ఈ పరికరంతో గర్భం రాదు, ఎక్కువ మంది మహిళలు ఎందుకు వాడట్లేదు?

  • జారియా గోర్వెట్
  • బీబీసీ ప్రతినిధి
గర్భనిరోధకాలు

ఫొటో సోర్స్, Thinkstock

గర్భ నిరోధం కోసం భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతి కుటుంబ నియంత్రణ. అయితే ప్రపంచమంతా కూడా ఎక్కువగా ఈ పద్ధతినే ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత స్థానంలో గర్భనిరోధక మందులు నిలిచాయి. అయితే గర్భ నిరోధం కోసం ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ వాటి వాడకం చాలా తక్కువగా ఉంది.

గర్భనిరోధకాలలో మెరుగైన ప్రత్యామ్నాయం ఐయూడీ అంటే ఇంట్రా యుటెరైన్ డివైజ్. చిన్న పేపరుకు వేసిన క్లిప్‌లా ఉండే ఇది చాలా రకాల ఆకారాల్లో వస్తుంది.

గుండ్రంగా ముడతల్లా ఉండడం నుంచి నాలుగు కాళ్ల సాలెపురుగు ఆకారం వరకూ ఈ గర్భ నిరోధకాలు లభిస్తున్నాయి.

భారతదేశంలో ఎక్కువగా ఇంగ్లీష్ టీ అక్షరంలా ఉండే డివైజ్ ఉపయోగిస్తున్నారు. అంటే కాపర్-టి. దీనిని ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. దీని నుంచి దారం వచ్చుంటుంది.

పాశ్చాత్య దేశాల్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. దీనిని మహిళల గర్భాశయంలో ఫిట్ చేస్తారు. కంపెనీ, క్వాలిటీనిబట్టి ఈ డివైస్ గర్భాశయంలో సుమారు 12 ఏళ్ల వరకూ ఉండవచ్చు.

దీనిని అత్యంత సమర్థంగా పనిచేసే గర్భనిరోధకంగా భావిస్తున్నారు. కానీ అంతమాత్రాన ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ దీని గురించి తెలుసని అనుకోలేం.

ఉదాహరణకు ఆసియాలో 27 శాతం మంది మహిళలు మాత్రమే ఐయూడీ గర్భ నిరోధక డివైజ్ ఉపయోగిస్తున్నారు. అదే ఉత్తర అమెరికాలో కేవలం 6.1 శాతం, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో రెండు శాతం మందికి మాత్రమే దీని గురించి తెలుసు.

అయినా ఇంత ప్రభావవంతమైన గర్భనిరోధకం గురించి మహిళలకు ఎందుకు తెలీదు?

మార్కెటింగ్‌పై దృష్టి పెట్టడం లేదు

అమెరికాలో దీని మార్కెటింగ్ గురించి పెద్దగా పట్టించుకోరు. మందుల కంపెనీలు గర్భనిరోధక మాత్రల గురించి బాగా ప్రచారం చేసి, ఎక్కువ సంపాదిస్తాయి. అందుకే మహిళలకు వాటి గురించి ఎక్కువ తెలుసు. వాటినే ఉపయోగిస్తున్నారు కూడా.

నాన్ ప్రాఫిట్ హ్యూమన్ డెవలప్‌మెంట్ సంస్థ ఎఫ్‌హెచ్ఐ 360లో పనిచేసే అంటువ్యాధుల నిపుణుడు డేవిడ్ హ్యూబ్చర్ "చాలా కంపెనీలు చాలా రకాల మాత్రలు మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అన్ని మాత్రల ఫార్ములాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. కానీ ప్రతి కంపెనీ తమ మందులను మెరుగైన గర్భనిరోధకాలుగా మార్కెట్లో అమ్ముతున్నాయి. ఐయూడీ 1988 నుంచి మార్కెట్లో ఉంది. కానీ దాని ప్రచారం, మార్కెటింగ్‌ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు" అని చెప్పారు.

ఐయూడీ గురించి అపోహలు

ఐయూడీ గురించి పెద్దగా తెలీకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. దీని గురించి జనాల్లో రకరకాల వదంతులు వ్యాపించాయి. ఐయూడీ వల్ల సెక్సువల్ లైఫ్ పాడైపోతుందని. దీనివల్ల చాలా నొప్పి ఉంటుందని, అన్నిటినీ మించి ఐయూడీ వల్ల కావాలనుకున్నప్పుడు అసలు పిల్లలే పుట్టరనే అపోహలు ప్రచారం చేశారు.

ప్రజల్లో అపోహల గురించి 19వ శతాబ్దంలోనే ఆధారాలు లభించాయి. అయినా ఐయూడీ తయారు చేయడానికి ముందే పరిశోధకులు, దీనికి ఎన్నో రకాల పరిష్కారాలు వెతికేవారు. మహిళల గర్భాశయంలో రకరకాల డివైసెస్ పెట్టారు. వీటిని స్టెమ్ పెస్రీజ్ అనేవారు. వాటిని రబ్బర్, గాజుతో తయారుచేసేవారు. కానీ సమర్థవంతమైన ఐయూడీ వెర్షన్‌ను 1920లో జర్మనీ డాక్టర్ అన్సర్ట్ గ్రెఫెన్‌బర్గ్ కనిపెట్టారు. జీ-స్పాట్ అనే పేరు ఆయన పేరుతోనే వచ్చింది.

గ్రెఫెన్‌బర్గ్ డిజైన్ చేసిన ఐయూడీ ఒక మామూలు వలయాల్లా ఉండేది. దానిని గర్భాశయంలో పెట్టేవారు. డాక్టర్ గ్రెఫెన్‌బర్గ్ తన ప్రాజెక్ట్‌పై ఇంకా పనిచేస్తున్నప్పుడు జర్మనీలోని నాజీలు ఆయన్ను పట్టుకుని జైల్లో పెట్టారు.

కానీ తర్వాత డాక్టర్ మార్గరెట్ సెంగర్ ఆయన్ను ఎలాగోలా విడుదల చేయించి అమెరికాకు తీసుకొచ్చారు. తర్వాత ఆయన మళ్లీ తన ప్రాజెక్టుపైన పనిచేయడం మొదలు పెట్టారు. చైనా వన్-చైల్డ్ పాలసీ విజయవంతం కావడంలో ఆయన ఐయూడీ కీలక పాత్ర పోషించింది.

ఇప్పుడు చైనా కూడా తమ దేశంలో చాలా రకాల డివైస్‌లు తయారు చేస్తోంది. కానీ వాటిని తిరిగి శరీరం నుంచి బయటకు తీసేందుకు ఆపరేషన్ చేయాల్సివస్తోంది.

1960లో అమెరికాలో డల్కోన్ షీల్డ్ అనే ఐయూడీని మార్కెట్లో విడుదల చేశారు. అది డాక్టర్ గ్రెఫెన్‌బర్గ్ తయారు చేసిన ఐయూడీలాగే ఉండేది. కానీ దాని సైజు పెద్దది. దానిలో గుర్రపు నాడా లాంటి తీగ వచ్చి ఉండేది.

గర్భనిరోధక మాత్రలతో నష్టాలు

డల్కోన్ షీల్డ్‌తో మెరుగైన ఐయూడీ తయారు చేయాలని అనుకున్నారు. కానీ దానివల్ల ముప్పు ఎక్కువైంది. చాలా త్వరగా ఇన్ఫెక్షన్ వచ్చేది. డివైస్ ఘోరంగా విఫలం కావడంతో అమెరికాలో 50 వేల మంది మహిళలు దానిని తయారు చేసిన కంపెనీకి వ్యతిరేకంగా కేసు వేశారు.

ఐయూడీ మాడ్రన్ వెర్షన్ చాలా మెరుగ్గా, ప్రభావవతంగా ఉందని డేవిడ్ హ్యూబ్చర్ చెబుతున్నారు. కానీ మహిళలకు వాటి ప్రయోజనాల గురించి తెలియడం కూడా అవసరం అన్నారు. ముంబయి నుంచి మెల్‌బోర్న్ వరకూ కోట్ల మంది మహిళలు ఉదయం పడకపైనుంచి లేవగానే మాత్రలు వేసుకుంటున్నారు. అదంత సులభం కాదు. ఐయూడీ వేసుకుంటే అన్ని మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మహిళలపై మానసిక ఒత్తిడి కూడా ఉండదు.

గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల గర్భం ధరించే అవకాశాలు దాదాపు ఒక్క శాతమే ఉంటాయి. కానీ ప్రాక్టికల్‌గా ప్రతి మహిళా నెలలో కనీసం ఐదు రోజులు మాత్రలు వేసుకోవడం మర్చిపోతే గర్భం ధరించే అవకాశాలు 9 శాతం వరకూ పెరగవచ్చు.

అంటే ఒకవేళ ఏ మహిళ అయినా పదేళ్ల వరకూ గర్భనిరోధక మాత్రలు వేసుకుంటూ ఉంటే ఆమె గర్భవతి అయ్యే అవకాశాలు 61 శాతం పెరుగుతాయి. అంటే అన్ని మాత్రలు వేసుకున్న తర్వాత కూడా ఆమె లక్ష్యం పనిచేయదు.

ఒక అంచనా ప్రకారం గర్భనిరోధక మాత్రలు వేసుకున్నప్పటికీ ప్రతి ఏటా 9 లక్షల 60 వేల మంది మహిళలు గర్భం ధరిస్తున్నారు. ఎక్కువ కాలంపాటు గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యం కూడా పాడవుతోంది.

గర్భనిరోధం కోసం ఎన్ని పద్ధతులు ఉన్నా, కండోమ్ ఉపయోగించినా, వేరే ఎలాంటి పద్ధతులు అనుసరించినా, వ్యవహారిక జీవితంలో అవి ఎలా పనిచేయాలో, అలా జరగడం లేదు. కానీ ఐయూడీ ఈ పద్ధతులకంటే భిన్నంగా ఉంటంది. కాపర్ ఐయూడీ వల్ల గర్భధారణ అవకాశాలు ఏడాది వరకూ ఒక శాతం, పదేళ్ల వరకూ 8 శాతం మాత్రమే ఉంటాయి.

ఐయూడీ రెండు రకాలుగా సమర్థవంతమైనది. మొదట ఐయూడీ వేసుకోవడం వల్ల గర్భాశయంలో వీర్యం ఎక్కడికి చేరుతుందో, అక్కడికి రక్తంలోని తెల్లరక్త కణాలు వేగంగా చేరుకుని ఆ వీర్య కణాలను తొలగిస్తాయి. ఒక స్టడీ ప్రకారం ఐయూడీ అలాంటి కణాల సంఖ్యను వెయ్యి రెట్లు పెంచుతుంది.

ఫొటో సోర్స్, BBC/SCIENCE MUSEUM, LONDON

ఐయూడీ రెండో ప్రయోజనం దాని క్వాలిటీ, రకంపై ఆధారపడి ఉంటుంది. ఐయూడీ హార్మొనల్ వెర్షన్ మహిళల గర్భంలో పుట్టే అండాల దగ్గరకు వీర్యాన్ని వెళ్లనివ్వదు. అంతే కాదు, కాపర్ ఐయూడీ వీర్య కణాలను పూర్తిగా చంపేస్తుంది. అయితే కాపర్ అయాన్స్ వీర్య కణాలను ఎలా తిరస్కరిస్తాయి అనేది ఇప్పటికీ రహస్యమే.

ఐయూడీ వల్ల లాభాలతోపాటూ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కానీ ప్రయోజనాలతో పోలిస్తే, నష్టం లేనట్టే అనుకోవాలి. మొదట ఈ ఐయూడీ డివైస్‌ను పెట్టుకున్నప్పుడు దీనిని గర్భాశయ పొర నుంచి పైకి పంపిస్తారు. అప్పుడు ఏవైనా మెడికల్ సమస్యలు రావచ్చు. కానీ అలా చాలా తక్కువ జరుగుతుంది. బహుశా వెయ్యి మందిలో ఒక కేసులో అలా అవుతుంది.

ఫొటో సోర్స్, BBC/SCIENCE MUSEUM, LONDON

ఇక దీనిని వేయడం వల్ల అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. లేదా ఐయూడీ సరిగా వేసుకోకపోతే, గర్భాశయంలో కాకుండా ఫెలోపిన్ ట్యూబ్‌లో గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా సమస్యలు ఎదురైతే ఐయూడీని తీసేయవచ్చు.

అంతే కాదు ఐయూడీ వేసుకోవడం వల్ల ఎక్కువ నొప్పి ఉంటుందని మహిళలకు భయం ఉంటుంది. కానీ అది నిజం కాదు. కాస్త నొప్పిగా అనిపించినా, అది కాసేపే ఉంటుంది.

చాలాకాలం వరకూ కనీసం ఒక్కసారైనా తల్లి అయిన మహిళలే ఐయూడీ నొప్పిని భరించగలిగేవారని డాక్టర్లు కూడా అనుకుంటూ వచ్చారు. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత బర్త్ కెనాల్ కాస్త సాగుతుందని అనుకునేవారు. కానీ అలా జరగదు. అయితే ఇప్పుడు ఐయూడీ వేసే ముందు మహిళలకు చిన్న నొప్పి కూడా లేకుండా డాక్టర్లు మత్తు మందు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

ఐయూడీ ఉపయోగించడానికి ఇప్పుడు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే దీని ఖరీదు కాస్త ఎక్కువే. బహుశా అందుకే చాలా మంది మహిళలు దీనికి దూరంగా ఉంటున్నారు. కానీ పదేళ్ల వరకూ గర్భనిరోధక మాత్రలు తీసుకునే ఖర్చుతో పోలిస్తే, దీని ఖరీదు చాలా తక్కువనే చెప్పచ్చు.

(ఈ వార్తను 2018 సెప్టెంబరు 1 7న ప్రచురించాం. ఎక్కువ మందికి అందించాలన్న ఉద్దేశంతో మళ్లీ పబ్లిష్ చేశాం)

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)