అలీబాబా అధిపతి జాక్ మా: అపర కుబేరుడి అయిదు విజయ రహస్యాలు

ఫొటో సోర్స్, Getty Images
ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన అలీబాబా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. వచ్చే ఏడాది పదవి నుంచి తప్పుకొంటానని ఆయన ప్రకటించారు.
అలీబాబా సహ వ్యవస్థాపకుడైన జాక్ మా చైనాలోని అత్యంత సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరిగానూ ఆయన పేరొందారు.
జాక్ మా స్థానంలో సంస్థ ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేనియల్ ఝాంగ్ నియమితులవుతారని అలీబాబా వెల్లడించింది.
తన 55వ పుట్టిన రోజు సందర్భంగా 2019 సెప్టెంబర్ 10న జాక్ పదవి నుంచి వైదొలగుతారని ఆ సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా జాక్ మా జీవితానికి సంబంధించిన 5 ఆసక్తికర అంశాలు చూద్దాం.
1. ఇంగ్లిష్ మాస్టారు నుంచి ఇంటర్నెట్ వ్యాపార అధినేత వరకు..
చైనాలోని తూర్పు ప్రాంత నగరం హ్యాంగ్‌ఝూలో పేద కుటుంబంలో జన్మించిన జాక్ మా వ్యాపార రంగంలోకి ప్రవేశించడానికి ముందు ఆంగ్ల బోధకుడిగా పనిచేశారు.
పాఠశాల స్థాయి నుంచే ఎన్నో ఇబ్బందులు పడిన ఆయన ఉద్యోగం కోసం చేసిన ఎన్నో ప్రయత్నాలూ ఫలించలేదు. కేఎఫ్‌సీ సహా 30 సంస్థలు ఆయనకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి.
33 ఏళ్ల వయసులో తొలిసారి కంప్యూటర్ కొనుగోలు చేసిన ఆయన అందులో మొట్టమొదట ఇంటర్నెట్ ఓపెన్ చేసి బీర్ కోసం వెదికారు. కానీ, ఒక్క ఆన్‌లైన్ వ్యాపార సంస్థ కూడా బీర్ విక్రయించకపోవడం చూసి ఆశ్చర్యపోయారు.
కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్లు వంటివేమీ పెద్దగా తెలియని ఆయన రెండు దశాబ్దాల కిందట తన ఇంట్లోనే అలీబాబా సంస్థను స్థాపించారు. కొందరు స్నేహితులను ఒప్పించి ఈ ఆన్‌లైన్ వ్యాపార సంస్థలో పెట్టుబడులు పెట్టించారు.
ఫొటో సోర్స్, Getty Images
2. అపర కుబేరుడు
జాక్ మా 36.6 బిలియన్ డాలర్ల సంపదతో 2017లో చైనాలోని అత్యంత సంపన్నుల్లో మూడోవాడిగా ఫోర్బ్స్ జాబితాలోకెక్కారు. అలీబాబాలో 9 శాతం వాటా ఆయనదే. దాని విలువ ప్రస్తుతం 420 బిలియన్ డాలర్లు ఉంటుంది.
2014లో అలీబాబా సంస్థ పబ్లిక్ ఇష్యూకి వచ్చి 25 బిలియన్ డాలర్లు సమీకరించింది.
చైనా రిటైల్, ఆర్థిక రంగ ముఖచిత్రాన్ని జాక్ మా మార్చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
3. పదేళ్ల కిందటే వారసుడి ఆలోచన..
సంస్థలో తన వారసుడు ఎవరు అనే విషయంలో పదేళ్ల కిందటే జాక్ మా ఆలోచించడం ప్రారంభించారు. 'జాక్ మా ఫౌండేషన్' ద్వారా దాతృత్వ కార్యక్రమాలకు అంకితమవుతానని ఆయన గతంలోనే చెప్పారు. గ్రామీణ చైనాలో విద్యాబోధనకు సహకరించేలా 30 మిలియన్ డాలర్లు విరాళమివ్వనున్నట్లు జాక్ మా ఫౌండేషన్ ప్రకటించింది.
సంస్థ పదవుల నుంచి వైదొలిగాక వ్యవస్థాపక భాగస్వామిగా ఉంటూ తనకు అత్యంత ఇష్టమైన విద్యారంగంలోకి అడుగుపెట్టాలని ఆయన కోరుకుంటున్నారు.
ఇటీవల ఆయన 'బ్లూమ్‌బర్గ్' చానల్‌తో మాట్లాడుతూ.. బిల్ గేట్స్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చారు. బిల్ గేట్స్ కూడా మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి దిగిపోయే ముందు దాతృత్వ సంస్థను స్థాపించి దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
4. డోనల్డ్ ట్రంప్‌తో..
గత ఏడాది జనవరిలో జాక్ మా ఒకసారి న్యూయార్క్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని కలిసినట్లు తెలిపారు. అమెరికా, చైనా సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఇద్దరం అనుకున్నామని చెప్పారు.
ఆ సందర్భంలో ట్రంప్.. జాక్ మాను ప్రపంచంలోనే గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరిగా అభివర్ణించారు. ఆయనకు అమెరికా, చైనా రెండూ
ఇష్టమేనని అన్నారు.
జాక్ మా కూడా.. తన వెబ్‌సైట్ సహాయంతో పది లక్షల ఉద్యోగాలు సృష్టించి అమెరికా వ్యాపారానికి సహాయపడతానని ఆయనకు మాటిచ్చారు.
అయితే, అమెరికాతో చైనా వాణిజ్య యుద్ధం కారణంగా చైనా తయారీదారులు, వ్యాపారవేత్తలు కష్టాలు పడుతున్న సమయంలో జాక్ మా వ్యాపారం నుంచి వైదొలుగుతున్నారు.
ఫొటో సోర్స్, AFP
5. ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండాలనే కోరుకుంటారు
జాక్ మా ఎప్పుడై లైమ్‌లైట్‌లో ఉండాలని కోరుకుంటారు. 2017లో ఆయన అలీబాబా వార్షికోత్సవ కార్యక్రమంలో మైఖేల్ జాక్సన్‌లా స్టెప్టులు వేసి కొత్త ఊపు తెచ్చారు.
గత ఏడాది గాంగ్ షో డావో అనే కుంగ్‌ఫూ నేపథ్యంలో సాగే షార్ట్ ఫిలింలో తొలిసారి కనిపించారు. అందులో జెట్‌లీ కూడా నటించారు.
ఇవి కూడా చదవండి:
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- వారమంతా తక్కువ నిద్ర, వారాంతాల్లో ఎక్కువ నిద్ర... బ్యాలెన్స్ అవుతుందా?
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)