సౌదీ అరేబియా: మహిళతో కలిసి టిఫిన్ తిన్నందుకు వ్యక్తి అరెస్ట్

  • 10 సెప్టెంబర్ 2018
అరెస్టయిన ఈజిప్ట్ పౌరుడు

సౌదీ అరేబియాలో ఓ మహిళతో కలిసి అల్పాహారం తిన్నందుకు ఈజిప్ట్‌వాసి ఒకరిని అరెస్ట్ చేశారు. వారిద్దరూ అల్పాహారం తీసుకుంటున్న వీడియో ట్విటర్‌లో వైరల్ కావడంతో ఆయన చిక్కుల్లో పడ్డాడు.

సౌదీ చట్టాల ప్రకారం ఆ దేశ మహిళలెవరైనా తండ్రి, భర్త, సోదరులు, కుమారులతో కాకుండా ఇతర పురుషులతో కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, ఆఫీసులు వంటి చోట్ల భోజనం చేయడంపై నియంత్రణ ఉంది.

అందుకే అక్కడ రెస్టారెంట్లలో కానీ, ఇతర ప్రదేశాల్లో కానీ ఒంటరి పురుషులు వేరేగా, కుటుంబాలు వేరేగా కూర్చుని భుజిస్తాయి.

‘ఆ మహిళను ఎందుకు అరెస్ట్ చేయలేదు?’

30 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో బురఖా వేసుకున్న ఒక మహిళతో కలిసి ఈజిప్ట్ వ్యక్తి అల్పాహారం తింటున్నట్లుగా ఉంది. వీడియో చివర్లో ఆమె అతనికి తినిపిస్తుంది.

ఇది ట్విటర్‌లో వైరల్ కావడంతో సౌదీ కార్మిక, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ ఆయన్ను అరెస్ట్ చేసింది.

ట్విటర్‌లో దీనిపై విమర్శలు కురిశాయి. ఆ వీడియోలో ఉన్న పురుషుడినే అరెస్ట్ చేసి మహిళను విడిచిపెట్టడాన్ని పలువురు తప్పుపట్టారు.

ఈజిప్ట్ ప్రజలు కూడా దీనిపై స్పందించారు. ఆ మహిళకేమీ హాని తలపెట్టేలా చేయలేదని, అయినా, తమ దేశవాసిని అరెస్ట్ చేయడం ఆశ్చర్యంగా ఉందని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తంచేశారు.

ఇటీవల కాలంలో మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కల్పించి ప్రగతిశీలంగా సాగుతున్నట్లుగా కనిపిస్తూ మరోవైపు ఇలాంటి అనాలోచిత న్యాయం ఏంటని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)