అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మీద ఆంక్షలు విధిస్తామని హెచ్చరించిన అమెరికా

  • 11 సెప్టెంబర్ 2018
వైట్ హౌస్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక అమెరికా అధ్యక్ష భవనం

అమెరికా ఆంక్షల నీడలు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) మీద కూడా పడుతున్నాయి. అమెరికన్లకు వ్యతిరేకంగా విచారణలు కొనసాగిస్తే ఆ కోర్టు మీదే ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది.

అఫ్గానిస్తాన్‌లో నిర్బంధించిన వారి మీద అకృత్యాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అమెరికా సైనికులను విచారించే విషయాన్ని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రస్తుతం పరిశీలిస్తోంది.

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ దీని గురించి మాట్లాడుతూ, 'అమెరికా పౌరులను' కాపాడుకోవడానికి తమ ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్తుందని, కోర్టు 'చట్ట విరుద్ధంగా' వ్యవహరిస్తోందని ఆరోపించారు.

2002లో స్థాపించిన ఈ కోర్టులో చేరని డజన్ల కొద్దీ దేశాలలో అమెరికా ఒకటి.

Image copyright Reuters

జాన్ బోల్టన్‌కు కోపం ఎందుకు వచ్చింది?

ఆయన ఎప్పుడూ ఈ కోర్టు గురించి తీవ్రంగానే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే, సోమవారం నాడు ఆయన వాషింగ్టన్‌లో ఆగ్రహంతో చేసిన ప్రసంగం వెనుక రెండు కారణాలున్నాయి.

అమెరికా సైన్యం, ఇంటలిజెన్స్ అధికారుల మీద వచ్చిన ఆరోపణలతో సహా అఫ్గానిస్తాన్‌లోని యుద్ధ నేరాలన్నింటి మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఐసిసి ప్రాసిక్యూటర్ ఫటూ బెన్సోడా గత ఏడాది విజ్ఞప్తి చేశారు. అమెరికా ఆగ్రహానికి ఇది మొదటి కారణం.

ఈ అంశం మీద మాట్లాడుతూ, అటు అఫ్గానిస్తాన్ కానీ, ఇటు ఐసిసి 'రోమ్ స్టాట్యూట్' (రోమ్ నగరంలో 1998లో ఐసిసి సభ్యదేశాలు ఆమోదించిన చట్టం) కానీ అలాంటి విజ్ఞప్తులు చేయలేదని బోల్టన్ అన్నారు.

గాజాలో, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందనే ఆరోపణలతో ఇజ్రాయల్‌ను ఐసిసి ముందు నిలబెట్టాలని పాలస్తీనా ప్రయత్నించడం అమెరికా అసహనానికి రెండో కారణం. అయితే, పాలస్తీనా ఆరోపణలను ఇజ్రాయల్ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని కొట్టిపారేసింది.

పాలస్తీనా అలా చేయడం వల్లే వాషింగ్టన్‌లో ఆ దేశాని చెందిన దౌత్య కార్యాలయాన్ని మూసివేసేందుకు అమెరికా నిర్ణయించిందని బోల్టన్ చెప్పారు.

ఐసిసి మీద తన అభ్యంతరాల గురించి మాట్లాడుతూ ఆయన ప్రస్తావించిన ప్రధానాంశాలు:

  • అది 'అమెరికా సౌర్వభౌమాత్వానికి, జాతీయ భద్రతకు' ముప్పుగా పరిణమిస్తుంది.
  • నిజానిజాలు తెలుసుకోకుండా వ్యవహరించడంతో పాటు, 'నేరాలకు సంబంధించి ఆ కోర్టు పరిధులు, నిర్వచనాలు అస్పష్టంగా ఉన్నాయి.' అంతేకాదు, అది 'నేరాలు, అకృత్యాలను నిరోధించడంలో, శిక్ష విధించడంలో విఫలమైంది.'
  • అది 'అనవసరం'. అమెరికా రాజ్యాంగాన్ని మించిన వ్యవస్థను దేనినీ మేం గుర్తించం.

"మేం ఐసిసికి ఏవిధంగానూ సహకరించేది లేదు. దానిలో చేరే ప్రసక్తే లేదు. అది తనకు తానుగా అంతరించిపోయేలా చేస్తాం. నిజానికి, దాని ఉద్దేశాలు, ప్రయోజనాల రీత్యా అది మా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది" అని బోల్టన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా హకబీ సాండర్స్ కూడా బోల్టన్ మాటలను సమర్థించారు. "ఐసిసి అక్రమ విచారణ నుంచి మా ప్రజలను, మా మిత్ర పక్షాల ప్రజలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవడానికి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నారు" అని అన్నారు.

Image copyright Reuters

అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?

ఐసిసి జడ్జిలు, ప్రాసిక్యూటర్లు అమెరికాలోకి అడుగుపెట్టకుండా నిషేధించవచ్చు. వారికి అందే నిధుల మీద ఆంక్షలు విధించవచ్చు.

"మేం వాళ్ళను అమెరికా నేర చట్టాల ప్రకారం విచారిస్తాం. అమెరికన్ల మీద ఐసిసి విచారణకు మద్దతు తెలిపే సంస్థలు, దేశాలను కూడా విచారిస్తాం" అని బోల్టన్ అన్నారు.

ఐసిసి ప్రతిస్పందన ఏమిటి?

అయితే, ఐసిసి మాత్రం తనకు 123 సభ్య దేశాల మద్దతు ఉందని ప్రకటించింది. "ఐసిసి ఒక న్యాయవ్యవస్థగా రోమ్ స్టాచ్యూట్‌కు కట్టుబడి పని చేస్తుంది. స్వతంత్రంగా, నిష్పాక్షికంగా పని చేస్తుంది" అని ఒక ప్రకటన విడుదల చేసింది.

హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ అసోసియేట్ ఇంటర్నేషనల్ జస్టిస్ డైరెక్టర్ లిజ్ ఇవెన్సన్ దీని మీద స్పందిస్తూ, "సైనిక అకృత్యాల బాధితులను అవమానించేలా బోల్టన్ మాట్లాడారు. నిష్పాక్షిక న్యాయ ప్రక్రియకు సహకరించడానికి బదులు అమెరికా హక్కుల ఉల్లంఘనకు పాల్పడే వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు.. ఎంపీల ‘విలీనం’పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న టీడీపీ

ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది వలస.. 70 ఏళ్లలో ఇదే అత్యధికం - యుఎన్‌హెచ్‌సీఆర్

టీకాలు ఎలా పనిచేస్తాయి.. టీకాల విజయం ఏమిటి.. టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

గుజరాత్ లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు