సెరీనా విలియమ్స్‌పై జాతివివక్ష కార్టూన్‌: సోషల్ మీడియాలో కలకలం

  • 12 సెప్టెంబర్ 2018
సెరీనా కోపం Image copyright AFP/getty

ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ అభిమానులు ఇప్పుడు రెండుగా విడిపోయారు. ఒక వర్గం సెరీనా విలియమ్స్ ‌వైపు నిలిస్తే, ఇంకో వర్గం మాత్రం యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరీనా తీరు సరిగా లేదని భావిస్తోంది.

ఈ విషయం అప్పుడే చల్లారేలా లేదు. ఇప్పుడు అందరూ ఆస్ట్రేలియా కార్టూనిస్ట్ మార్క్ నైట్ వేసిన ఒక కార్టూన్ విషయంలో రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది.

ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది చదివే వార్తాపత్రిక ‘ద హెరాల్డ్ సన్’లో సోమవారం మార్క్ నైట్ వేసిన ఆ కార్టూన్‌ను ప్రచురించారు.

ఈ కార్టూన్లో సెరీనా కోపంతో అరుస్తూ తన రాకెట్ విరగ్గొడుతున్నట్లుగా ఉంది. ఇటు అంపైర్ జపాన్ క్రీడాకారిణి ఒసాకాతో 'మీరు ఆమెను కాస్త, గెలవనిస్తారా' అని చెబుతూ ఉంటారు.

మార్క్ వేసిన ఈ కార్టూన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది దీనిని రేసిస్ట్(జాతివివక్ష), సెక్సిస్ట్(లింగవివక్ష) కార్టూన్ అంటూ విమర్శిస్తున్నారు. కొంతమంది మాత్రం కార్టూన్‌లో ఏ తప్పూ లేదంటున్నారు.

మరి కొంతమంది అయితే ఈ కార్టూన్‌లో జపాన్ యువ క్రీడాకారిణి నవోమీ ఒసాకాను తక్కువ చేసి చూపించారని ఆరోపిస్తున్నారు.

యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరీనా విలియమ్స్ అంపైర్ కార్లోస్ రమోస్‌ను 'అబద్ధాలకోరు', 'దొంగ' అన్నారు. మ్యాచ్ సమయంలో ఆమె కోపంతో తన రాకెట్ కూడా విరగ్గొట్టారు.

Image copyright Reuters

లింగ వివక్ష ఆరోపణలు

ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు సెరీనా విలియమ్స్‌కు 17 వేల డాలర్ల జరిమానా విధించారు.

ఆట జరుగుతున్నప్పుడు తను ఎలాంటి చీటింగ్ చేయలేదని, తప్పుగా ప్రవర్తించలేదని సెరీనా చెబుతున్నారు. లింగవివక్షతోనే తనకు జరిమానా విధించారని, పాయింట్ కట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆరోపించారు.

అయితే కార్టూనిస్ట్ మార్క్ నైట్, వార్తాపత్రిక ఎడిటర్ డమాన్ జాన్‌స్టన్ మాత్రం తమను సమర్థించుకున్నారు. కార్టూన్లో లింగవివక్ష, జాతివివక్ష ఉందన్న ఆరోపణలను తోసిపుచ్చారు.

ఎడిటర్ డమన్ జాన్‌స్టన్ తన ట్వీట్‌లో "ఈ కార్టూన్ ఒక టెన్నిస్ లెజండ్ అనుచిత వ్యవహారం గురించి వ్యంగ్యంగా చెబుతుంది. మార్క్‌కు ప్రతిఒక్కరి మద్దతుంది" అని చెప్పారు.

ఇటు ప్రముఖ రచయిత్రి జేకే రౌలింగ్ కార్టూనిస్ట్ మార్క్‌పై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. "ప్రపంచంలోని గొప్ప క్రీడాకారుల్లో ఒకరిపై (సెరీనా) లింగవివక్ష, జాతివివక్ష ప్రదర్శించడం, మరో గొప్ప క్రీడాకారిణిని(ఒసాకా) అనామక ప్రాప్‌గా చిత్రించడం చాలా బాగుంది" అన్నారు.

ఒక ట్విటర్ యూజర్ "మీ జాతివివక్ష చూపించేందుకు చాలా ప్రయత్నించారు. ఎన్ని చేసినా మీరు ఇంతకంటే ఎక్కువ రేసిస్ట్ కాలేరు. మీరు సెరీనా భారీ క్యారికేచర్ వేశారు. ఆమెను అవసరం కంటే ఎక్కువ భారీగా చూపించారు. ఆమె పెదాలు లావుగా, శరీర భాగాలను కావాలనే పెద్దవిగా వేశారు. మీకు, 1800 నాటి రేసిస్టులకు ఎవరికీ ఎలాంటి తేడా కనిపించదు" అని పోస్ట్ చేశారు.

Image copyright Twitter

అమెరికా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ కూడా ఈ కార్టూన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది.

మైక్ నైట్ గత నెలలో వేసిన ఒక కార్టూన్‌పైన కూడా జాతివివక్ష ఆరోపణలు వచ్చాయి. ఆ కార్టూన్లో ముఖం లేని కొంతమంది నల్లవాళ్లు, మెల్‌బోర్న్ సబ్‌వేలో గొడవపడుతున్నట్టు ఆయన చూపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)