ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు

  • 27 సెప్టెంబర్ 2018
మాతా హరి Image copyright BIBLIOTHÈQUE NATIONALE DE FRANCE

గూఢచారి డ్రామా అంటే చూసేకొద్దీ లోలోపలే గుండెను పిండేసినట్టు ఉంటుంది. ఆ కథల్లో ఒక మహిళా హంతకురాలి పాత్ర ఎప్పుడూ ఆసక్తికరంగా, ఆకర్షించేలా ఉంటుంది. దానికి ముఖ్యమైన కారణం మహిళలు అలాంటి పాత్రలు పోషించడం చాలా అరుదు. కానీ రొటీన్‌కు భిన్నంగా ఉన్నవి ఎప్పుడూ అందరికీ నచ్చుతాయి. కానీ అవన్నీ ఎక్కువగా కల్పిత కథలే అయ్యుంటాయి.

నిజంగా అలాంటి మహిళలు ఉంటే, గూఢచారులుగా పనిచేసిన కొందరు మహిళలు ఎంతకైనా తెగించారనే విషయం మనకు తెలిస్తే, వారి జీవితంలో ప్రతి క్షణం ఒక ఉత్కంఠభరితమైన కథలా అనిపిస్తే.. మన శరీరంపై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.

చరిత్రలో అలాంటి ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు ఉన్నారు.

1.డబుల్ ఏజెంట్ మాతా హారీ

అసలు పేరు మార్గ్‌రెటా గీర్‌ట్రూయిడా . కానీ 'మాతా హారీ' పేరుతో ఫేమస్ అయ్యారు. మాతా హారీ ఒక శృంగార నర్తకి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ఆమెను కాల్చి చంపేశారు. మాతా హారీ జీవితంపై 1931లో ఒక హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. అందులో 'గ్రెటా గార్బో' లీడ్ రోల్ చేశారు.

మార్గ్‌రెటా హాలెండ్‌లో జన్మించారు. ఒక ఆర్మీ కెప్టెన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఒక అక్రమ సంబంధంలో చిక్కుకున్న మార్గ్‌రెటా తన బిడ్డను కూడా కోల్పోయారు.

1905లో మార్గ్‌రెటా స్వయంగా తనకు తానుగా 'మాతా హారీ' అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటలీలోని మిలాన్‌లో స్కాలా, పారిస్ ఒపేరాల్లో ఒక శృంగార నర్తకిగా ఆవిర్భవించారు.

Image copyright LAURÈNE BOGLIO

తర్వాత మార్గ్‌రెటా మాయమైపోయారు. అప్పుడు ప్రపంచంలో అందరూ ఆమెను మాతా హారీ పేరుతో గుర్తు పడుతున్నారు. నర్తకిగా మారిన ఆమెకు ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించడం సులభంగా మారింది.

ఆ కారణంతోనే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ మాతా హారీకి డబ్బు ఎరవేసింది. దానికి బదులు కీలకమైన సమాచారం అందించాలని ఆమెతో ఒప్పందం చేసుకుంది. అలా మెల్లమెల్లగా ఆమె జర్మనీ గూఢచారిగా మారిపోయారు.

మాతా హారీ ఎవరినీ చంపలేదు. కానీ ఆమె గూఢచర్యం వల్ల సుమారు 50 వేల మంది ఫ్రాన్స్ సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఆ తర్వాత ఫ్రాన్స్‌కు ఆమెపై సందేహం వచ్చింది. 1917 ఫిబ్రవరిలో ఆమెను పారిస్‌లో అరెస్టు చేశారు. అక్టోబర్‌లో ఆమెను తుపాకీతో కాల్చి చంపారు.

ఆమె చనిపోయిన వందేళ్ల తర్వాత ఆమె నేరాలపై మళ్లీ చర్చ మొదలైంది. మాతా హారీని ఇప్పటికీ, 'ఫెమినైన్ సెడక్షన్' ఐకాన్‌గా, 'దేశద్రోహి'గా భావిస్తారు.

Image copyright HULTON ARCHIVE

2.చార్లెట్ కార్డో

చార్లెట్ పూర్తి పేరు మేరీ ఎన్ చార్లెట్ డీ కార్డో. ఆమె ఫ్రెంచ్ విప్లవంలో భాగంగా పనిచేశారు. చార్లెట్ ఒక గిరోండీ వాసి.

ఫ్రాన్స్ విప్లవంలో గిరోడిన్ సమాజం, రాచరికాన్ని అంతం చేయాలనుకుంది. కానీ వారు హింసకు వ్యతిరేకంగా ఉండేవారు. కానీ విప్లవం కోసం జరిగే హింసలో ఎక్కువ మంది మరణించడం ఇష్టం లేని చార్లెట్ స్వయంగా తన ప్రత్యర్థి, జాకోబిన్ సమాజానికి చెందిన నేత జీన్ పాల్ మారట్‌ను హత్య చేశారు.

1793 జులైలో మారట్ బాత్‌ టబ్‌లో స్నానం చేస్తున్నప్పుడు చార్లెట్ అతడిపై కత్తి విసిరారు. ఈ హత్యా నేరానికి అరెస్టు చేసినప్పుడు చార్లెట్ దానిని దేశ ప్రయోజనం కోసమే చేశానని చెప్పారు. ఈ ఒక్క హత్యతో కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడానని చెప్పారు. కానీ ఆ తర్వాత నాలుగు రోజులకే చార్లెట్‌కు శిక్ష విధించారు.

Image copyright LAURENE BOGLIO

3.షీ జియాన్‌కియావో

గూఢచారులకు కోడ్ నేమ్స్ పెట్టుకోవడం ఇష్టం అని చెబుతారు. దాన్ని నిజం చేస్తూ షీ గులాన్ అనే గూఢచారి తన పేరును షీ జియాన్‌కియావోగా మార్చుకున్నారు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె గూఢచారిగా మారారు. చైనా నేత సున్ చువాంగ్‌ఫాంగ్ 1925లో ఆమె తండ్రిని హత్య చేశాడు.

జియాన్‌కియావో పదేళ్ల తర్వాత ఒక బౌద్ధ ఆలయంలో పూజ చేస్తున్న చువాంగ్‌ఫాంగ్‌ తలలో గురిచూసి కాల్చి తన పగ తీర్చుకున్నారు. హత్య చేసిన తర్వాత ఘటనాస్థలం నుంచి పారిపోకుండా అక్కడే ఉండిపోయి నేరం అంగీకరించారు.

ఈ హై ప్రొఫైల్ కేసులో 1936లో తీర్పు వచ్చింది. జియాన్‌కియావోను నిర్దోషిగా విడుదల చేశారు. తండ్రి మరణంతో ఆవేశానికి గురై ఆమె ఆ హత్య చేశారని కోర్టు చెప్పింది. తర్వాత 1979లో జియాన్‌కియావో మరణించారు.

Image copyright LAURÈNE BOGLIO

4.బ్రిగిత్ మోన్‌హాప్ట్

ఒక సమయంలో జర్మనీలోనే అత్యంత క్రూరమైన మహిళగా చెప్పుకున్న బ్రిగిత్ మోన్‌హాప్ట్ రెడ్ ఆర్మీ ఫ్యాక్షన్ సభ్యురాలుగా పనిచేశారు. 1977లో జర్మనీలోని ఒక అతివాద కార్యకలాపాలలో కూడా బ్రిగిత్ పాల్గొన్నారు.

70వ దశకంలో పశ్చిమ జర్మనీలోని లెఫ్ట్ అతివాద గ్రూప్ ఒకటి తర్వాత ఒకటిగా ఎన్నో హైజాక్‌లు, హత్యలు, బాంబు పేలుళ్లకు పాల్పడింది. విమానం హైజాక్‌తోపాటూ సుమారు 30 మందిని హత్య చేసింది. పశ్చిమ జర్మనీలో పెట్టుబడిదారీ వ్యవస్థను అంతం చేయాలనే లక్ష్యంతో వారు ఈ నేరాలన్నీ చేశారు.

1982లో ఈ నేరాల్లో పాల్గొన్నందుకు మోన్‌హాప్ట్‌ను అరెస్ట్ చేశారు. ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. దానితోపాటు మరో 9 హత్య కేసుల్లో 15 ఏళ్ల శిక్ష కూడా వేశారు.

కానీ మోన్‌హాప్ట్ ఎప్పుడూ తన నేరాన్ని అంగీకరించలేదు. చివరికి 2007లో ఆమెకు పెరోల్‌పై జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లభించింది. ఆమె ఇప్పటికీ జీవించి ఉన్నారు.

Image copyright LAURENE BOGLIO

5.ఏజెంట్ పెనెలోప్

ఏజెంట్ పెనెలోప్ ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మోసాద్ కోసం పనిచేశారు. పాలస్తీనా గ్రూప్ 'బ్లాక్ సెప్టెంబర్' నేత అలీ హుస్సేన్ సలామే హత్యలో పాల్గొన్నారు.

1972లో మ్యూనిచ్ ఒలింపిక్స్ సమయంలో అలీ హుస్సేన్ 11 మంది ఇజ్రాయెల్ ఆటగాళ్లను కిడ్నాప్ చేశాక, వారిని చంపేశాడు.

ఈ హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి గోల్డా మెయిర్ ఆదేశాలతో 'ఆపరేషన్ బ్రెత్ ఆఫ్ గాడ్' ప్రారంభమైంది. ఈ ఆపరేషన్‌కు ముగించేందుకు అలీ హుస్సేన్ సలామేను హత్య చేశారు.

అలీ హుస్సేన్‌ను చంపడానికి పెనెలోప్‌ సుమారు ఆరు వారాలు అతడు ఉంటున్న అపార్ట్‌మెంట్ దగ్గరే గడిపారు.

అలీ హుస్సేన్ సలామేను చంపడానికి బాంబును పేల్చినపుడు, ఆ పేలుడులో పెనెలోప్ కూడా మరణించారు. మరణం తర్వాత ఆమె వస్తువులను స్వాధీనం చేసుకున్నప్పుడు, వాటిలో ఒక బ్రిటన్ పాస్‌పోర్ట్ కూడా దొరికింది. అందులో ఆమె ఎరికా చాంబర్స్ అనే పేరు పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు