తక్కువ పని చేసే కళ... రాణించటమెలా?

  • 14 ఏప్రిల్ 2019
తక్కువ పని చేసే కళ Image copyright Getty Images

‘పనిలో విశ్రాంతి’ అనే కళలో రాణించటం.. అనుకున్నదానికన్నా కష్టమే. కానీ.. ఈ కళను అలవరుచుకోవటం చాలా ముఖ్యం.

నేను వాషింగ్టన్ డీసీ నుంచి రోమ్ నగరానికి మారినపుడు.. నన్ను కట్టిపడేసింది అక్కడి గ్రామడ్ బాసిలికానో మరో పురాతన నిర్మాణమో కాదు.. జనం ఎక్కువగా ఖాళీగా ఉండటం.

వృద్ధ మహిళలు కిటికీల దగ్గర కూర్చుని కింద వెళుతున్న జనాన్ని చూస్తుండటం.. కుటుంబాలు సాయంత్రపు వ్యాహ్యాళిలో ఆగుతూ ఆగుతూ తెలిసినవారినందరినీ పలకరిస్తున్న దృశ్యాలు.. చాలా తరచుగా కనపించేవి.

ఆఫీసు జీవితం కూడా భిన్నంగానే ఉంది. పనిలో పడిపోయి డెస్కు దగ్గరకే ఏవో తెప్పించుకుని తినటమనేది ఉండదు. మధ్యాహ్న భోజనానికి టైమ్ అయిందంటే చాలు.. ప్రశాంతంగా భోజనం చేసే ప్రొఫెనల్ ఉద్యోగులతో రెస్టారెంట్లు నిండిపోతాయి.

పదిహేడో శతాబ్దంలో గ్రాండ్ టూరిస్ట్స్ తమ పరిశీలనల గురించి రాయటం మొదలుపెట్టినప్పటి నుంచీ.. ఇటాలియన్ల సోమరితనం అనే అంశాన్ని బయటివాళ్లు ఒక మూసగా చిత్రీకరించారు. కానీ.. అసలు విషయం అదికాదు. మధ్యాహ్నం తీరుబడిగా భోజనం చేయటానికి ఇంటికి వెళ్లిన ఆ మిత్రులు ఆఫీసుకు తిరిగివచ్చి రాత్రి 8 గంటల వరకూ పనిచేశారు.

Image copyright Getty Images

నిర్విరామ పనితో ఉత్పాదకత తగ్గుతుంది...

అయినాకానీ.. కష్టపడి పనిచేయటాన్ని.. అసలేమీ చేయకుండా ఉండటంలోని తీయదనంతో సమతౌల్యం చేస్తున్నామన్న నమ్మకం నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తుంటుంది. నిజానికి.. ఏమీ చేయకపోవటమనేది.. ఉత్పాదకంగా ఉండటానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తుంది. సృజనాత్మకమైనదైనా, మేధోపరమైనదైనా, శారీరకశ్రమపరమైనదైనా.. అంతిమంగా మన సమయాన్ని ఉత్పాదకంగా ఉపయోగించుకోవాలి.

కానీ.. నిర్విరామంగా పనిచేయటం అనేది ఉత్పాదకతకు మేలు చేయదు.. నిజానికి ప్రతికూలంగా మారుతుంది. రోజులో మనం తాజాగా మొదలుపెట్టినప్పటి పని నాణ్యాతతో పోలిస్తే.. 14 గంటల చివరిలో మన పని అత్యంత నాశిరకంగా ఉంటుందని పరిశోధకులు గుర్తిస్తున్నారు.

ఈ రకంగా పనిచేయటం మన సృజనాత్మకత, సంగ్రహణ సామర్థ్యాలను కూడా అణచివేస్తాయి. ఓవర్ టైమ్ పనిచేయటం వల్ల మనం శారీరకంగా జబ్బుపడ్డామన్న భావన కలిగిస్తాయి.. అసలు మన జీవితానికి ప్రయోజనం ఏమైనా ఉందా అనే ఆలోచనలూ వస్తాయి.

‘టు ఆసం అవర్స్’ అనే పుస్తక రచయిత జోష్ డేవిస్ ఇలా చెప్తారు: మానసిక శ్రమను పుషప్‌లు చేస్తున్న విధంగా ఊహించండి. మీరు ఓ 10,000 పుషప్‌లు చేయాలనుకున్నారు. అవన్నీ బ్రేక్ లేకుండా ఒకేసారి చేసేయటం అత్యంత ‘సమర్థవంతమైన’ పద్ధతి. కానీ.. అది అసాధ్యమని మనకు తెలుసు. అలాకాకుండా.. విడతల వారీగా కొన్ని వారాల కొంచెం కొంచెం చేసుకుంటూ పోతుంటే.. వాటిని పూర్తిచేయటం సాధ్యమవుతుంది.

‘‘ఇలాచూస్తే మన మెదడు కూడా ఒక కండరం లాంటిదే. నిరంతరం పనిచేయటం వల్ల మనం సాధించగలిగేది స్వల్పమే. సరైన పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటే మనం సాధించలేనిది ఉండదు’’ అని ఆయన పేర్కొంటారు.

Image copyright Alamy

మెదడు కూడా ఓ కండరం లాంటిదే...

మనలో చాలా మంది మెదడును ఓ కండరంలా కాకుండా.. నిరంతరం పనిచేసే ఓ కంప్యూటర్ లాగా ఒక యంత్రంలాగా భావిస్తుంటారు. అది అవాస్తవమే కాదు.. బ్రేక్ లేకుండా నిరంతరం పనిచేసే ఒత్తిడి హానికరం కూడా అని నిపుణులు చెప్తన్నారు.

‘‘శరీర వ్యవస్థ ఒక బ్రేక్ అవసరమని చెప్తున్నా.. పని కొనసాగిస్తూ ఉంటే.. మంద్రస్థాయి ఒత్తిడి తరచుగా ఇబ్బందిపెడుతుంటుంది. అది చాలా ప్రమాదం’’ అని ‘ఆటోపైలట్’ రచయిత, పరిశోధకుడు ఆండ్రూ స్మార్ట్ పేర్కొన్నారు.

ఎక్కువ గంటల పాటు పనిచేయటం వల్ల.. హృదయనాళ సంబంధిత వ్యాధుల ముప్పు 40 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఒక విశ్లేషణలో వెల్లడైంది. ఇది ధూమపానం వల్ల రాగల ముప్పు (50 శాతం)తో దాదాపు సమానం.

ఎక్కువ గంటలు పనిచేసే వారికి మెదడు పోటు (స్ట్రోక్) ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, రోజుకు 11 గంటల పాటు పనిచేసే వారు కుంగుబాటు (డిప్రెషన్) ముప్పు రెండున్నర రెట్లు అధికంగా ఉంటుందని మరో అధ్యయనంలో గుర్తించారు.

ఈ పరిస్థితులు జపాన్‌లో ’కరోషి‘ అంటే.. పని వల్ల మరణం అనే విచారకరమైన ట్రెండ్‌కి దారితీసింది.

మరైతే.. చాలా కాలంగా తీసుకోని సెలవు ఇప్పుడు తీసుకోవాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే.. ‘అవును తీసుకోవాలి’ అనే చెప్పాలి. హెల్సింకిలో నిర్వహించిన ఒక అధ్యయనంలో గత 26 ఏళ్ల కాలంలో.. మధ్యవయసులో తక్కువ సెలవులు తీసుకున్న ఎగ్జిక్యూటివ్‌లు, వ్యాపారవేత్తల్లో సత్వర మరణాలు, మలి వయసులో వ్యాధులు ఎక్కువ అని మరో పరిశీలనలో వెల్లడైంది.

Image copyright Getty Images

తక్కువ పని.. ఎక్కువ ఉత్పాదకత...

ప్రపంచంలో అత్యంత సృజనాత్మక, ఉత్పాదక సామర్థ్యం గల వారు కొందరు.. తక్కువ పని చేయటం గురించిన ప్రాధాన్యతను గుర్తించారు. పని విషయంలో వారికి బలమైన నిబద్ధత ఉంది. అదే సమయంలో విశ్రాంతికి, ఆటవిడుపులకు కూడా వారు అంకితమయ్యారు.

‘‘ఒకసారి ఒకదాని మీద పనిచేయాలి.. అది పూర్తయ్యే వరకూ. నిర్ధారిత సమయానికి ఆపండి. మనుషులుగా ఉండండి. జనాన్ని కలవండి. ఊళ్లు తిరగండి. కావలిస్తే కాస్త మందు తాగండి’’ అని హెన్రీ మిల్లర్ తన ‘11 కమాండ్‌మెంట్స్’లో చెప్తారు.

అమెరికా పితగా భావించే బెంజమిన్ ఫ్రాంక్లిన్‌ను.. కష్టపడి పనిచేయటానికి ఒక ప్రతీకగా పరిగణిస్తారు. ఆయన కూడా తన సమయంలో ఎక్కువ భాగం ఖాళీగా గడిపేవారు. ఆయన రోజూ మధ్యాహ్న భోజనం కోసం రెండు గంటల విరామం తీసుకునేవారు. సాయంత్రం ఖాళీగా ఉండేవారు. రాత్రంతా నిద్రపోయేవారు.

ప్రపంచ స్థాయిలో చూసినా.. ఒక దేశపు ఉత్పాదక సామర్థ్యం - ఆ దేశపు సగటు పనిగంటల మధ్య సంబంధమేమీ లేదు. అమెరికాలో ఒక సగటు ఉద్యోగి వారానికి సగటున 38.6 గంటలు పనిచేస్తాడు. ఇదే నార్వేలో సగటు పనిగంటల కన్నా 4.6 గంటలు ఎక్కువ. కానీ.. అమెరికా కార్మికులు సగటున గంటకు 69.60 డాలర్లు జీడీపీ జోడిస్తే.. నార్వే ఉద్యోగి సగటున గంటకు 78.70 డాలర్లు జోడించారు.

ఇటలీలో సగటున వారానికి 35.5 గంటలు పనిచేస్తారు. అయినప్పటికీ.. సగటున వారానికి 47.9 గంటలు పనిచేసే టర్కీ కార్మికులకన్నా 40 శాతం ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. బ్రిటన్‌లో వారానికి సగటున 36.5 గంటలు చేసే పనికన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తారు ఇటాలియన్లు.

అంటే.. ఎక్కువగా తీసుకునే కాఫీ బ్రేక్‌లు నిరుపయోగం కాదనే కనిపిస్తోంది.

Image copyright Getty Images

ఆరు గంటల పనిదినాల ప్రయోగంలో ఏం తేలింది?

అసలు మనకు రోజూ ఎనిమిది గంటల పని గంటలు ఎందుకున్నాయంటే.. ఉద్యోగి పని గంటలను తగ్గించటం వల్ల తాము అనుకున్న దానికి వ్యతిరేక ఫలితాలు.. వారి ఉత్పాదకత పెరగటం.. వస్తాయని కంపెనీలు గుర్తించటమే కారణం.

పారిశ్రామిక విప్లవ కాలంలో.. రోజుకు 10 నుంచి 16 గంటలు పని సమయం ఉండేది. ఫోర్డ్ కంపెనీ మొదటిసారిగా ఎనిమిది గంటల పని సమయంతో ప్రయోగం చేసింది. దానివల్ల తన కార్మికులు గంటకు చేసే పని మాత్రమే కాదు.. మొత్తంగా కూడా మరింత ఎక్కువ ఉత్పాదకంగా పనిచేస్తున్నారని గుర్తించింది. రెండేళ్లలోనే ఆ సంస్థ లాభాలు రెట్టింపయ్యాయి.

అంటే.. పది గంటల పనిదినాలకన్నా ఎనిమిది గంటల పనిదినాలు మంచివైతే.. అంతకన్నా తక్కువ పనిగంటలు ఇంకా ఉత్తమ ఫలితాలిస్తాయా? నాలుగు పదుల వయసు పైబడిన వారిలో వారానికి 25 పని గంటలు గరిష్టపరిధి అని ఒక పరిశోధనలో తేలింది. మరోవైపు.. స్వీడన్‌లో ఇటీవల ఆరు గంటల పనిదినాలను ప్రయోగాత్మకంగా అమలుచేసినపుడు.. ఉద్యోగులు మరింత ఆరోగ్యవంతంగానూ ఇంకా ఎక్కువ ఉత్పాదకతతోనూ పనిచేశారని వెల్లడైంది.

పనిదినాన జనం ఎలా ప్రవర్తిస్తారనే దానినిబట్టి ఈ ఫలితాలు వచ్చినట్లు కనిపిస్తోంది. బ్రిటన్‌లో దాదాపు 2,000 మంది పూర్తికాలపు ఆఫీస్ ఉద్యోగుల మీద చేసిన ఒక సర్వేలో.. ఎనిమిది గంటల పనిదినంలో జనం కేవలం 2 గంటల 53 నిమిషాలు మాత్రమే ఉత్పాదకంగా ఉంటారని గుర్తించారు. వారు మిగతా సమయాన్ని సోషల్ మీడియా చూసుకుంటూ, వార్తలు చదువుతూ, సహోద్యోగులతో పనికి సంబంధంలేని విషయాలు మాట్లాడుతూ, ఆహారం తీసుకుంటూ.. చివరికి కొత్త ఉద్యాగాలు వెతుక్కుంటూ గడిపారు.

మన సామర్థ్యాలను పెంచుకునే క్రమంలో.. మనం ఇంకా తక్కువ కాల పరిమితుల్లోనూ నిమగ్నమై పనిచేయగలం. స్టాక్‌హోం యూనివర్సిటీ సైకాలజిస్ట్ ఆండర్స్ ఎరిక్సన్ వంటి పరిశోధకులు.. ఏ నైపుణ్యంలోనైనా ప్రావీణ్యం పొందటం కోసం అవసరమైన సాధనచేయటం వంటి పనుల్లో కూడా మధ్య మధ్యలో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ విరామాలు అవసరమని గుర్తించారు.

ఎక్కువ మంది జనం విరామం లేకుండా కేవలం ఒక గంట పాటు మాత్రమే పనిచేయగలరు. ఉన్నతస్థాయి మ్యుజీషియన్లు, రచయితలు, క్రీడాకారులు చాలా మంది.. తమ వృత్తి కోసం రోజుకు ఐదు గంటలకు మించి ఎక్కువ సమయం కేటాయించరు.

చిన్న చిన్న విరామాలు తీసుకోవటం ద్వారా పనిలో నిమగ్నమవటం పెరుగుతుందని.. ఉన్నతస్థాయి పనితీరు కొనసాగుతుందని ఇతర అధ్యయనాల్లోనూ వెల్లడైంది. విరామం లేకుండా పనిచేయటం వారి పనితీరును దిగజార్చింది.

Image copyright Alamy

క్రియాశీల విశ్రాంతి...

అయితే.. మనం ఏమీ చేయటం లేదని అనుకుంటున్నపుడు మనం చేస్తున్న దానిని వర్ణించటానికి ‘విశ్రాంతి’ అనే పదం సరైనది కాకపోవచ్చునని పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మనం ఏమీ చేయనప్పుడు మన మెదడులో క్రియాశీలమయ్యే ‘డిఫాల్ట్-మోడ్ నెట్‌వర్క్’ (డీఎంఎన్).. జ్ఞాపకాలను బలోపేతం చేయటం, భవిష్యత్తును ఊహించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇతరులను గమనిస్తున్నపుడు, తమ గురించి తాము ఆలోచిస్తున్నపుడు, నైతిక అంచనా వేస్తున్నపుడు, ఇతరుల భావోద్వేగాలను గమనిస్తున్నపుడు కూడా మన మెదడులో ఈ భాగం క్రియాశీలమవుతుంది.

మరో మాటలో చెప్పాలంటే.. ఈ నెట్‌వర్క్ ఆగిపోతే.. గుర్తుంచుకోవటానికి, పరిణామాలను అంచనావేయటానికి, సామాజిక కలయికలను అవగాహన చేసుకోవటానికి, మనల్ని మనం అర్థం చేసుకోవటానికి, నైతికంగా పనిచేయటానికి, ఇతరుల పట్ల సానుభూతి చూపించటానికి - పనిప్రదేశాల్లోనే కాదు.. జీవితంలోనూ మనం క్రియాశీలంగా ఉండటానికి అవసరమైన ఈ పనులన్నీ చేయటానికి మనం చాలా ఇబ్బందిపడాల్సి రావచ్చు.

‘‘పరిస్థితులకు గల లోతైన ప్రాధాన్యతను గుర్తించటానికి ఇది దోహదపడుతుంది. విషయాలకు అర్థాన్ని ఇవ్వటానికి దోహదపడుతుంది. మనం విషయాలకు అర్థం ఇవ్వటం లేదంటే.. మనం కేవలం ప్రతిస్పందిస్తున్నామని.. ఆ క్షణానికి స్పందిస్తున్నామని అర్థం’’ అని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో బ్రెయిన్ అండ్ క్రియేటివిటీ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకురాలు, న్యూరోసైంటిస్ట్ మేరీ హెలెన్ ఇమ్మోర్డినో-యాంగ్ చెప్తున్నారు.

అన్నిటికన్నా మించి.. మన ఏకాగ్రతను అంతర్ముఖంలోకి మళ్లించకపోతే.. కీలకమైన సంతోషం అనే అంశాన్ని కోల్పోతాం.

‘‘మనం ఎక్కువగా మనం చేస్తున్న పనికి అర్థం వెతుక్కోకుండా పనిచేస్తున్నాం. మన చర్యలను ఒక విస్తృత కారణానికి జోడించగల సామర్థ్యం మనకు లేనపుడు.. కాలం గడిచేకొద్దీ అవి నిరర్థకంగా, శూన్యంగా, నేను అనే విస్తృత అవగాహనతో సంబంధంలేనివిగా అనిపిస్తాయి. ‘అర్థంలేకుండా’ పనిచేస్తున్నపుడు కాలక్రమంలో అది మన మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి’’ అని మేరీ హెలన్ పేర్కొన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ‘‘కదలాలని కానీ మాట్లాడాలని కానీ ఆమెకు లేదు. విశ్రాంతి కావాలన్నది.. కాసేపు ఒరిగిపోవాలన్నది.. కలలు కనాలన్నది ఆమె కోరిక. ఆమెకు చాలా అలసిపోయినట్లుగా అనిపిస్తోంది’’ అని వర్జీనియా వూల్ఫ్ రాశారు.

మెదడు ఖాళీగా ఉండదు...

ధ్యానం (మెడిటేషన్) చేసి చూసిన వారికి తెలిసనట్లుగా.. ఏం చేయకపోవటమనేది ఆశ్యర్యకరంగా కష్టమైన విషయమే. మనలో ఎంత మంది.. 30 సెకన్లు ఖాళీగా ఉన్న తర్వాత ఫోన్లు చేతిలోకి తీసుకోరో చెప్పండి?

నిజానికి.. ఖాళీగా ఉండటం ఎంత అసౌకర్యంగా ఉంటుందంటే.. అటువంటి పరిస్థితుల్లో మనల్ని మనం గాయపరచుకుంటాం కూడా. పదకొండు రకాల వేర్వేరు అధ్యయనాల్లో పరిశోధకులు గుర్తించిన విషయం.. ఆ పరిశోధనలో పాల్గొన్న వారు ఖాళీగా ఉండటానికి బదులు ఏదైనా సరే చేస్తారు. చివరికి తమకు తాము ఎలక్ట్రిక్ షాక్‌లు కూడా ఇచ్చుకుంటారు. అలాగని వారిని సుదీర్ఘ కాలం కదలకుండా కూర్చోమని చెప్పలేదు. కేవలం పది నుంచి 15 నిమిషాలు ఖాళీగా ఉండలేరు.

శుభవార్త ఏమిటంటే.. విశ్రాంతి ప్రయోజనాలు పొందటం కోసం అసలు ఏమీ చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. విశ్రాంతి అవసరమన్నది నిజమే. క్రియాశీల ఆలోచన కూడా.. అంటే మనకున్న సమస్య గురించి నెమరువేసుకోవటం లేదా ఒక ఐడియా గురించి ఆలోచించటం - అంతే ముఖ్యమైనది.

సమస్యలను స్నేహితులతో చర్చించటం, మంచి పుస్తకం చదవటం వంటి ఊహాజనిత ఫలితాలు, పరిస్థితులను ముందుగా చూడటానికి ఉపయోగపడేది ఏదైనా మేలు చేస్తుందని మేరీ హెలెన్ పేర్కొన్నారు. ఒకరకంగా సోషల్ మీడియాను చూడటం ద్వారా కూడా మన డీఎంఎన్‌ను క్రియాశీలం చేయొచ్చు.

‘‘ఒకవేళ ఒక అందమైన ఫొటోను మాత్రమే చూస్తుంటే.. అది పనిచేయటం మానేస్తుంది. కానీ.. ఆ ఫొటోలోని వ్యక్తి గురించిన విస్తృత కథనం చదువుతూ అంతర్గతంగా ఆలోచిస్తున్నట్లయితే.. మీ మెదడులోని నెట్‌వర్క్‌ను బాగా క్రియాశీలం చేస్తుండవచ్చు’’ అని ఆమె వివరించారు.

నిర్విరామ పని వల్ల ప్రతికూల ప్రభావాలను తొలగించటానికి అట్టే సమయం కూడా పట్టదు. పెద్దలు, పిల్లలు ఇరువురినీ వారి వస్తువులేవీ లేకుండా నాలుగు రోజుల పాటు బయటకు పంపించినపుడు.. వారి పనితీరు - సృజనాత్మకంగానూ, సమస్య పరిష్కారంలోనూ - 50 శాతం మెరుగుపడిందని వెల్లడైంది. బయట కొద్దిసేపు నడవటం కూడా వారి సృజనాత్మకతను గణనీయంగా పెంచింది.

Image copyright Getty Images

క్షణం సేదతీరితే అంతా మునిగిపోదు...

ప్రతికూల ప్రభావాన్ని మరమ్మతు చేయటానికి మరో ప్రభావవంతమైన పద్ధతి.. ధ్యానం. ఇంతకుముందు ఎన్నడూ ధ్యానం చేయని వారు కేవలం వారం రోజుల పాటు సాధన చేయటం ద్వారా.. అనుభవజ్ఞులైన వారికైతే ఒక సెషన్ ద్వారా.. వారి సృజనాత్మకత, ఆసక్తి, జ్ఞాపకశక్తి, నిమగ్నతలు పెరుగుతాయి.

నూరు శాతం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం లేని.. అల్లికల వంటి ఇతర పనులు కూడా ఉపయోగపడగలవు.

డెస్క్ నుంచి ఓ 15 నిమిషాలు పక్కకు వెళ్లటమో, రాత్రికి ఇన్‌బాక్స్ నుంచి లాగౌట్ కావటమో.. ఏం చేసినా.. మనం ఒక్క క్షణం సేదతీరితే అంతా మునిగిపోతుందన్న భయం మనల్ని నియంత్రిస్తూ ఉంటుంది.

అదంతా తప్పని కవి, జీవిత కోచ్, వ్యాపారవేత్త జాన్ రాబిన్సన్ అంటారు. ‘‘అగ్నిని నేను ఉపమానంగా ఉపయోగించాలనుకుంటున్నా. మనం ఒక వ్యాపారం ప్రారంభిస్తాం. ఒక ఏడాది తర్వాత.. మనం వారాంతపు సెలవు ఎప్పుడు తీసుకోగలం? ఎవరినైనా నియమించుకోగలమా? మనలో చాలా మందిమి మన స్థానంలో రావటానికి ఎవరినీ విశ్వసించం. ‘నిప్పు ఆరిపోతుంది’ అన్నట్లు భావిస్తుంటాం’’ అని ఆమె వివరిస్తారు.

‘‘అది బాగా మండుతోందని.. మనం వెళ్లిపోవచ్చని.. కొత్తగా వచ్చినవాళ్లు ఒక దుంగ వేస్తే అది జ్వాలలుగా ఎగస్తుందని మనం నమ్మితే ఏమవుతుంది?’’ అని ఆమె ప్రశ్నిస్తారు.

మనలో.. మనం నిరంతరం ‘చేస్తూనే ఉండాలి’ అని భావించేవాళ్లకి ఇది ఈజీ కాదు. కానీ.. మనం ఇంకా ఎక్కువగా చేయాలంటే.. తక్కువ చేయటానికి అలవాటు పడాల్సి వస్తుందేమో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం