ఫెంటానిల్: ఇది హెరాయిన్‌ కన్నా ప్రమాదకరమైన డ్రగ్

  • 24 సెప్టెంబర్ 2018
ఫెంటానిల్ Image copyright Getty Images

చైనా - అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం మధ్యలో మరో విషయంలోనూ ఘర్షణ జరుగుతోంది. అది.. సింథటిక్ డ్రగ్స్ - అంటే రసాయన మాదకద్రవ్యాల - అక్రమ వ్యాపారం.

ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిచేసే మత్తుపదార్థాలు - అమెరికా పౌరులు మత్తు కోసం తీసుకుంటున్న శక్తివంతమైన నొప్పినివారిణిలు - చైనాలో తయారు చేసి, అక్కడి నుంచి కూడా విక్రయిస్తున్నారని అమెరికా విశ్వసిస్తోంది.

అలాంటి వాటిలో ముఖ్యమైనది ఫెంటానిల్. ఇది సాధారణ నొప్పినివారిణి మార్ఫీన్ కన్నా 50 నుంచి 100 రెట్లు శక్తి వంతమైనది. క్యాన్సర్ వంటి చికిత్సల వల్ల కలిగే తీవ్రమైన నొప్పులకు ఈ ఫెంటానిల్‌ను వినియోగించవచ్చునని అమెరికాలో మాత్రమే ఆమోదించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ డ్రగ్ విషయంలో చైనాను బహిరంగంగా నిందించారు.

Image copyright Twitter

ఈ విషయంలో సమస్య ఉందన్న వాదనను చైనా నిరాకరించకుండానే.. అక్రమ ఫెంటానిల్ అత్యధికంగా చైనా నుంచే వస్తోందన్న ఆరోపణను తిప్పికొట్టింది.

ఈ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలూ లేవని.. అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు ‘అనంగీకారమైనవి.. బాధ్యతారాహిత్యమైనవి’ అని చైనా నేషనల్ నార్కొటిక్స్ కంట్రోల్ కమిషన్‌ సీనియర్ అధికారి యు హైబిన్ పేర్కొన్నారు.

అమెరికాలో మాదకద్రవ్యాలకు పెరుగుతున్న డిమాండ్ అసలు సమస్య అని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అమెరికా తన నిఘా సామాచారాన్ని మరింత ఎక్కువగా చైనాతో పంచుకోవాలని సూచించారు.

అయితే.. ఈ రసాయనాల్లో చాలా వరకూ చైనాలోనే ఉత్పత్తవుతున్నాయన్న విషయంలో అనుమానమేమీ లేదు. కానీ.. ఖచ్చితంగా ఎంత మొత్తంలో తయారవుతున్నాయన్నది చెప్పటం అసాధ్యం.

ఈ విషయంలో ఎన్ని మాటలు చెప్పినా.. ఈ సమస్యను పరిష్కరించటానికి చైనా కొన్ని చర్యలు చేపడుతోంది.

Image copyright Getty Images

ప్రమాదకర రసాయనాలు

ఈ రసాయన డ్రగ్స్‌ను తయారు చేయటం చాలా చౌక. వీటిని ఇంటర్నెట్‌లో విక్రయిస్తూ పోస్ట్ ద్వారా సరఫరా చేస్తున్నారు.

అవి తమ గమ్యం చేరిన తర్వాత.. వీటిని చాలా తక్కువ మోతాదుల్లో ఇతర మాదక ద్రవ్యాలతో.. ప్రత్యేకించి హెరాయిన్‌తో కలుపుకోవచ్చు. తద్వారా వాటి సామర్థ్యం పెరుగుతుంది.

‘‘ఫెంటానిల్.. ప్రాణాంతకమైనది. చాలా తక్కువ మోతాదుల్లో తీసుకున్నా ప్రమాదమే. ఈ డ్రగ్‌ను 0.25 మిల్లీ గ్రాముల అతి తక్కువ మోతాదులో నోటి ద్వారా తీసుకున్నా ప్రాణాలకు ముప్పు ఉంటుంది’’ అని స్పష్టం చేస్తోంది అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (డీఈఏ).

ఈ డ్రగ్ విషయంలో చట్టపరమైన నియంత్రణలను అధిగమించటం కోసం.. దీని రసాయన నిర్మాణాన్ని చాలా సులభంగా మార్చేసి అదే తరహా పదార్థాలను - ఫెంటానిల్ అనలోగస్ అంటారు - తయారుచేసుకోవచ్చు.

‘‘రసాయన నిర్మాణాల్లో చిన్న మార్పుల ద్వారా కొత్త మిశ్రమాలను తయారు చేయగల అవకాశాలు.. ఈ మత్తుపదార్థంపై అంతర్జాతీయ నియంత్రణకు సవాళ్లుగా మారుతున్నాయి’’ అని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆఫీస్ ఫర్ డ్రగ్స్ అండ్ క్రైమ్ పేర్కొంది.

అమెరికాలో మాత్రమే కాదు...

ఈ మత్తుపదార్థం దుర్వినియోగం మీద అమెరికా సంస్థల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో ఇప్పుడు ఫెంటానిల్ సంబంధిత ఉత్పత్తులన్నిటినీ అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ జాబితాలో చేర్చాయి.

ఈ పరిస్థితి అమెరికా ఎదుర్కొన్న ‘‘అత్యంత తీవ్రమైన డ్రగ్ సంక్షోభం’’గా ఉందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కిర్‌స్టెన్ మాడిసన్ కాంగ్రెస్ ఎదుట అభివర్ణించారు.

అమెరికాలో 2017లో మోతాదుకు మించి మందులు వాడటం (డ్రగ్ ఓవర్‌డోస్) వల్ల 72,000 మరణాలు సంభవించగా.. అందులో 40 శాతం పైగా ఫెంటానిల్ వంటి రసాయన మత్తుపదార్థాల వల్లే సంభవించాయని ఆమె చెప్పారు.

కెనడాలో సైతం.. 2017లో మత్తుమందులతో సంబంధమున్న మరణాల్లో 72 శాతం మరణాలకు ఫెంటానిల్ లేదా దానికి సంబంధించిన మత్తుపదార్థాలే కారణమని గణాంకాలు చెప్తున్నాయి. 2016 లో 55 శాతంగా ఉన్న ఈ మరణాలు ఇప్పుడు ఇంకా భారీగా పెరిగాయి.

యూరప్‌లో సైతం రసాయన మత్తుపదార్థాల వినియోగం శరవేగంగా పెరిగిందని యూరప్ ఔషధ నియంత్రణ సంస్థ ఈఎంసీడీడీఏ ఒక నివేదికలో చెప్తోంది. యూరోపియన్ యూనియన్‌తో పాటు.. టర్కీ, నార్వేలు కూడా ఈ సంస్థ పరిధిలో ఉన్నాయి.

Image copyright Getty Images

చైనా లింక్...

ఫెంటానిల్.. ఆ తరహా మత్తుపదార్థాలు ప్రధానంగా చైనా నుంచే వస్తున్నాయని అమెరికా విస్పష్టంగా చెప్తోంది.

2017 అక్టోబర్‌లో ఇద్దరు చైనా వ్యక్తులు ఫెంటానిల్ తదితర మత్తుపదార్థాలను భారీ మొత్తంలో పంపిణీ చేయటానికి కుట్ర పన్నారంటూ అమెరికా అధికారులు మొట్టమొదటిసారిగా దోషులుగా ప్రకటించారు.

అమెరికా పోస్టల్ వ్యవస్థలపై నిఘా సమాచారం, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అందిన సమాచారం, సైబర్ అడుగుజాడలపై పరిశీలనల ద్వారా.. ఈ మత్తుపదార్థాల్లో గణనీయమైన వాటా చైనా నుంచి వస్తున్నట్లు తెలుస్తోందని అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికార ప్రతినిధి కాథరీన్ ఫాఫ్ బీబీసీకి చెప్పారు.

‘‘యూరప్‌లోకి వస్తున్న ఫెంటానిల్ దిగుమతులు చైనాలో ఉన్న కంపెనీల నుంచి వస్తున్నట్లు కనిపిస్తోంది’’ అని యూరోపియన్ డ్రగ్ నియంత్రణ సంస్థ నివేదిక చెప్తోంది. అయితే.. యూరప్‌లోని లాబొరేటరీల్లో కూడా వీటిని అక్రమంగా ఉత్పత్తి చేస్తున్న ఉదంతాలు ఉన్నాయని కూడా పేర్కొంది.

అధిక శాతం ఫెంటానిల్ చైనాలో ఉత్పత్తి అవుతోందన్న విషయాన్ని చైనా అధికారిక సంస్థలు అంగీకరించకపోయినప్పటికీ.. అవి కొన్ని చర్యలు చేపట్టాయి.

రసాయన మత్తుపదార్థాల తయారీకి ఉపయోగించగల 150కి పైగా రసాయనాలపై చైనా ఇప్పుడు ఆంక్షలు విధించిందని యూఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ విభాగంలో రసాయన డ్రగ్స్ నిపుణుడు మార్టిన్ రైుతుల్బర్ చెప్పారు.

అయితే.. ఈ విషయంలో కేవలం చైనాను తప్పుపట్టానికి బదులుగా.. ఇటువంటి మత్తుపదార్థాలకు పెరుగుతున్న డిమాండ్‌ను అమెరికా పరిష్కరించాల్సిన అవసరముందని చైనా వాదిస్తోంది.


(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)