చాక్లెట్ అంతం: ప్రపంచ ఉత్పత్తిలో సగం తినేస్తున్న పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా ప్రజలు.. భారత్, చైనాల్లో పెరుగుతున్న డిమాండ్

  • 30 సెప్టెంబర్ 2018
చాక్లెట్ తిని ఆసక్తిగా చూస్తున్న బాలిక Image copyright iStock

2050 తర్వాత చాక్లెట్లు కనిపించవు. ఈ మాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాక్లెట్ ప్రియులను ఆందోళనలో పడేసింది. మనం చాక్లెట్ సంక్షోభం దిశగా వెళ్తున్నాం అనే విషయం గురించి కొన్ని వేల వార్తలు, సుదీర్ఘ కథనాలు వస్తున్నాయి.

చాక్లెట్ గ్లోబల్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. చాక్లెట్ మార్కెట్ 2025 నాటికి, 2015తో పోలిస్తే రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు.

చాక్లెట్ డిమాండ్ వెనుక రుచే కాదు, కొన్ని భావనలు కూడా ఉన్నాయి. చాక్లెట్ తినడం వల్ల వృద్ధాప్యం ఆలస్యంగా వస్తుందని. ఇది యాంటీ-ఆక్సిడెంటులా పనిచేస్తుందని, ఒత్తిడి తగ్గిస్తుందని, రక్తపోటును అదుపులో ఉంచుతుందని చాలా మంది అనుకుంటున్నారు. అంతే కాదు చాక్లెట్ వల్ల చాలా ఉపయోగాలున్నట్టు కూడా గుర్తించారు.

చాక్లెట్ అంటే అందరూ ఇష్టపడతారు. కానీ చాక్లెట్ అంటే పిచ్చెక్కిపోయేవాళ్లు ఎక్కడున్నారో తెలుసా? ప్రపంచ ఉత్పత్తిలో సగం చాక్లెట్.. పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా ప్రజలు చప్పరించేస్తున్నారు.

స్విట్జర్లాండ్ ప్రజలకు చాక్లెట్ వాసన, దాని తీయదనం అంటే చాలా ఇష్టం. 2017లో ఇక్కడ సగటున ఒక వ్యక్తి 8 కిలోల చాక్లెట్లు తిన్నట్టు గుర్తించారు.

చాక్లెట్ అంతం Image copyright Getty Images

చాక్లెట్ కొత్త మార్కెట్

చాక్లెట్ అంటే ఇష్టపడే విషయంలో ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలే ముందున్నాయి. కానీ దాని భవిష్యత్తు మాత్రం వేరే చోట ఉంది.

వంద కోట్ల జనాభా కంటే ఎక్కువ ఉన్న దేశాలైన చైనా-భారత్‌లో చాక్లెట్లకు పెద్ద మార్కెట్ ఉంది. అది ఇంకా పెరుగుతోంది.

వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, మధ్యతరగతి ప్రజల్లో అభివృద్ధి, మారుతున్న వినియోగదారుల అభిరుచులు ఈ రెండు దేశాల్లో చాక్లెట్ల డిమాండ్ చాలా పెరిగేలా చేసింది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న చాక్లెట్ మార్కెట్లలో భారత్ ఒకటి. గత కొన్నేళ్లుగా ఇక్కడ చాక్లెట్ డిమాండ్ పెరుగుతూనే ఉంది.

2016లో భారత్‌లో 2 లక్షల 28 వేల టన్నుల చాక్లెట్ వినియోగించారు. అది 2011లో వినియోగంతో పోలిస్తే 50 శాతం ఎక్కువ.

చాక్లెట్ అంతం Image copyright Getty Images

భారతీయుల తీయటి నేస్తం

తీపి అంటే భారతీయులకు ఉన్న ఇష్టాన్ని భారతీయులు దాచుకోలేరు. చాక్లెట్ రుచి వారికి బాగా నచ్చింది. కొంతమంది అయితే దీన్ని ఆరోగ్యం అని కూడా భావిస్తున్నారు.

చైనాలో 80వ దశకంలో వచ్చిన ఆర్థిక సవరణలకు ముందు చాక్లెట్ కష్టంగా దొరికే ఒక వస్తువుగా ఉండేది. వినియోగం విషయంలో చైనా ఇప్పటికీ చాలా వెనకబడి ఉంది. ఇక్కడ సగటున ఒక వ్యక్తి కిలో కంటే తక్కువ చాక్లెట్ తింటాడు.

చైనాలో కొత్తగా పెరిగిన కాఫీ కల్చర్, చాక్లెట్ మార్కెట్‌ను మార్చేసింది. సంపన్నులైన లక్షల మంది నాణ్యమైన విదేశీ చాక్లెట్లను ఆన్‌లైన్ షాపింగ్‌లో తెప్పించుకుంటున్నారు. ఈ వ్యాపారం అలీబాబా లాంటి రీటెయిలర్‌ను కూడా తమ బిజినెస్ మోడల్ మార్చుకునేలా చేసింది.

చాక్లెట్ అంతం Image copyright Getty Images

ప్రమాదంలో చాక్లెట్

చాక్లెట్ కోకో నుంచి తయారవుతుంది. కోకో చెట్లు ఉష్ణమండల తడి వాతావరణంలో పెరుగుతాయి. దీనికి చిత్తడి అడవుల నీడ అవసరం అవుతుంది. అందుకే వీటిని పండించే ప్రాంతం పరిమితంగా ఉంటుంది.

కోకోను ముఖ్యంగా పశ్చిమ ఆఫ్రికాలో ఉత్పత్తి చేస్తారు. దాని మొత్తం ఉత్పత్తిలో సగ భాగం ఐవరీ కోస్ట్, ఘనా నుంచే వస్తుంది.

గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో కోకో వ్యవసాయ రంగం కుంచించుకుపోతోంది. దీనికి అవసరమైన తేమ, నీడ ఏర్పాటు చేయడం రైతులకు కష్టమైపోతోంది.

కోకో పండించడానికి అనువైన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో చాలా వాటిపై వ్యవసాయ ఆంక్షలు ఉన్నాయి. దాంతో కోకో పంట అంతకంతకూ తగ్గిపోతోంది.

చాక్లెట్ అంతం Image copyright Getty Images

కోకో మొక్కలకు ఇన్ఫెక్షన్

వాతావరణ సమస్యలతోపాటు, కొన్ని తెగుళ్లు, పురుగులు వల్ల కూడా కోకో పంటకు నష్టం కలుగుతోంది. ఒక అంచనా ప్రకారం కోకో మొక్కలకు వచ్చే వ్యాధుల వల్ల ప్రతి ఏటా 30 నుంచి 40 శాతం కోకో పంట నాశనం అవుతోంది.

ఈ తెగుళ్ల వల్ల లక్ష హెక్టార్లలో ఉన్న కోకో మొక్కలను ధ్వంసం చేస్తున్నట్టు ఐవరీ కోస్ట్ ప్రకటించింది. వాటికి వైరస్ వచ్చిందని చెప్పింది. ఆయా ప్రాంతాల్లో మళ్లీ మొక్కలు నాటడానికి కనీసం ఐదేళ్లు పడుతుంది.

కోకోకు వచ్చే వైరస్ వల్ల దాని కొమ్మలు ఉబ్బినట్టు అవుతాయి. దాని వల్ల దిగుబడి తగ్గిపోతుంది. పంట కూడా నాశనం అవుతుంది.

ధరల్లో హెచ్చుతగ్గులు కూడా కోకో రైతులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. దాంతో వాళ్లు సాగు సులభంగా ఉండి, లాభాలు తెచ్చిపెట్టే ఇతర పంటల వైపు మళ్లుతున్నారు.

ప్రపంచ కోకో ఉత్పత్తిలో ఇండోనేషియా మూడో స్థానంలో ఉంటుంది. ఇక్కడ కూడా 2010 నుంచి ఉత్పత్తి పడిపోతూ వస్తోంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో కోకో చెట్లు వయసైపోయాయి. ఫలితంగా రైతులు మొక్కజొన్న, రబ్బర్, పామాయిల్ లాంటి పంటలు వేసుకుంటున్నారు.

చాక్లెట్ అంతం Image copyright Getty Images

కోకోపై కొత్త ఆశలు

కొత్త మార్కెట్లలో డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఉత్పత్తి తగ్గిపోతుండడంతో కోకో ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఆందోళనలో పడ్డాయి.

ఘనా కోకో ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద దేశం. ఇది ఆసియా, ముఖ్యంగా చైనాను ఒక పెద్ద అండగా భావిస్తుంది. ఉత్పత్తి పెంచుకోవడం కోసం చైనాలోని ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఘనా ఒకటిన్నర బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది.

మధ్యప్రాచ్యం, ఆఫ్రికా కూడా చాక్లెట్ ఉత్పత్తిలో కీలకంగా ఉంటాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలో కూడా ఒక వ్యక్తి చాక్లెట్ వినియోగం ప్రాంతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ మార్కెట్లలో వినియోగదారులు చాక్లెట్లను స్టేటస్ సింబల్‌లా చూస్తారు. అందుకే ఇక్కడ ప్రీమియం బ్రాండ్ డిమాండ్ పెరుగుతోంది.

ఈ విషయంలో అల్జీరియా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. యూరోమానిటర్‌ను బట్టి అల్జీరియా ప్రజలు చాక్లెట్‌ను ఎనర్జీ బూస్టర్‌ రూపంలో తింటారు. యువత వీటిని ఎక్కువగా తింటోంది. కానీ ఇక్కడ చాక్లెట్లను బహుమతులుగా ఇవ్వడం చాలా తక్కువ.

చాక్లెట్ అంతం Image copyright Getty Images

చాక్లెట్లను కాపాడడం సాధ్యమేనా?

చాక్లెట్ భారీగా ఉత్పత్తి చేసే దేశాలు దానిని కాపాడడానికి చేతులు కలుపుతున్నాయి. రెయిన్ ఫారెస్ట్ అలయన్స్, యూటీజడ్, ఫెయిర్ ట్రేడ్ లాంటివి ఏర్పాటు చేశాయి.

అమెరికాలోని అతిపెద్ద చాక్లెట్ తయారీదారు మార్స్ రిగ్లే కన్ఫెక్షనరీ, వేడిలో కూడా పెరిగే కోకో మొక్కలను అభివృద్ధి చేసేందుకు ఒక బిలియన్ డాలర్ల ఫండ్ ఏర్పాటు చేశారు.

మాండేలేజ్ ఇంటర్నేషనల్ కూడా కోకోను కాపాడాలని ప్రయత్నిస్తోంది. కోకో రైతులకు సాయం చేసేందుకు 2012లో 'కోకో లైఫ్' క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందులో మిల్కా బ్రాండ్ కూడా ఉంది.

ఆ దిశగా కాస్త విజయం కూడా లభించింది. కానీ కోకో రైతులను పేదరికం నుంచి బయటపడేయడానికి అది ఏమాత్రం సరిపోదు.

చాక్లెట్ అంతం Image copyright Getty Images

రైతుల ఆదాయం అంతంతమాత్రం

ఐవరీ కోస్ట్‌లో యూటీజెడ్ ధ్రువీకరించిన రైతుల వార్షిక ఆదాయం 84 యూరోల నుంచి 134 యూరోలు ఉంటుంది. ధ్రువీకరించని రైతుల ఆదాయం కంటే అది సుమారు 16 శాతం ఎక్కువ. కానీ అది వారికి ఏమాత్రం సరిపోవడం లేదు.

రైతులు సర్టిఫైడ్ కావడం కూడా ఒక సమస్యే. అది పొందాలంటే రైతులు కోఆపరేటివ్ సభ్యులు కావల్సి ఉంటుంది. ఐవరీ కోస్ట్‌లో 30 శాతం కోకో రైతులు మాత్రమే ఇలా సభ్యులుగా ఉన్నారు.

ఉత్పత్తి నుంచి సరఫరా వరకూ ఎక్కడా బాల కార్మికులను ఉపయోగించకూడదని కూడా షరతులు ఉన్నాయి. దానిని నియంత్రించడం దాదాపు అసాధ్యం.

ఆఫ్రికా స్థానిక కోకో ఉత్పత్తిదారులకు తమదైన సొంత ప్రాజెక్టు ఉంది. వారు ఒపెక్(OPEC) లాంటివి చర్యలు ప్రకటించారు.

చాక్లెట్ అంతం Image copyright Getty Images

కోకో ఉత్పాదనల ధరపై వారు తమ నియంత్రణ కోరుకుంటున్నారు. దాని కోసం ఉత్పత్తి, అమ్మకాలలో మెరుగైన సమన్వయం ఉండాలని చెబుతున్నారు. దానివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల ప్రభావం కోకో రైతులపై పడకుండా వారి ప్రయోజనాలను కాపాడగలమని చెబుతున్నారు.

భవిష్యత్తులో ముంచుకొస్తున్న చాక్లెట్ సంక్షోభం నుంచి తప్పించడానికే ఈ చర్యలు అని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. కానీ కోకో పంట ప్రమాదంలో పడితే చాక్లెట్ కూడా దక్కనే విషయం మనం గుర్తుంచుకోవాలి.

చాక్లెట్ అంతం Image copyright Getty Images

చాక్లెట్ ఉత్పత్తిదారులు ముందుకు రావడం, కోకో రైతులకు అండగా నిలవడం అందరిలో కొత్త ఆశలను నింపుతోంది. కానీ అలా వారు చాక్లెట్ భవిష్యత్తును కాపాడగలరా.. దానికి కాలమే సమాధానం చెబుతుంది.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)