భారత్‌లో వేగంగా పెరుగుతున్న సెక్స్ టాయ్స్ వినియోగం.. 9 కీలక విషయాలు

  • 4 అక్టోబర్ 2018
సెక్స్ టాయ్ Image copyright iStock

సంప్రదాయానికి ప్రాధాన్యమిచ్చే దేశంగా భారత్‌కు గుర్తింపు ఉంది. సంప్రదాయాల మాట ఎలా ఉన్నా భారత్‌లో సెక్స్ టాయ్స్ వినియోగం చాలా వేగంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దంపతులు తమ బంధాన్ని మరింత దృఢపర్చుకునేందుకు సెక్స్ టాయ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఆ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయల మార్కు దాటింది. ఈ నేపథ్యంలో సెక్స్ టాయ్స్ మార్కెట్‌కు సంబంధించిన 9 ఆసక్తికర విషయాలివి.

1. భారత్, చైనాలే ముందు

సెక్స్ టాయ్స్ వినియోగంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్‌లు భారత్, చైనాలే అని బెంగళూరుకు చెందిన మార్కెట్ అధ్యయన సంస్థ ‘టెక్నావియో’ చెబుతోంది. సంప్రదాయపరమైన పరిమితుల వల్ల భారత్‌లో బహిరంగంగా సెక్స్ టాయ్స్‌ను అమ్మడం కుదరదని, ఒకవేళ అమ్మినా అందరిముందూ కొనడానికి ఎక్కువమంది ఆసక్తి చూపకపోవచ్చని టెక్నావియో ప్రతినిధి జోషువా చెబుతున్నారు. కానీ భారత్‌లో ఈ-కామర్స్ వ్యవస్థ విస్తృతం కావడంతో వీటి వినియోగం పెరిగిందని ఆయన అంటున్నారు. ఈ టాయ్స్ ఎక్కువగా చైనాలోనే తయారవుతాయి కాబట్టి అక్కడ చౌకగా లభిస్తాయి.

2. మహిళలు మాత్రమే కాదు...

మహిళలు మాత్రమే సెక్స్ టాయ్స్‌ను ఉపయోగిస్తారని చాలామంది భావిస్తారు. కానీ అది నిజం కాదని టెక్నావియో చెబుతోంది. అమెరికాలో 50శాతం మంది మగవాళ్లు ఏదో ఒక సందర్భంలో సెక్స్ టాయ్‌ని ఉపయోగించినట్లు టెక్నావియో తెలిపింది. కానీ ప్రపంచవ్యాప్తంగా మహిళలే వాటిని ఎక్కువగా వినియోగిస్తారని, ఆ సంఖ్య 60-65శాతం మధ్య ఉంటుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది.

3. మహిళా సాధికారత ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మహిళా సాధికారత కూడా సెక్స్ టాయ్స్ వినియోగం వేగంగా విస్తరించడానికి కారణమని ఎరికా బ్రావెర్‌మాన్ అనే మహిళ చెబుతున్నారు. ఎరికా తండ్రి 1976లోనే డాక్ జాన్సన్ పేరుతో సెక్స్ టాయ్స్ తయారు చేసే సంస్థను నెలకొల్పారు. ‘‘90ల్లో వచ్చిన సెక్స్ అండ్ ది సిటీ సినిమాలో నలుగురు అమ్మాయిలు వైబ్రేటర్ గురించి చర్చించడం కనిపిస్తుంది. ఈ మార్కెట్ ఊపందుకోవడానికి ఆ సన్నివేశం కీలక పాత్ర పోషించిందని నా అభిప్రాయం’’ అంటారు ఎరికా.

4. ఆన్‌లైన్ మార్కెట్‌తో పెరిగిన ఊపు

2003లో యూరప్‌లో లవ్‌హనీ అనే సంస్థ ఆన్‌లైన్‌లో సెక్స్ టాయ్స్ అమ్మకాలను ప్రారంభించింది. గత పదహారేళ్లలో ఆ సంస్థ అమ్మకాలు 130రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆన్‌లైన్‌ ద్వారానే వీటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

‘ఆన్‌లైన్‌లో కొంటే గోప్యత ఉంటుంది. లోపల ఏముందో బయటకు కనిపించదు. దుకాణాలలోకి వెళ్లి అమ్మకందారులతో మాట్లాడేందుకు ఇబ్బంది పడే అవసరం ఉండదు. అందుకే ఆన్‌లైన్ అమ్మకాలకు గిరాకీ ఎక్కువ’ అంటారు లవ్ హనీ సహ-వ్యవస్థాపకుడు రిచర్డ్ లాంఘస్ట్.

5. యురోపియన్లే ఎక్కువ

అమెరికా కంటే యురోపియన్లు సెక్స్ టాయ్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉదాహరణకు... ఇటలీలో 70శాతం ఆడవాళ్లు, మగవాళ్లు ఏదో ఒక దశలో ఈ సెక్స్ టాయ్స్‌ను ఉపయోగించినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

6. లక్ష కోట్లు దాటిన వ్యాపారం

2017లో సెక్స్ టాయ్స్ మార్కెట్ విలువ ప్రపంచవ్యాప్తంగా 1.7లక్షల కోట్ల రూపాయలు దాటింది. అంటే, గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన మైక్రో వేవ్ ఓవెన్ల అమ్మకాల విలువ కంటే ఇది ఎక్కువ.

7. జంటల వినియోగం

‘సెక్స్ టాయ్స్‌ను ప్రేమలో విఫలమైన వాళ్లు, ఒంటరివాళ్లే ఉపయోగిస్తారని అనుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో దంపతులే వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాటిని వినియోగించని జంటలతో పోలిస్తే వినియోగిస్తున్న జంటలే శృంగారం విషయంలో ఎక్కువ సంతోషంగా ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి’ అంటారు రిచర్డ్. ‘మా సంస్థ ద్వారా సెక్స్ టాయ్స్‌ను కొంటున్నవారిలో 70శాతం మంది తమ శృంగార జీవితంలో చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెబుతారు’ అని లవ్‌హనీ సహ-వ్యవస్థాపకడు నీల్ స్లేట్ ఫోర్డ్ అంటారు.

చిత్రం శీర్షిక భారత్ చైనాల్లో సెక్స్ టాయ్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది

8. చైనాలోనే 70శాతం తయారీ

ప్రపంచవ్యాప్తంగా లభ్యమయ్యే సెక్స్ టాయ్స్‌లో 70శాతం చైనాలోనే తయారవుతాయని మార్కెట్ అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ దేశంలో పెరిగిన ఉత్పాదక శక్తి కారణంగా తక్కువ ధరకే విదేశాలకు వాటిని ఎగుమతి చేయగలుగుతోంది. 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తన సంస్థ అమ్మకాలు అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగాయని చైనాలో సెక్స్ టాయ్స్ సంస్థను నెలకొల్పిన విలియం అనే వ్యక్తి చెప్పారు.

9. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి

ఏటా సెక్స్ టాయ్స్ మార్కెట్ 7-10శాతం మేర పెరుగుతోంది. కానీ భారత్, చైనా లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో అది మరింత వేగంగా విస్తరిస్తోంది. ప్రజల సంపాదనా శక్తి పెరగడంతో పాటు, ఆలోచనా విధానం మారుతుండటం కూడా దానికి కారణమని, రానున్న రోజుల్లో మార్కెట్ ఏటా 10-15శాతం మేర పెరిగే అవకాశం ఉందని టెక్నావియో సంస్థ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం