భౌతిక శాస్త్రంలో మహిళకు నోబెల్ ప్రైజ్.. 55 ఏళ్ల తర్వాత

  • 2 అక్టోబర్ 2018
డాక్టర్ డోనా స్ట్రిక్‌ల్యాండ్ Image copyright Uni Waterloo
చిత్రం శీర్షిక డాక్టర్ డోనా స్ట్రిక్‌ల్యాండ్

55 ఏళ్ల తర్వాత ఒక మహిళ భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. కెనడాకు చెందిన డాక్టర్ డోనా స్ట్రిక్‌ల్యాండ్‌కు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది.

ఈ పురస్కారాన్ని ఆమె అమెరికాకు చెందిన ఆర్థర్ ఆష్కిన్, ఫ్రాన్స్‌కు చెందిన గెరార్డ్ మోరోతో పంచుకుంటారు.

భౌతిక శాస్త్రంలో నోబెల్‌ను గెల్చుకున్న మహిళల్లో డోనా స్ట్రిక్‌ల్యాండ్‌ మూడోవారు. ఆమెకన్నా ముందు 1903లో మేరీ క్యూరీ, 1963లో మరియా గొప్పొయెర్ట్-మేయర్‌లు భౌతిక శాస్త్రం నోబెల్ పురస్కారాలను గెల్చుకున్నారు.

లేజర్ ఫిజిక్స్‌లో చేసిన పరిశోధనలకు గాను ఆమె ఈ పురస్కారాన్ని గెల్చుకున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక లేజర్ ఐ ట్రీట్‌మెంట్

డాక్టర్ స్ట్రిక్‌ల్యాండ్ కనుగొన్న ఎక్కువ తీవ్రత కలిగిన లేజర్ పల్సెస్‌ను లేజర్ ఐ సర్జరీ సహా అనేక పరిశోధనల్లో ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్ లూలో పని చేస్తున్న స్ట్రి‌క్‌ల్యాండ్.. నోబెల్ పురస్కారం వచ్చిన సంగతిని నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఆష్కిన్, గెరార్డ్‌లతో ఈ పురస్కారాన్ని పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

మరియా గొప్పొయెర్ట్-మేయర్ పరమాణు కేంద్రకాలపై చేసిన పరిశోధనలకు గాను నోబెల్ పురస్కారాన్ని గెల్చుకున్నారు.

ఆమెకన్నా ముందు మేరీ క్యూరీ, ఆమె భర్త పియెర్రీ క్యూరీ, ఆంటోయిన్ హెన్రీ బెకెరెల్‌లు రేడియో యాక్టివిటీపై చేసిన పరిశోధనకుగాను సంయుక్తంగా నోబెల్ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు