వెనెజ్వెలా వలసలు: బతుకుతెరువు కోసం కాలినడకన దేశాలు దాటుతున్నారు

  • 27 సెప్టెంబర్ 2018
వెనెజ్వెలా శరణార్థులు

ఆకలితో అలమటిస్తున్న వెనెజ్వెలా దేశ ప్రజలు కాలినడకన దేశాలు దాటి వలస వెళ్లడం సర్వ సాధారణమైపోయింది. గడ్డకట్టించే చలిలో పర్వత ప్రాంతాలను దాటుకుంటూ తన ఇద్దరు బిడ్డలతో కాలినడకన వెళ్తున్న ఓ తల్లిని మేం కలిశాం. రేపు ఏం జరుగుతుందో తెలియని ఈ సామాన్యులు బతుకును నిలబెట్టుకోవడం కోసం పడుతున్న పాట్లు చూస్తే ఎవరికైనా అయ్యో అనిపించక మానదు.

"మేం మూడు రోజులుగా నడుస్తూనే ఉన్నాం. ఎన్నో కొండలు కోనలు దాటుకుంటూ బతుకుదెరువు కోసం వెళ్తున్నాం" అని మారిబెల్ అనే మహిళ చెప్పారు.

వెనెజ్వెలాలోని దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా రోజూ వేలాది మంది ప్రజలు అక్కడ నుంచి పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారు. లాటిన్ అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన సంక్షోభం.

అనేక మంది కాలినడకనే కొలంబియా దేశానికి వెళ్లిపోతున్నారు. అక్కడైనా కాస్త పని దొరుకుతుందేమోనన్నదే వారి ఆశ.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: వీళ్ల కష్టాలు చూస్తే అయ్యో అనకుండా ఉండలేరు

"స్వెటర్, బూట్లు, ఓ జత ప్యాంట్లు, జాగింగ్ ప్యాంట్లు మాత్రమే నాకు మిగిలాయి. బతకాలంటే ఇలా వెళ్లాల్సిందే. నడవలేను అనుకుంటే తిండిలేక అక్కడే చనిపోవాల్సిందే" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మారిబెల్.

"పర్వతాలపై ఉండే చలికి ప్రాణాలు కోల్పోవడమో లేదా హైపోథెర్మియా బారిన పడటమో జరుగుతుందని అక్కడి వారు చెప్పడంతో నాకు చాలా భయమేసింది. ఎక్కడికైనా వెళ్తే మా బతుకులు మారుతాయన్నది మా ఆశ. నా కుటుంబం కోసం ఏ మాత్రమైనా సంపాదించగలనో లేదో చూడాలి. ఒకవేళ అక్కడ పరిస్థితి బాగాలేకపోతే మళ్లీ ఇదే దారిన నడుచుకుంటూ నా ఇంటికి తిరిగి పోవాలి" అంటున్నారు ఆమె.

వెనెజ్వెలా సరిహద్దుకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో కొలంబియాలో బుకారమంగ నగరం ఉంది. పర్వతాలను దాటుకొని వెళ్లిన తర్వాత కనిపించే మొదటి కొలంబియా నగరం అది.

"మేం వెనెజ్వెలా నుంచి వచ్చాం. మేం ఏదో ఒక పని వెతుక్కోవాలంటే మీ సాయం మాకు కావాలి. బట్టలు, ఆహారం, బూట్లు... దేవుడు మిమ్మల్ని దీవించుగాక" అంటూ ఆర్థిస్తున్నారు ఈ శరణార్థులు.

మరోవైపు, వేల సంఖ్యలో వెనెజ్వెలా ప్రజలు దక్షిణ అమెరికా అంతటికీ వెళ్తుండటంతో ఆయా దేశాల్లో ఒక్కసారిగా వలసవాదుల పట్ల వ్యతిరేకత పెరిగిపోతోంది.

తమ దేశంలోనే ఉపాధి అవకాశాలు లేక చాలామంది ఇబ్బంది పడుతుండగా, ఈ శరణార్థులతో మరింత ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందంటూ కొలంబియా నాయకులు అంటున్నారు.

"మా వాళ్లే పనులు దొరక్క ఎన్నో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వెనెజ్వెలా నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చేశారు. వారంతా తిరిగి వెళ్లిపోవాలి" అని బుకారమంగ నగర మేయర్ రొడోల్ఫొ హెర్నెండెజ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)