ఆస్ట్రేలియా: స్ట్రాబెర్రీల్లో సూదులు.. ముక్కలుగా కోసుకుని తినండి - హెచ్చరించిన ప్రభుత్వం

  • 15 సెప్టెంబర్ 2018
స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలను ఎలా తింటారు? చిన్నచిన్నవైతే ఒకేసారి నోట్లో వేసుకుని నమిలి తింటారు. కొంచెం పెద్దగా ఉంటే కొరికి తింటారు. కానీ, ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు మాత్రం చిన్నచిన్న ముక్కలుగా కోశాకే వాటిని తినాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఆరోగ్య అధికారులు ఇలా హెచ్చరించడానికి కారణాలున్నాయి. అక్కడ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న స్ట్రాబెర్రీలలో సూదులు ఉంటున్నాయట. అవి తిన్నవారు ఆసుపత్రి పాలైన ఘటనలూ తాజాగా నమోదయ్యాయి. దీంతో అత్యవసరంగా ఈ ఆదేశాలిచ్చారు.

న్యూసౌత్ వేల్స్, క్వీన్స్ ల్యాండ్, విక్టోరియా తదితర ప్రాంతాల్లోని సూపర్ మార్కెట్లలో ఇలా సూదులున్న స్ట్రాబెర్రీలు బయటపడ్డాయి. చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో స్ట్రాబెర్రీలను పెట్టి, ప్యాక్ చేసి సూపర్ మార్కెట్లలో విక్రయిస్తుంటారు.

ఓ యువకుడు, తొమ్మిదేళ్ల బాలుడు ఇలా సూదులున్న స్ట్రాబెర్రీలను చూసుకోకుండా తిని గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.

తాజా పరిణామాలతో పలు బ్రాండ్ల స్ట్రాబెర్రీలను మార్కెట్ల నుంచి వెనక్కు తీసుకున్నారు.

జోషువా గనె అనే వ్యక్తి తన 21 ఏళ్ల స్నేహితుడికి స్ట్రాబెర్రీ తిన్న తరువాత తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని.. అందులో సూది ఉందంటూ ఫోటోలు సహా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం ఇదంతా వెలుగులోకి వచ్చింది.

కాగా ఇలా పండ్లలో సూదులుండడం వెనుక విద్రోహ చర్య ఉందని స్ట్రాబెర్రీ రైతుల సంఘం ఆరోపిస్తోంది.

ఇలాంటి చర్యలు విక్రయాలపై ప్రభావం చూపిస్తాయని రైతులు, విక్రేతలు ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియాలో స్ట్రాబెర్రీల వ్యాపారం విలువ ఏడాదికి 130 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు రూ.677 కోట్లు). ఇలాంటి సంఘటనలు స్ట్రాబెర్రీల కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇలా పండ్లలో సూదులు కనిపించడానికి గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. క్వీన్స్‌లాండ్ స్ట్రాబెర్రీ పెంపకందార్ల సంఘం ప్రతినిధి జెన్నీఫర్ రోలింగ్ మాత్రం.. కావాలనే ఎవరో స్ట్రాబెర్రీల్లో సూదులు గుచ్చి ఉంటారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)