అఫ్గానిస్తాన్: దారుణంగా మారిన దీర్ఘకాలిక యుద్ధం

  • 15 సెప్టెంబర్ 2018
అఫ్గాన్‌లో పరిస్థితి Image copyright Getty Images

అఫ్గానిస్తాన్‌లో గతంలో పత్రికల్లో పతాక శీర్షికలుగా కనిపించిన మరణ వార్తలు ఇప్పుడు మామూలు విషయాలైపోయాయి. ఆ దేశంలో సైన్యం మీద తాలిబాన్, ఇతర మిలిటెంట్ గ్రూపుల దాడులు నిత్యకృత్యమయ్యాయి. ఈ ఎడతెగని ఘర్షణలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందన్నది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న.

2001లో అమెరికా ఆధ్వర్యంలో అఫ్గాన్‌లో దాడులు జరిగిన అనంతరం పరిస్థితి క్షీణించడం మొదలైంది. ప్రస్తుతం దేశమంతటా తీవ్రమైన అభద్రత అలముకుంది. గత పదిహేడేళ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువ భూభాగాన్ని తాలిబాన్లు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.

అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలంపాటు సాగుతున్న యుద్ధమిది. రోజులు గడిచే కొద్దీ అక్కడ పరిస్థితి మరింత జటిలమైంది. దాడులు మరింత తరచుగా, తీవ్రంగా, విస్తారంగా, భయానకంగా జరుగుతున్నాయి. అటు తాలిబాన్లు, ఇటు అమెరికా/నాటో సహకారంలో పనిచేస్తున్న అఫ్గాన్ ప్రభుత్వ బలగాలు పరస్పరం పై చేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఆగస్టు 10న తాలిబాన్లు రాజకీయంగా కీలకమైన ‘ఘజ్ని’ ప్రావిన్సులోకి అడుగుపెట్టారు. కానీ అఫ్ఘాన్‌ సేనలు... అమెరికా మద్దతుతో జరిగిన వైమానిక దాడుల సహాయంతో వారిని వెనక్కు పంపాయి. ఈ ఏడాది మే 15న తాలిబాన్లు పశ్చిమ అఫ్గానిస్తాన్‌లో ఇరాన్‌ సరిహద్దు దగ్గరగా ఉన్న ఫరా ప్రావిన్సులో అడుగుపెట్టారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక కాల్పుల విరమణ సమయంలో అఫ్గాన్ సైనికుడితో ఫొటోకు పోజిచ్సిన తాలిబాన్లు

ఇలా వాళ్లు ముందడుగు వేస్తున్నప్పుడల్లా జరుగుతున్న దాడుల్లో చాలామంది తాలిబాన్లు చనిపోతున్నారు. కానీ అలాంటి దాడులు వాళ్ల స్థైర్యాన్ని పెంచడంతో పాటు మరింత మంది తమ వైపు ఆకర్షితులయ్యేందుకు ప్రేరేపిస్తున్నాయి.

వందలాది యూఎస్, యూకే, ఇతర విదేశీ బలగాలకు చెందిన వాళ్లు హత్యకు గురైన హెల్మాండ్, ఖాందహార్ లాంటి ప్రావిన్సుల్లో ఎక్కువ భాగం ఇప్పటికీ తాలిబాన్ల అధీనంలోనే ఉంది. వీళ్ల దాడుల్లో చనిపోతున్న సామాన్య పౌరుల సంఖ్య కూడా అత్యధిక స్థాయికి చేరుకుంది.

ఐరాస లెక్కల ప్రకారం 2017లో దాదాపు పదివేల మంది పౌరులు ఈ దాడుల్లో గాయాల పాలయ్యారు. వాళ్లలో ఎక్కువమంది మృతిచెందారు. 2018లో ఆ సంఖ్య మరింత ఎక్కువవుతుందని అంచనా.

Image copyright Getty Images

ట్రంప్ ప్రణాళిక పనిచేస్తోందా?

అఫ్గానిస్థాన్‌లో ‘గెలవడానికే పోరాడతాం’ అని వ్యాఖ్యానిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్రణాళికలను రూపొందించారు. తాలిబాన్లను అణచివేయడానికి చతుర్ముఖ వ్యూహాన్ని అమలు చేస్తామని, వాళ్లను అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చలకు ఒప్పిస్తామని తెలిపారు.

1. అత్యధిక స్థాయిలో సైనిక ఒత్తిడి.. వైమానిక దళం, ప్రత్యేక బలగాలతో దాడులు పెంచుతామని చెప్పారు. వేలాదిమంది అమెరికా సైనికులను అఫ్గాన్‌లో ప్రవేశపెట్టారు.

2. తాలిబాన్ల ఆర్థిక వనరులను లక్ష్యంగా చేసుకోవడం. ముఖ్యంగా ఓపియం ఉత్పత్తి కేంద్రాలపై బాంబులు కురిపించి ధ్వంసం చేయడమన్నది అమెరికా ఎంచుకున్న మరో మార్గం. ఓపియం ఉత్పత్తిదారుల నుంచే వారికి అత్యధికంగా విదేశీ కరెన్సీ వారికి అందుతోంది.

3. తాలిబాన్ల యుద్ధంలోని ధర్మబద్ధత గురించి మతవాద సంస్థలను బహిరంగంగా ప్రశ్నించి, దాని ద్వారా పౌరుల్లో అవగాహన పెంచడం.

4. పాకిస్తాన్‌ మీద ఒత్తిడి పెంచి అక్కడ తలదాచుకుంటున్న తాలిబాన్‌ నేతలను పట్టుకోవడం.

Image copyright Getty Images

కానీ ఈ నాలుగు మార్గాలూ చాలా వరకు విఫలమైనట్లే కనిపిస్తున్నాయి.

  • అమెరికా, అఫ్గాన్ సేనల దాడుల కారణంగా తాలిబాన్ల భూభాగ విస్తరణ తగ్గినా, అప్పటికే స్థిరపడిన ప్రాంతాల్లో వాళ్లు మరింత బలం పుంజుకున్నారు. తాలిబాన్ సభ్యులు చనిపోయేకొద్దీ కొత్తవారిని చేర్చుకోవడంలో విజయవంతమయ్యారు. మరోవైపు వైమానిక దాడుల్లో సామాన్యులూ ప్రాణాలు కోల్పోతుండటం మీద విమర్శలు ఎక్కువయ్యాయి.
  • ఓపియం తయారీ కేంద్రాలపై బాంబు దాడులు జరిపినా, తాలిబాన్లకు ఆర్థిక సంక్షోభం తలెత్తిన దాఖలాలు లేవు. నిజానికి వాళ్ల సంపద మరింత పెరిగినట్లు కనిపిస్తోంది.
  • తాలిబాన్ల హింసను చాలామంది ఇస్లామిక్ మేధావులు బహిరంగంగా ఖండించడంతో పాటు ఇండోనేసియా, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో సమావేశాలు నిర్వహించి వాళ్లను ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. కానీ అదంతా అమెరికన్ కుట్రగా తాలిబాన్లు అభివర్ణించారు.
  • చెప్పినట్లుగానే అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్ పట్ల కఠిన ధోరణి అవలంబిస్తూ ఆర్థిక సహాయాన్ని నిలిపివేసింది. తాము తాలిబాన్లకు సహాయం చేయడంలేదని చెబుతోన్న పాకిస్తాన్‌, అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పే ప్రక్రియలో తానూ భాగమవుతానని అంటోంది. కానీ ఆచరణలో అది కనిపించట్లేదు.

యుద్ధానికి కారణాలేంటి?

అఫ్ఘానిస్తాన్‌లో యుద్ధం తీవ్రతరం కావడానికి ఐదు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

1. ఇరు పక్షాలు తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి, అత్యధిక భూభాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

2. 2001 తరువాత ఎన్ని దాడులు జరిగినప్పటికీ తిరుగుబాటుదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పదేళ్ల క్రితం అఫ్ఘాన్‌లో 15వేల మంది తిరుగుబాటుదారులు ఉన్నారని అంచనా వేశారు. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య 60వేలు దాటింది.

3. అఫ్ఘానిస్తాన్‌, పాకిస్తాన్‌లలో ఇస్లామిక్ స్టేట్ శాఖలు ఉద్భవించడంతో హింస మరింత తీవ్రమైంది. నగరాల్లో పౌరులనే లక్ష్యంగా చేసుకొని అనేక భయంకరమైన దాడులకు పాల్పడినట్లు ఈ గ్రూపు పేర్కొంది.

4. శాంతి చర్చలకు సంబంధించిన ప్రస్తావన ఎక్కువగా వస్తుండటంతో... ఆ చర్చలలో తమ డిమాండ్లదే పై చేయిగా ఉండాలని తాలిబాన్లు భావిస్తున్నారు.

5. ఇరాన్, రష్యా, పాకిస్తాన్‌ లాంటి దేశాలకూ అమెరికాకూ మధ్య పెరుగుతున్న దూరం కూడా అఫ్ఘానిస్తాన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ మూడు దేశాలూ తాలిబాన్లకు మద్దతిస్తున్నాయని అఫ్ఘాన్ అధికారులు అంటున్నారు. కానీ ఆ దేశాలు ఆ ఆరోపణలను ఖండిస్తున్నాయి.

Image copyright Getty Images

అఫ్ఘాన్ సేనలు అడ్డుకోగలవా?

తాలిబాన్ల హింస వేగంగా విస్తరిస్తుండటంతో పాటు అఫ్ఘాన్ భద్రతా బలగాల పరిధి కూడా విస్తరిస్తోంది. ఈ క్రమంలో జరుగుతున్న దాడుల్లో ప్రభుత్వ భద్రతా బలగాలకు చెందిన వేలాది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ దేశంలో నెలకొన్న అవినీతితో పాటు నాయకత్వ లోపం, సైన్యానికి వనరుల సరఫరాపైన అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల మధ్య లోపించిన సమన్వయం వల్ల పాలన సజావుగా సాగట్లేదు. అనేక అంశాల్లో ప్రభుత్వంలోని రెండు పక్షాలపై ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరట్లేదు.

Image copyright Getty Images

ఎన్నికలు జరుగుతాయా?

మూడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పార్లమెంటరీ ఎన్నికలను ఈ ఏడాది అక్టోబర్ 20న నిర్వహించాలని నిర్ణయించారు. కానీ పెరిగిన హింస కారణంగా ఆ ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఒకవేళ హింస కారణంగా ఎన్నికలు రద్దయితే తరువాత పరిస్థితి ఎలా ఉంటుందనేదీ ప్రశ్నార్థకమైంది. 2019 ఏప్రిల్‌లో అధ్యక్ష ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ప్రస్తుత ప్రభుత్వ శక్తి సామర్థ్యాలకు ఈ రెండు ఎన్నికలు పరీక్ష పెట్టనున్నాయి.

సైనిక చర్య ద్వారా అఫ్ఘాన్‌లో శాంతి నెలకొనే అవకాశం లేదనే అభిప్రాయం దాదాపు అన్ని వర్గాల్లోనూ కనిపిస్తోంది. కాబట్టి అటు తాలిబాన్లతో పాటు ప్రభుత్వం కూడా చర్చలకు సముఖంగానే ఉంది.

ఇప్పటికే అమెరికా అధికారులు, తాలిబాన్ ప్రతినిధుల మధ్య ఖతార్‌లో ఓ సమావేశం జరిగింది. త్వరలో వాళ్లు మళ్లీ కలవనున్నారు. ఎంత దూకుడుగా వ్యవహరించినప్పటికీ రెండు పక్షాలూ యుద్ధాన్ని గెలవలేవనడానికి ఈ సమావేశాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

కానీ అమెరికా-అఫ్ఘానిస్తాన్‌తో పాటు పాకిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా, భారత్‌, చైనా లాంటి దేశాల సహాకరంతోనే అఫ్ఘాన్‌లో శాంతి నెలకొనే అవకాశం ఉంటుంది. ఆ పైన యుద్ధంతో చితికిపోయిన నేల రాజకీయ భవిష్యత్తు ఏంటనేది నిర్ణయించాల్సింది అఫ్ఘాన్ వాసులే.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)