రష్యా: ప్రచ్ఛన్న యుద్ధం అనంతరం అత్యంత భారీ యుద్ధ విన్యాసాలకు సన్నాహాలు

  • 11 సెప్టెంబర్ 2018
రష్యా, యుద్ధవిన్యాసాలు, వోస్టోక్-2018, నాటో Image copyright Getty Images

ప్రచ్ఛన్న యుద్ధం అనంతరం అతి పెద్ద యుద్ధ విన్యాసాలకు రష్యా సన్నాహాలు చేస్తోంది. తూర్పు సైబీరియా ప్రాంతంలో నిర్వహించనున్న ఈ విన్యాసాల్లో సుమారు 3 లక్షల మంది సైనికులు పాల్గొననున్నారు.

వస్టాక్-2018 పేరిట నిర్వహించనున్న ఈ యుద్ధ విన్యాసాలలో 3,200 మంది చైనా సైనికులు, సైనిక వాహనాలు, విమానాలు కూడా పాల్గొంటున్నాయి. రష్యాలో వస్టాక్ అంటే తూర్పు అని అర్థం. వీటిలో పాల్గొనేందుకు మంగోలియా కూడా తమ బలగాలను పంపుతోంది.

రష్యా ఇదే స్థాయిలో యుద్ధ విన్యాసాలను ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో 1981లో నిర్వహించింది. కానీ వస్టాక్-2018లో దానిని మించిన బలప్రదర్శన చేస్తోంది. నాటో-రష్యాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో వీటిని నిర్వహించనున్నారు.

2014లో రష్యా ఉక్రెయిన్ నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇటీవల రష్యా, అమెరికా ఆధిక్యత కలిగిన 29 సభ్య దేశాల నాటో మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.

రష్యా పట్ల అనుసరిస్తున్న దుందుడుకు, శత్రుపూర్వక వైఖరి కారణంగా ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ సమర్థించుకున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కలిసి సాధన చేస్తున్న రష్యా, చైనా నౌకాదళ సిబ్బంది

ఈ విన్యాసాలలో ఏం జరుగుతుంది?

మంగళవారం, బుధవారం మొత్తం ఈ విన్యాసాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకుని, అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. గురువారం ప్రారంభమయ్యే విన్యాసాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని రష్యా ఆర్మీ జనరల్ వాలెరీ గెరాసిమోవ్ తెలిపారు.

వీటిలో 36,000 ట్యాంకులు, వేయికి పైగా యుద్ధ విమానాలు, సాయుధ సిబ్బంది వాహనాలు పాల్గొంటాయి.

ఈ విన్యాసాలు ఐదు సైనిక శిక్షణా మైదానాలు, నాలుగు ఎయిర్‌బేస్‌లు, సీ ఆఫ్ జపాన్, బెరింగ్ జలసంధి, సీ ఆఫ్ ఒఖోష్ట్‌లలో జరుగుతాయి. వీటిలో నావికా దళానికి చెందిన 80 ఓడలు కూడా పాల్గొంటాయి.

రష్యా సైనిక టీవీ ఛానెల్ జ్వెజ్దా - రష్యాకు చైనా, మంగోలియాలతో ఉన్న సరిహద్దుల్లోని సుగోల్ మిలటరీ రేంజ్‌లో జరిగే విన్యాసాలలో మూడు బ్రిగేడ్ల రష్యా పారా ట్రూప్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపింది.

ప్రధానంగా పశ్చిమ రష్యా నుంచి తూర్పు వైపుకు అతి తక్కువ సమయంలో, సిబ్బందిని, వాహనాలను, విమానాలను అతి వేగంగా తరలించడం ఎలాగో ఈ విన్యాసాలలో ప్రదర్శిస్తారని జ్వెజ్దా వెల్లడించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చైనా నావికా సిబ్బంది

ఇప్పుడెందుకు?

అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ ఇటీవల రష్యా మిలటరీని ఆధునీకరించారు. దానిలో భాగంగా మిలటరీలో కొత్తగా అణు క్షిపణులు కూడా వచ్చి చేరాయి.

రష్యా సైన్యంలో సుమారు 10 లక్షల మంది సిబ్బంది ఉంటారని అంచనా.

రష్యా సెనేటర్, రిజర్వ్ కల్నర్ ఫ్రాంట్స్ క్లింట్ సెవిచ్, ''మా బలగాలకు యుద్ధ నైపుణ్యాలు, సమన్వయం లేవని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. కానీ, పరిస్థితులు మారాయి. ఇప్పుడు మేం యుద్ధానికి మరింత సన్నద్ధంగా ఉన్నాం'' అని తెలిపారు.

చైనా ఎందుకు వీటిలో పాలుపంచుకుంటోంది?

దీనిపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి - రెండు దేశాల మధ్య మిలటరీ సమన్వయం పెరుతుతోందని, వివిధ రకాల భద్రతా సమస్యల నేపథ్యంలో, ఉమ్మడిగా ప్రతిస్పందించేందుకు వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఆ భద్రతా సమస్యలు ఏమిటన్నది ఆయన వివరించలేదు.

ఈ విన్యాసాలలో చైనాకు చెందిన 3,200 మంది సైనికులు, 900 మిలటరీ వాహనాలు, 30 విమానాలు, హెలికాప్టర్లు పాల్గొంటున్నాయని ఆయన నిర్ధారించారు.

కాగా, మంగోలియా మాత్రం తమ బలగాల వివరాలు ప్రకటించలేదు.

Image copyright Getty Images

రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు.. మధ్య ఆసియాలోని ఇస్లామిక్ తీవ్రవాదం రష్యా భద్రతకు ప్రమాదకరంగా పరిణమించిందన్నారు.

ముస్లింలు ఎక్కువగా ఉన్న జింజియాంగ్ ప్రాంతంలో భద్రతను, సెన్సార్ షిప్‌ను చైనా ఇటీవల కఠినతరం చేసింది. జింజియాంగ్‌లో తరచుగా హింసాత్మక సంఘటనలు జరుగుతుండగా, ప్రభుత్వం వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తోంది.

వస్టాక్-2018లో చైనా బలగాలు పాల్గొనడం, రష్యా-చైనాలు అన్ని విషయాలలో సహకరించుకుంటున్నాయి అనడానికి సూచిక అని పెస్కోవ్ అన్నారు.

అయితే ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో యూఎస్‌ఎస్ ఆర్, చైనాలు అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకత్వం కోసం పోటీ పడేవి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మధ్యధరా ప్రాంతంలో టీయూ-160 హెవీ బాంబర్లను మోహరించిన రష్యా

ఇటీవలే యుద్ధ విన్యాసాలు నిర్వహించిన రష్యా

రష్యా ఇటీవలే మధ్యధరా సముద్రంలో యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. వీటిలో ప్రధానంగా యుద్ధ నౌకలు, విమానాల మధ్య సమన్వయాన్ని ప్రదర్శించారు.

వస్టాక్-2018తో పోలిస్తే ఇవి చాలా చిన్నవి. కేవలం 26 యుద్ధనౌకలు, 34 యుద్ధ విమానాలు దీనిలో పాల్గొన్నాయి. వారంపాటు జరిగిన ఈ విన్యాసాలు శనివారమే ముగిసాయి.

పాశ్చాత్య పరిశీలకులు వీటిని రష్యా సిరియాలో నిర్వహిస్తున్న కార్యకలాపాలలో భాగమని భావిస్తున్నారు. సిరియా ప్రభుత్వ బలగాలకు రష్యా విమానాలు సహాయపడుతున్నాయి.

వస్టాక్-2018పై నాటో ప్రతిస్పందన ఏమిటి?

వస్టాక్-2018 గురించి తమకు మే నెలలోనే సమాచారం అందిందని, తాము వాటిని పరిశీలిస్తామని నాటో ప్రతినిధి డైలాన్ వైట్ తెలిపారు.

''అన్ని దేశాలకూ తమ సైనిక శక్తిని ప్రదర్శించే హక్కు ఉంది. అయితే వాటిని పారదర్శకంగా, వాటిలో ఏం జరుగుతుందో ఊహించే విధంగా ఉండాలి'' అన్నారు.

''భారీ స్థాయి యుద్ధం వచ్చినపుడు ఎలా ప్రతిస్పందించాలన్న దానిపై రష్యా దృష్టి పెడుతోందని ఈ విన్యాసాలు నిరూపిస్తున్నాయి'' అన్నారాయన.

Image copyright EPA
చిత్రం శీర్షిక సెయింట్స్ పీటర్స్‌బర్గ్‌లో గత నెలలో నిర్వహించిన నేవీ డేలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

రష్యా-నాటోల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి ?

2014లో రష్యా ఉక్రెయిన్ నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకుని, తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల తిరుగుబాటుదారులను ప్రోత్సహిస్తున్నప్పటి నుంచి రెండింటి మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

ఈ సంఘటనలకు ప్రతిస్పందనగా నాటో తూర్పు యూరప్‌లోని తన సభ్య దేశాలకు 4 వేల బలగాలను పంపింది.

అయితే నాటో ఇలా బలగాలను పంపడం అన్యాయమని, ఇది రెచ్చగొట్టడమే అని రష్యా అంటోంది. 2013-2014లో జరిగిన ఉక్రెయిన్ విప్లవం నిజానికి ఒక కుట్ర అని, దాని వెనుక ఉన్నది పాశ్చాత్య దేశాలే అని రష్యా ఆరోపిస్తోంది.

మార్చిలో ఇంగ్లండ్‌లో రష్యా మాజీ గూఢచారి సెర్గీ స్ర్కిపాల్, ఆయన కూతురు యూలియా విషప్రయోగంలో చనిపోవడంతో రష్యా దౌత్యవేత్తలను నాటో దేశాల నుంచి బహిష్కరించారు.

దీనికి రష్యా మిలటరీ ఇంటలిజెన్స్ జీఆర్‌యూనే కారణమని బ్రిటన్ ఆరోపించగా, రష్యా వాటిని కొట్టిపారేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు