చరిత్రలో అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణం చవిచూసిన 5 దేశాలు

  • 26 సెప్టెంబర్ 2018
బొలివర్లు Image copyright Reuters

వెనెజ్వేలా ప్రజలు ప్రస్తుతం అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణాన్ని అనుభవిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత నమోదైన అత్యధిక ద్రవ్యోల్బణాల్లో ఇదీ ఒకటి.

ప్రతి నెలా సగటున 150 శాతం మేర ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం 50 శాతం కంటే ఎక్కువగా ఉండి, 30 రోజుల పాటు అది కొనసాగితే దాన్ని అత్యధిక ద్రవ్యోల్బణం (హైపర్ ఇన్‌ఫ్లేషన్) అంటారు. వెనెజ్వేలాలో ప్రస్తుతం అదే పరిస్థితి.

అక్కడ ఆహారం, ఔషదాలు, ఇతర వస్తువులకు తీవ్ర కొరత నెలకొంది. ప్రస్తుతం ప్రపంచంలో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోన్న దేశం వెనెజ్వేలా ఒక్కటే. కానీ చరిత్రలో ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి.

అందులో అత్యంత దుర్భర పరిస్థితులను అనుభవించిన ఐదు దేశాలు ఇవే.

1. హంగేరీ 1946

దినసరి ద్రవ్యోల్బణ రేటు: 207%

ప్రతి 15గంటలకు ఒకసారి ధరలు రెట్టింపయ్యేవి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 100 మిలియన్ హంగేరియన్ పెంగోస్ నోట్లు... 1946లో వీటికి దాదాపు విలువ లేకుండా పోయింది.

1946 జూలైలో హంగేరిలో ద్రవ్యోల్బణం అత్యధికంగా 419,00,000,00,00,00,000% కి చేరింది. చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యధిక ద్రవ్యోల్బణం ఇదే.

ప్రతి 15 గంటలకు ఒకసారి ధరలు పెరిగేవి. అంటే... ఉదయం ప్రజల జేబుల్లో ఉండే వస్తువుల విలువ సాయంత్రానికి సగానికి పడిపోయేది. దాంతో అత్యంత ఎక్కువ విలువగల కరెన్సీని ముద్రించాల్సి వచ్చేది.

రెండో ప్రపంచ యుద్ధం కారణంగా హంగేరీలో 40శాతం సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఆ దేశ రాజధాని బుడాపెస్ట్ 80 శాతం నాశనమైంది. యుద్ధం ముగిశాక కోట్లాది రూపాయలను ప్రభుత్వం నష్టపరిహారంగా చెల్లించాల్సి వచ్చింది.

కరెన్సీ విలువ బాగా పడిపోవడంతో, నోట్లను వాటి విలువను బట్టి కాకుండా రంగు ఆధారంగా పిలిచేవారు.

1946 ఆగస్టులో ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విదేశాలకు తరలిపోయిన బంగారాన్ని రికవరీ చేసింది. కొత్త కరెన్సీని తీసుకొచ్చింది. దాంతో క్రమంగా పరిస్థితి సద్దుమణిగింది.

2. జింబాబ్వే 2008

దినసరి ద్రవ్యోల్బణ రేటు: 98%

ధరలు ప్రతి 25గంటలకు ఒకసారి రెట్టింపయ్యేవి.

1990ల్లో చేసిన వివాదాస్పద భూ సంస్కరణల కారణంగా జింబాబ్వేలో వ్యవసాయ సంక్షోభం తలెత్తింది. 1998 కాంగో యుద్ధంలో భాగంగా భారీగా నిధులు ఖర్చుచేయడంతో పాటు 2002లో రాబర్ట్ ముగాబే ప్రభుత్వంపై అమెరికా, యూరోపియన్ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా జింబాబ్వే ఆర్థికస్థితి మరింత క్షీణించింది.

దాంతో క్రమంగా ధరలు ఆకాశానికి దూసుకెళ్లాయి. 2008 నవంబర్ నాటికి నెలవారీ ద్రవ్యోల్బణం 7,900,00,00,000% కి చేరింది. రోజులో చాలాసార్లు ధరలు పెరిగేవి.

విద్యుత్ కోతలు, బ్యాంకుల దగ్గర భారీ లైన్లు, ఆహార కొరత సర్వ సాధారణమైంది. నిత్యావసరాలు కొనడానికి చాలామంది సరిహద్దు దాటి దక్షిణాఫ్రికా, బోత్స్వానా దేశాలకు వెళ్లేవారు.

2009లో జింబాబ్వే రిజర్వ్ బ్యాంకు తమ కరెన్సీని రద్దుచేసి, అమెరికా డాలర్, దక్షిణాఫ్రికా ర్యాండ్‌లను ప్రధాన మారకంగా చేసింది.

3. యుగోస్లేవియా 1994

దినసరి ద్రవ్యోల్బణ రేటు: 65%

ధరలు ప్రతి 34 గంటలకు ఒకసారి రెట్టింపయ్యేవి.

Image copyright Getty Images

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బోస్నియా, హెర్జెగోవినా, క్రొయేషియా, మాసెడొనియా, మాంటెనెగ్రో, సెర్బియా, స్లొవేనియాల కలయికతో యుగోస్లేవియా ఏర్పడింది.

కానీ, 1980ల్లో తలెత్తిన ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు అంతర్గత యుద్ధానికి దారితీశాయి. ఫలితంగా సెర్బియా, మాంటెనెగ్రో మినహా మిగతా దేశాలు గణతంత్ర రాజ్యాలుగా విడిపోయాయి.

ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి యుగోస్లేవియా భారీగా కరెన్సీని ముద్రించడం ప్రారంభించింది. ఐరాస ఆంక్షలు, పాలనా లోపం లాంటి కారణాల వల్ల 1992-1993 నాటికి సమస్య తీవ్రమైంది.

1994 నాటికి ధరలు నెలకు 31,30,00,000% మేర పెరగసాగాయి. ఆ పరిస్థితికి భయపడి జీతాలు వచ్చిన వెంటనే ప్రజలు డబ్బును ఖర్చు చేయడం మొదలుపెట్టారు. ధరల నియంత్రణ కారణంగా రైతులు ఉత్పత్తిని తగ్గించేశారు.

ఈ పరిస్థితిని అధిగమించేందుకు సెర్బియా నాయకుడు స్లొబొడన్ మిలొసెవిక్ పాత కరెన్సీని రద్దు చేసి కొత్త కరెన్సీ ప్రవేశపెట్టడంతో పాటు బంగారు నిల్వలను అభివృద్ధి చేశారు.

4. జర్మనీ 1923

దినసరి ద్రవ్యోల్బణ రేటు: 21%

ధరలు ప్రతి 3 రోజుల 17 గంటలకు ఒకసారి రెట్టింపయ్యేవి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1923లో జర్మనీలో కరెన్సీ నోట్లతో ఆడుకుంటున్న పిల్లలు

1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక జర్మనీ అప్పుల్లో కూరుకుపోయింది. దానికితోడు దేశ పునర్నిర్మాణానికి చాలా ఖర్చయింది. అప్పుల్ని చెల్లించడానికి ప్రభుత్వం నాటి కరెన్సీ ‘మార్క్’ను ఎక్కువగా ముద్రించడం ప్రారంభించింది.

దాంతో కరెన్సీ విలువ పడిపోతూ వచ్చింది. 1923లో పరిస్థితి మరింత దిగజారింది. అప్పుల్ని చెల్లించడంలో విఫలమవడంతో జర్మనీ పారిశ్రామిక రంగానికి గుండె లాంటి రూర్ వ్యాలీని ఫ్రెంచ్, బెల్జియం బలగాలు ఆక్రమించాయి. దాంతో సమ్మెలు జరిగి, ఉత్పత్తి ఆగిపోయింది.

1923 అక్టోబర్ నాటికి ద్రవ్యోల్బణం నెలకు 29,500% కి చేరింది. ప్రతి 3-4రోజులకు ధరలకు పెరిగాయి. ఆ ఏడాది జనవరిలో 250మార్క్‌లు ఉన్న బ్రెడ్ ప్యాకెట్ ధర అదే ఏడాది నవంబర్ నాటికి 200,00,00,00,000 మార్క్‌లకు చేరింది. ప్రజలు సూట్ కేసుల్లో జీతాలను ఇంటికి తీసుకెళ్లేవారు.

కరెన్సీ విలువ ఎంతగా పడిపోయిందంటే... ‘ఓ వ్యక్తి డబ్బుతో నిండిన తన సూట్‌కేసును రోడ్డు మీద మరచిపోయాడు. మరుసటి రోజు వచ్చి చూస్తే డబ్బు మొత్తం అక్కడే ఉంది కానీ, సూట్‌కేసు మాయమైంది’ అని అప్పట్లో చెప్పుకునేవారు.

అలాగే... ‘ఓ వ్యక్తి జత బూట్లు కొనడానికి సంచి నిండా డబ్బుతో బస్సెక్కి బెర్లిన్ వెళ్లి, అక్కడ ఓ కప్పు కాఫీ తాగి తిరిగి ఇంటికొచ్చేశాడు’ అంటూ కరెన్సీ విలువ ఎంతగా క్షీణించిందో వివరించేవారు.

మరుసటి ఏడాది ప్రభుత్వం కొత్త కరెన్సీని ప్రవేశపెట్టడంతో పాటు జర్మనీకి అప్పిచ్చిన దేశాలు రుణాలను రీషెడ్యూల్ చేయడంతో పరిస్థితి కుదుటపడింది.

5. గ్రీస్ 1944

దినసరి ద్రవ్యోల్బణ రేటు: 18%

ధరలు ప్రతి 4 రోజుల 6 గంటలకు ఒకసారి రెట్టింపయ్యేవి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రెండో ప్రపంచ యుద్ధం తరువాత కోలుకోవడానికి గ్రీస్‌కు చాలా కాలం పట్టింది

రెండో ప్రపంచ యుద్ధం కారణంగా గ్రీసు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. గ్రీస్‌ను ఆక్రమించిన ఇతర దేశాల బలగాలు అక్కడి నుంచి ముడి సరకులు, పశువులు, ఆహార ఉత్పత్తులను దోచుకెళ్లాయి. ప్రభుత్వం కేవలం కీలుబొమ్మలా మిగిలిపోయింది.

వ్యవసాయ రంగం కుదేలవడంతో అత్యంత తీవ్రమైన కరవు నెలకొంది. పన్నుల సేకరణ క్షీణించడంతో 1944 నవంబర్ నాటికి ద్రవ్యోల్బణం నెలకు 13,800 శాతానికి చేరింది.

అత్యంత సుదీర్ఘంగా 18 నెలల పాటు సాగిన వివిధ సంస్కరణల ఫలితంగా 1945 చివర్లో గ్రీస్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడటం మొదలైంది.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)