ఇండోనేసియా సునామీ: హెచ్చరిక వ్యవస్థ ఎందుకు విఫలమైంది? ఎందుకింత ప్రాణనష్టం జరిగింది?

  • 1 అక్టోబర్ 2018
ధ్వంసమైన ఇళ్లు, తీరం Image copyright Getty Images

ఇండోనేసియాపై సునామీ విరుచుకుపడడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఏమయ్యారో ఇప్పటికీ తెలియనివారి సంఖ్య వేలల్లో ఉంది.

నిజానికి సునామీ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. కానీ, దాని తీవ్రతను తక్కువగా అంచనా వేసి 30 నిమిషాల తరువాత హెచ్చరికలు ఆపేశారు.

ఇండోనేసియాలోని సులవేసి ద్వీపానికి సమీపంలో అక్కడి కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు 7.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అనంతరం వరుస ప్రకంపనలతో సముద్రం అల్లకల్లోలంగా మారి సునామీ రూపంలో విరుచుకుపడింది.

తొలి ప్రకంపనలు నమోదైన వెంటనే ఇండోనేసియా వాతావరణ భూభౌతిక విభాగ(బీఎంకేజీ) అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 0.5 నుంచి 3 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు.

కానీ, 30 నిమిషాల తరువాత ఆ హెచ్చరికలను నిలిపివేశారు.

సులవేసి ద్వీపంలోని పాలు నగరం ఒక సన్నని అఖాతంలో ఉంది. అధికారుల హెచ్చరికల్లో చెప్పిన కంటే అధికంగా 6 మీటర్ల ఎత్తున అలలు విరుచుకుపడి విధ్వంసం సృష్టించాయి. పైగా, బీచ్ ఫ్రంట్ ఫెస్టివల్ కారణంగా సముద్ర తీరంలో వందలాది మంది స్థానికులు పోగయ్యారు. సునామీ రావడంతో వందలాది మంది రాకాసి అలలకు బలైపోయారు.

Image copyright AFP

సునామీ రానుందని ప్రజలకు తెలుసా లేదా?

బీఎంకేజీ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కేవలం 30 నిమిషాల్లోనే ఉపసంహరించుకోవడంతోనే ప్రజలు విపత్తు తీవ్రతను ఊహించలేకపోయారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

కానీ, తాము జారీ చేసిన హెచ్చరికలు అమల్లో ఉన్న సమయంలో ఈ సునామీ విరుచుకుపడిందని అధికారులు చెబుతున్నారు.

బీఎంకేజీ చైర్‌పర్సన్ ద్వికోరిటా కర్ణావతి దీనిపై ‘జకార్తా పోస్ట్‌’తో మాట్లాడుతూ.. సునామీ వచ్చేసిందదన్న సమాచారం రావడం, పాలులో తమ ఉద్యోగి పరిశీలించిన తరువాతే హెచ్చరికలు ఉపసంహరించుకున్నామని చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: సునామీ హెచ్చరిక వ్యవస్థ నమ్మదగినదేనా?

సాయంత్రం 6.37 గంటలకు చివరి ప్రకంపనలు వచ్చిన తరువాత హెచ్చరికలు ఉపసంహరించుకున్నామని, హెచ్చరిక ఉపసంహరణ తరువాత ప్రకంపనలు నమోదు కాలేదని ఆమె తెలిపారు.

సునామీ హెచ్చరికలను టెక్స్ట్ మెసేజిల రూపంలో ప్రజలకు పలుమార్లు పంపించామని.. కానీ, అవి వారికి చేరినట్లుగా లేవని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి.

ప్రకంపనల కారణంగా విద్యుత్, టెలికమ్యూనికేషన్ల వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో సునామీ హెచ్చరికలు ప్రజలకు చేరకపోయి ఉంటాయని విపత్తుల విభాగ అధికార ప్రతినిధి తెలిపారు.

Image copyright Getty Images

ఇంతకీ ఇండోనేసియాలో సునామీల విషయంలో ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థ ఉందా?

170 సిస్మిక్ బ్రాడ్‌బ్యాండ్ స్టేషన్లు, 238 యాక్సిలరోమీటర్ స్టేషన్లు, 137 టైడల్ గేజ్‌లను అనుసంధానిస్తూ ఇండోనేసియాలో సునామీలపై ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థ ఉంది. కానీ, ఇది చాలా పరిమితమైనదని అధికారులు చెబుతున్నారు.

170 భూకంప సెన్సర్లు ఉన్నప్పటికీ అందులో 70 సెన్సర్లు నిర్వహించడానికి తగినంత బడ్జెట్ మాత్రమే ఉందని బీఎంకేజీ భూకంప, సునామీ కేంద్రం అధ్యక్షుడు రహమత్ ట్రియానో 'బీబీసీ ఇండోనేసియా'కు తెలిపారు.

సునామీపై ముందుగానే హెచ్చరిక పంపినప్పటికీ అలలు ఎంతెత్తున వస్తాయన్నది కచ్చితంగా అంచనా వేయలేకపోయామని ఆయన చెప్పారు.

అంతేకాదు, సునామీ ప్రభావానికి గురయిన పాలు నగరానికి సమీపంలో అలల కొలమానిని(టైడల్ గేజ్‌)లు లేవు. అక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న టైడల్ గేజ్ ఒక్కటే కొంతలోకొంత దగ్గర్లో ఉన్నట్లు. అది కూడా సముద్ర మట్టం 6 సెంటీమీటర్ల మేర పెరిగినట్లుగా మాత్రమే గుర్తించింది. దాని ప్రకారం సునామీ అలలు 0.5 మీటర్లకు మించి ఎత్తు ఉండకపోవచ్చని అంచనాకు వచ్చారు.

''పాలుకు సమీపంలో టైడల్ గేజ్ ఉన్నట్లయితే అంచనాలు కచ్చితంగా ఉండేవి. అప్పుడు నష్టం ఈ స్థాయిలో ఉండేది కాదు'' అని ట్రియానో తెలిపారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక సెన్సర్లు అమర్చిన తెప్పలు ఇప్పుడు పనిచేయడం లేదు

అంచనాల్లో విఫలం.. అందుకే భారీ ప్రాణ నష్టం

సునామీ అంచనాలు, హెచ్చరికలకు సంబంధించిన అధునాతన వ్యవస్థలు ఉన్నట్లయితే పరిస్థితి ఇలా ఉండేది కాదు.

సముద్రంలో సెన్సర్లు అమర్చిన తెప్పలను ఏర్పాటు చేసినప్పటికీ అవి కూడా అధునాతనమైనవేమీ కావు. 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ తరువాత అమెరికా, జర్మనీ, మలేసియాలు విరాళంగా ఇచ్చిన ఈ సెన్సర్లలో ఇప్పుడు ఒక్కటి కూడా పనిచేయడం లేదు. నిధుల లేమి కారణంగా వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకోలేకపోయారు.

ఈ కారణంగానే బీఎంకేజీ.. భూకంపం వచ్చిన తరువాత, దాని తీవ్రత ఆధారంగా సునామీ హెచ్చరికలు చేస్తోంది.

ఈ సెన్సర్ల నుంచి సమాచారం కనుక వస్తే మరింత కచ్చితమైన, మరింత ముందస్తు హెచ్చరికలకు అవకాశం ఉండేదని ట్రియానో బీబీసీ ఇండోనేసియాకు తెలిపారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక సునామీలను అంచనా వేసే వ్యవస్థలు పనిచేయడం లేదని ఇండోనేసియా వాతావరణ భూభౌతిక విభాగ(బీఎంకేజీ) అంగీకరించింది

ఎక్కడ విఫలమయ్యారు?

సాధారణంగా ఇలాంటి భూకంపాల వల్ల సునామీలు రావని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ సివిల్, ఎన్విరానమెంటల్ ఇంజినీరింగ్ విభాగ ఉప అధిపతి ప్రొఫెసర్ ఫిలిప్ లీ ఫేన్ అభిప్రాయపడ్డారు.

భూపొరల్లో నిట్టనిలువుగా కదలికలు వచ్చినప్పుడే సునామీలు వస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రకంపనల్లో భూఫలకాలు ఒకదానితో ఒకటి అడ్డంగా ఒరిపిడికి గురయ్యాయని.. దానివల్ల ఫలకాలు అడ్డంగా మాత్రమే కదులుతాయని, నిట్టనిలువుగా కదలవని ఆయన తెలిపారు.

కాగా, పాలు తీరంలో గతంలోనూ సునామీలు వచ్చాయని.. ఈ ద్వీపం సన్నగా, పొడవుగా ఉండడం వల్ల సునామీ వస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని బందుంగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సముద్రశాస్త్ర ఆచార్యుడు హమ్జా లతీఫ్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

CAA, దిల్లీ హింసలపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి

కరోనావైరస్ వ్యాప్తిని ఉత్తర కొరియా సమర్థంగా ఎదుర్కోగలదా?

ప్రెస్ రివ్యూ: స్టూడెంట్స్‌ లోన్‌ యాప్‌ల నయా దందా... గడువులోగా అప్పు తీర్చకుంటే బ్లాక్‌మెయిల్‌

దిల్లీ హింస: తాహిర్ హుస్సేన్‌‌పై హత్యాయత్నం కేసు... పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆప్

దిల్లీ హింస: 'ప్రేమికుల దినోత్సవం రోజు పెళ్ళి చేసుకున్నాడు... 11 రోజులకే అల్లర్లలో చనిపోయాడు"

యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్

దిల్లీ హింస ప్రభావం హైదరాబాద్‌పై ఎలా ఉంది

దిల్లీ హింస: జస్టిస్ మురళీధర్ ఎవరు.. ఆయన బదిలీపై చర్చ ఎందుకు

దిల్లీ హింస: ‘హిందువుల ఆలయాలను ముస్లింలు రక్షించారు’