బీబీసీ పరిశోధన: కామెరూన్‌లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...

  • 26 సెప్టెంబర్ 2018
బీబీసీ కామెరూన్ పరిశోధన

ఉత్తర కామెరూన్‌లో కొంతమంది మహిళలనూ, పిల్లలనూ అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించిన వివరాలు బీబీసీ చేసిన పరిశోధనలో బయట పడ్డాయి. ఆ ఘటన ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఎవరు దీనికి పాల్పడ్డారు? అన్న వివరాలు తెలిశాయి. మొదట్లో ఈ వీడియోను "ఫేక్ న్యూస్" అంటూ ఖండించిన కెమరూన్ ప్రభుత్వం.. ఆ తరువాత ఈ హత్యాకాండకు బాధ్యులైన ఏడుగురు సైనికులను అరెస్ట్ చేసింది.

ఈ మహిళలను, పిల్లలను చంపెయ్యడానికి తీసుకెళ్తున్నారు. వీళ్ళు బోకోహరాం అనే జిహాది గ్రూపులకు చెందిన వారని సైనికులు ఆరోపిస్తున్నారు.

ఈ వీడియో చివర్లో వారి కళ్ళకి గంతలు కట్టేసి, వారిని కిందకు తోసేసి, వారిపై 22 రౌండ్లు కాల్చారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: బీబీసీ కామెరూన్‌ పరిశోధన

ఈ దారుణం మాలిలో జరిగిందని కొంతమంది అన్నారు. మరి కొంతమంది, ఉత్తర కామెరూన్ లో జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో 2014 నుంచి బోకో హరామ్‌తో ప్రభుత్వ సైనికులు పోరాడుతున్నారు.

బీబీసీ పరిశోధనలో ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? ఎప్పుడు జరిగింది? ఈ దారుణానికి పాల్పడిందెవరు? అన్న విషయాలు మొదటిసారి వెల్లడయ్యాయి.

జులైలో, కెమరూన్ లోని ఒక వ్యక్తి మాకు ఒక రిడ్జ్ లైన్ వీడియోకు సంబంధించిన సమాచారం అందించాడు. జెలెవెట్ పట్టణానికి దగ్గర్లో సరిగ్గా ఆ రిడ్జ్ లైన్‌తో పోలి ఉన్న ప్రదేశం మాకు కనిపించింది.

క్రావా మాఫా అనే గ్రామానికి దగ్గరలోని ఒక మట్టి రోడ్డుకు చెందిన దృశ్యాలు కూడా ఉన్నాయి. మాకు అందిన వీడియోలో ఈ దారి, ఈ ఇళ్లు, చెట్లు కూడా కనిపించాయి.

ఈ ఆధారాలన్నీ కలిపి క్షుణ్ణంగా పరిశీలించాక ఆ మహిళలను, పిల్లలను ఇక్కడే చంపేశారని చెప్పొచ్చు.

ఇకపోతే, ఈ దారుణం ఎప్పుడు జరిగిందన్న ప్రశ్నకు సమాధానం చూద్దాం: ఇక్కడ కనిపిస్తున్న ఈ భవనం ఉపగ్రహ చిత్రాలలో 2016 ఫిబ్రవరి వరకు మాత్రమే కనిపించింది.

అలాగే ఈ కట్టడం మార్చ్ 2015 వరకు మాత్రమే శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. ఈ ఫుట్ పాత్ కూడా జనవరి-ఏప్రిల్ మధ్య వేసవి కాలంలోనిది.

ఒక చిన్న గణితశాస్త్ర సూత్రాన్ని ఉపయోగించి ఈ సైనికుల నీడలు గమనిస్తే సూర్యుడి కిరణాలు ఏ కోణంలో భూమి మీద పడుతున్నాయో చెప్పొచ్చు.

ఇవన్నీ లెక్కిస్తే.. ఈ ఘటన 2015 మార్చ్ 20 నుంచి ఏప్రిల్ 5 మధ్యన జరిగి ఉండవచ్చు.

జూలైలో కెమరూన్ సమాచార మంత్రి, ఇస్సా చిరోమా బకారీ మాట్లాడుతూ ఈ చిత్రాల్లో కనిపిస్తున్న సైనికులు కెమరూన్‌కు చెందిన వారు కారని అన్నారు. అంతే కాదు, ఈ ప్రాంతంలో కామెరూన్ ప్రభుత్వ సైనికులు ఈ వీడియోలో కనిపిస్తున్న ఆయుధాలు ఉపయోగించరని కూడా ఆయన చెప్పారు.

కానీ మా విశ్లేషణ ప్రకారం, ఈ సైనికుల చేతుల్లో ఉన్న ఆయుధాలలో ఒకటి సెర్బియాలో తయారు చేసిన జాస్తావ ఎం21 అని తెలుస్తోంది. ఈ ఆయుధాన్ని కెమరూన్‌ సైన్యంలోని కొన్ని విభాగాలు ఉపయోగిస్తాయి.

అయితే కెమరూన్ సైనికులు దేశంలోని ఉత్తర భాగంలో ఇటువంటి ఆకుల డిజైన్ లో ఉన్న యూనిఫామ్ ధరించరని మంత్రి చిరోమా అన్నారు. అయితే 2015లో, ప్రముఖ టీవీ ఛానల్ "ఛానల్ 4 " ప్రసారం చేసిన ఒక కథనంలో జెలెవెట్ పట్టణంలోని సైనికులు ఇదే యూనిఫామ్ ధరించారు.

మేం ఈ ఆధారాలన్నింటినీ కామెరూన్ ప్రభుత్వానికి సమర్పించాం.

దీనిపై కామెరూన్ సమాచార మంత్రి ఇస్సా చిరోమా బకారీ స్పందిస్తూ.. ‘‘ఏడుగురు సైనికులను నిరాయుధులను చేసి, అరెస్ట్ చేశాం. వారందరూ ప్రస్తుతం విచారణ ఎదుర్కుంటున్నారు. ఏడుగురు సైనికులు కూడా జైలులో ఉన్నారని నేను కచ్చితంగా చెప్పగలను" అన్నారు.

అయితే నేరం రుజువయ్యేంత వరకూ ఈ సైనికులందరూ నిర్దోషులేనని ప్రభుత్వం అంటోంది. ఈ సైనికులంతా న్యాయ విచారణను ఎదుర్కోనున్నారు....అయితే ఈ అమాయక మహిళలకు, పిల్లలకు మాత్రం ఇటువంటి న్యాయ విచారణ ఎదుర్కొనే అవకాశమే దక్కలేదు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)