అమ్మానాన్నలు కావాలన్న వీళ్ల ఆశలు ఫలిస్తాయా?

  • 12 సెప్టెంబర్ 2018
దత్తత, భారతదేశం, ఆస్ట్రేలియా Image copyright Getty Images

భారత-ఆస్ట్రేలియా మధ్య దత్తత కార్యకలాపాలు పున:ప్రారంభం కావడంతో, అక్కడ భారతదేశానికి చెందిన పిల్లలను దత్తత తీసుకోవాలని భావిస్తున్న చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారని నీనా భండారి చెబుతున్నారు.

న్యూ సౌత్ వేల్స్‌లోని విండ్సర్‌కు చెందిన 33 ఏళ్ల ఎలిజబెత్ బ్రూక్, 32 ఏళ్ల ఆమె భర్త ఆడమ్ బ్రూక్‌లు భారత-ఆస్ట్రేలియా దేశాల మధ్య పిల్లల దత్తత కార్యకలాపాలు పున:ప్రారంభం కానున్నాయని తెలిసి చాలా ఆనందంగా ఉన్నారు.

''ఒక కుటుంబం నిర్మించుకునే పనిలో ఉన్న మాకు ఈ వార్త ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది'' అని ఎలిజబెత్ తెలిపారు. 14 ఏళ్ల క్రితం ఆమెకు పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉందని వెల్లడైంది. నాటి నుంచి ఆమె ఇతర దేశాలకు చెందిన పిల్లలను దత్తత తీసుకోవాలని యోచిస్తున్నారు.

ఆమె గర్భం దాల్చడం కష్టం అని వైద్యులు చెప్పిన సమయంలోనే ఆమె అనుకోకుండా టీవీలో 'రాజా హిందుస్థానీ' చూశారు.

''అది నాపై గాఢమైన ముద్ర వేసింది. భారతదేశానికి సంబంధించిన అన్ని విషయాలు - ఆహారం, దుస్తులు, సినిమాలు అన్నీ నన్ను ఆకర్షించాయి. దాంతో నేను నా సోదరి, నా స్నేహితులతో, ఆ తర్వాత ఆడమ్‌తో కలిసి భారత్‌కు వెళ్లివచ్చాను. ఆ క్రమంలోనే భారతదేశానికి చెందిన పిల్లలను దత్తత తీసుకోవాలని మేం నిర్ణయించుకున్నాం'' అని ఆమె తెలిపారు.

Image copyright Elizabeth Brook, Adam Brook
చిత్రం శీర్షిక ఆడమ్ బ్రూక్, ఎలిజబెత్ బ్రూక్

అయితే 2010, అక్టోబర్‌లో కొన్ని గుర్తింపు పొందిన భారత ప్లేస్‌మెంట్ సంస్థలు పిల్లలను అక్రమంగా రవాణా చేస్తున్నాయన్న ఆరోపణలతో ఆస్ట్రేలియా భారత్‌తో దత్తత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసింది.

నాటి నుంచి భారతదేశం జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 మరియు అడాప్షన్ రెగ్యులేషన్స్ 2017 నోటిఫికేషన్ ద్వారా దత్తత నియమాలను మరింత కఠినతరం చేసింది.

ఒకానొక సమయంలో ఎలిజబెత్ దంపతులు భారతదేశానికి వచ్చి, నిర్వాసితులుగా దత్తత తీసుకోవాలని కూడా అనుకున్నారు. ఒక ఉదారవాద కుటుంబంలో పెరిగి, వివిధ మతాలు, సంస్కృతుల గురించి తెలుసుకున్న ఎలిజబెత్, ''అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే, మేం మూడేళ్లలో ఒక పిల్లవాడితో మా ఇంటికి తిరిగి వస్తాం'' అన్నారు.

ఎలిజబెత్ దంపతులు భారతదేశానికి చెందిన 'సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ' ద్వారా ఇద్దరు, ముగ్గురు పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారు.

భారత-ఆస్ట్రేలియాల మధ్య దత్తత కార్యకలాపాలను పునరుద్ధరించనున్న నేపథ్యంలో, ఆస్ట్రేలియా సామాజిక సేవా విభాగ ప్రతినిధి ఒకరు, పిల్లల దత్తత విషయంలో ఇంకా ఇప్పటివరకు దరఖాస్తులను తీసుకోవడం ప్రారంభం కాలేదన్నారు. గత పరిణామాల రీత్యా భవిష్యత్తులో దత్తత కార్యక్రమాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.

Image copyright Joylakshmi Saini
చిత్రం శీర్షిక జాయ్‌లక్ష్మీ సైని, మంజీత్ సింగ్ సైనీ

ఎలిజబెత్ దంపతుల్లాగే విక్టోరియాలోని ఉత్తర మెల్‌బోర్న్ సబర్బ్‌కు చెందిన జాయ్‌లక్ష్మీ సైనీ, ఆమె భర్త మంజీత్ సింగ్ సైనీలు గత ఎనిమిదేళ్లుగా భారత్‌తో దత్తత కార్యకలాపాల పునరుద్ధరణ కోసం వేచి చూస్తున్నారు.

''ఈ వార్త మాకు చాలా సంతోషం కలిగించింది. మేం ఇంకా వేచి చూడాలా లేక ఇక్కడే స్థానికంగా ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలా అని ఇప్పటికే ఆలోచిస్తున్నాం'' అని జాయ్‌లక్ష్మి తెలిపారు.

2008లో ఆమెకు ఎండోమెట్రియాసిస్ ఉందని తెలీడంతో అత్యవసరంగా సర్జరీ చేశారు. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ ముంబై నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. వారి విషయంలో ఐవీఎఫ్ (ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్) ఐదుసార్లు విఫలమైంది. ఆ తర్వాత హిస్టరెక్టమీ జరిగి ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చేశారు. ఆ తర్వాత వాళ్లు రెండుసార్లు సరోగసీ ప్రయత్నించినా, అదీ విఫలమైంది.

''కేవలం దత్తత మాత్రమే మాకు మిగిలిన ప్రత్యామ్నాయం. మేం 2010లో భారతదేశం నుంచి పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్న సమయంలోనే ఆస్ట్రేలియా ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపేసింది'' అని జాయ్‌లక్ష్మి తెలిపారు.

Image copyright Getty Images

వాయువ్య క్వీన్స్‌ల్యాండ్‌లోని మౌంట్ ఇసా పట్టణంలో ఉంటున్న ఒంటరి తల్లి అయిన 33 ఏళ్ల మేరీ జోన్స్ (గోప్యత కోసం పేరు మార్చాము), ''ఈ పరిణామం చాలా ఆశాజనకం. కానీ దీనిపై ఇంకా నాకు సందేహాలు ఉన్నాయి. భారత్‌తో దత్తత కార్యకలాపాల పునరుద్ధరణ నిర్ణయాన్ని ఏ మేరకు సమర్థంగా అమలు చేస్తారో చూడాలి. నేను గత నాలుగేళ్లుగా భారతదేశం నుంచి ఎవరైనా బాలికను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. ఇది ఒక మారుమూల పట్టణం. నా తొమ్మిదేళ్ల కుమారుడు ఇక్కడ చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు'' అని తెలిపారు.

మేరీ తన భర్తతో పాటు భారత్ నుంచి న్యూజీల్యాండ్‌కు వలస వెళ్లారు. ఐదేళ్ల క్రితం ఆమె భర్త చేతిలో చాలా బాధలు పడి అతని నుంచి విడిపోయి ఆస్ట్రేలియాకు వచ్చేసారు. రిజిస్టర్డ్ నర్స్ అయిన ఆమె బెంగళూరులో వాలంటీర్‌గా పని చేసేప్పుడు అనాధ శరణాలయాలలో పిల్లల పరిస్థితిని దగ్గరుండి చూశారు. అందుకే అలాంటి పిల్లల్లో కనీసం ఒక్కరికైనా ప్రేమను పంచాలని ఆమె నిర్ణయించుకున్నారు.

భారత-ఆస్ట్రేలియాల మధ్య దత్తత కార్యక్రమాలు సక్రమంగా, పారదర్శకంగా, నైతికంగా ఉండాలని స్వచ్ఛంద సంస్థ అడాప్ట్ చేంజ్‌ సీఈఓ రెనీ కార్టర్ అన్నారు.

అప్పుడే ఎలిజబెత్, జాయ్‌‌లక్ష్మి, మేరీ జోన్స్‌లాంటి వారి ఆశలు నెరవేరతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు