన ఆ వ్యక్తి.. తర్వాత రూ హెన్రీ నోగ్యూరెస్‌ దగ్గర ఇద్దరు బ్రిటన్ పర్యాటకులను కూడా పొడిచినట్టు తెలుస్తోంది.

దాడులు జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు

ఫొటో సోర్స్, Reuters

ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు ప్రారంభించామని, ఘటనాస్థలంలో ఉన్న వారి నుంచి ఫ్రెంచ్ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు బ్రిటన్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇది తీవ్రవాద చర్య అని చెప్పడానికి ఇప్పటిప్పుడు ఎలాంటి ఆధారాలు లేవని ఒక ఫ్రెంచ్ పోలీసు అధికారి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)