సిరియా యుద్ధం: ఇడ్లిబ్‌‌ నుంచి తిరుగుబాటుదారులను తరిమేసేందుకు సిరియా సన్నద్ధం

  • 12 సెప్టెంబర్ 2018
ఇడ్లిబ్‌లో ఓ బాలిక Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇడ్లిబ్‌లో పది లక్షల మంది దాకా చిన్నపిల్లలున్నారు

సిరియాలో యద్ధం చివరి దశకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ఇడ్లిబ్‌ ప్రావిన్సుపై పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు సిరియా ప్రభుత్వం మిత్ర దేశం రష్యాతో కలిసి ప్రయత్నిస్తోంది.

తిరుగుబాటుదారులు, జిహాదీ మూకల గుప్పిట్లో ఉన్న చివరి అతిపెద్ద నగరం ఇడ్లిబ్. ఆ దేశ అధ్యక్షుడు అసద్‌ను గద్దె దించేందుకు తిరుగుబాటుదారులు ఏడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. 2015లో వాళ్లు ఇడ్లిబ్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.

ఐరాస లెక్కల ప్రకారం ఇడ్లిబ్‌లో దాదాపు పది లక్షల మంది పిల్లలతో కలిపి 29లక్షల మంది దాకా ఉంటున్నారు. వాళ్లలో సగం మంది గతంలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి తప్పించుకొని వచ్చినవారే.

ప్రధాన రహదారులతో అనుసంధానమయ్యే ఇడ్లిబ్ ప్రావీన్సుకు ఓ దిక్కున టర్కీ సరిహద్దుగా ఉంది.

ఒకవేళ సిరియా ప్రభుత్వం ఇడ్లిబ్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకోగలిగితే, దాదాపుగా అక్కడ తిరుగుబాటుదారుల ఓటమి ఖరారైనట్లే.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇడ్లిబ్ ప్రావిన్సులో ప్రభుత్వ అనుకూలదారుల ప్రదర్శన

ఇడ్లిబ్‌లో ఆధిపత్యం ఎవరిది?

ఇడ్లిబ్ ప్రావిన్సు పూర్తిగా ఒకరి అధీనంలో లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వివిధ గ్రూపులకు చెందిన దాదాపు 70వేల మంది దాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు.

ఎక్కువగా అల్-ఖైదాతో సంబంధాలున్న హయత్ తహ్రీర్ అల్-షామ్(హెచ్‌టీఎస్) సంస్థే ఇడ్లిబ్‌ను నియంత్రిస్తోంది. ప్రావిన్సు రాజధాని, టర్కీ సరిహద్దులో ఉన్న బాబ్ అల్-హవా పట్టణంతో పాటు అనేక ముఖ్యమైన ప్రాంతాలు ఆ సంస్థ అధీనంలోనే ఉన్నాయి.

హెచ్‌టీఎస్‌ను ఉగ్రవాద సంస్థగా ఐరాస గుర్తించింది. అల్-ఖైదాతో పాటు ఆ సంస్థ తరఫున ఇడ్లిబ్‌లో 10వేలమంది దాకా పోరాడుతున్నారని ఐరాస అంచనా వేస్తోంది.

టర్కీ మద్దతుతో పనిచేస్తున్న నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (ఎన్‌ఎల్ఎఫ్) రెండో స్థానంలో ఉంది. హెచ్‌టీఎస్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వివిధ తిరుగుబాటు సంస్థల కలయికతో ఈ ఏడాదే ఎన్ఎల్ఎఫ్ ఏర్పడింది. ఫ్రీ సిరియన్ ఆర్మీ పేరిట పోరాడుతున్న అహ్రార్ అల్-షామ్, నూర్ అల్-దిన్ అల్-జింకీ బ్రిగేడ్ల సహా మరి కొన్ని సంస్థలు అందులో భాగమయ్యాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రభుత్వం ఏ క్షణమైనా దాడులు చేయొచ్చని భావిస్తున్న నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, దానికి ముందు నుంచే సన్నద్ధమవుతోంది.

సిరియా ప్రభుత్వం ఇప్పుడెందుకు దాడికి సిద్ధమవుతోంది?

సిరియా యుద్ధం ప్రస్తుతం చాలావరకు అధ్యక్షుడు అసద్‌కు అనుకూలంగా మారింది. సిరియా మిత్ర దేశం రష్యా జరిపిన వైమానిక దాడులు, మరో మిత్రదేశం ఇరాన్ సహాయంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి తిరుగుబాటుదారులను సిరియా మిలిటరీ తరిమేసింది.

ఇడ్లిబ్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవడమే ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని ఆగస్టు 30న సిరియా విదేశాంగ మంత్రి వాలిద్ మాలెమ్ ప్రకటించారు. పౌరుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని, రాజీ ఒప్పందాల ద్వారానే ఇడ్లిబ్‌కు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తామని, హెచ్‌టీఎస్‌ను ఓడించేందుకు మాత్రం తాము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఏళ్ల తరబడి జరుగుతున్న దాడుల కారణంగా ఇడ్లిబ్‌ నగరం బాగా దెబ్బతింది

ఉగ్రవాద భయాన్ని పూర్తిగా అంతమొందించే హక్కు సిరియా ప్రభుత్వానికి ఉందని రష్యా కూడా ఇటీవలే ప్రకటించింది.

మరోపక్క టర్కీ ఇప్పటికే 30లక్షల మంది సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇడ్లిబ్‌లో యుద్ధం తీవ్రమైతే మరింతమంది తమ దేశం వైపు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి ఇడ్లిబ్‌పై తీవ్రమైన దాడులకు దిగొద్దని రష్యాను టర్కీ కోరుతున్నట్లు తెలుస్తోంది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక సిరియాతో తన సరిహద్దులను టర్కీ పూర్తిగా మూసి వేసింది.

ఇడ్లిబ్ పౌరుల భవిష్యత్తు ఏంటి?

ఇడ్లిబ్‌లో పూర్తి స్థాయిలో సైనిక చర్యలు చేపడితే చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడి ఇరుకు భవనాల్లో వేలాది పౌరులు దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు.

ఒకవేళ ఇడ్లిబ్‌పైన దాడులు జరిగితే అక్కడ తీవ్రమైన మానవ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఐరాస సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు. దాడులు జరిగితే దాదాపు 8లక్షల మంది నిర్వాసితులవుతారని, దాంతో శరణార్థుల సమస్య మరింత ముదురుతుందని ఐరాస వ్యాఖ్యానించింది.

ఇప్పటికే టర్కీ తన సరిహద్దులను మూసేయడంతో, నిర్వాసితులు ఎక్కడికి వెళ్తారనేదీ ప్రశ్నార్థకమైంది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక సిరియన్ సైనిక దళాలు ఇటీవల డేరా, క్వినేత్ర ప్రావిన్సులను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నాయి

ఇడ్లిబ్‌పై దాడిని ఆపడం సాధ్యమా?

రష్యా, ఇరాన్, టర్కీలను యుద్ధంలోకి చొచ్చుకు రావొద్దని సిరియాలోని ఐరాస ప్రత్యేక రాయబారి స్టఫన్ డె మిస్తురా కోరారు. రాజకీయ చర్చలు జరపాలని, లేదా ప్రభుత్వ అధీనంలో సురక్షిత కేంద్రాలను నిర్మించి పౌరులను అక్కడికి తరలించాలని ఆయన రెండు మార్గాలను సూచించారు.

కానీ శాంతి ఒప్పందాన్ని జిహాదీలు గౌరవిస్తారని తాను భావించట్లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రభుత్వ అనుకూల దళాలు క్రమ పద్ధతిలో ఇడ్లిబ్‌పై పట్టు సాధించాలని ఆయన సూచించారు.

మరోపక్క సిరియా అధ్యక్షుడు అసద్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటుకు మద్దతు తెలుపుతున్న అమెరికా స్పందిస్తూ, ఇడ్లిబ్‌లో ప్రభుత్వం రసాయన ఆయుధాలను ఉపయోగిస్తే తాము ‘వేగంగా, బలంగా’ జవాబిస్తామని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)