ఇండోనేసియా సునామీ - గ్రామాలను ముంచేసిన బురద.. ప్రజల్ని ఆదుకోలేకపోతున్న ప్రభుత్వం: బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  • 4 అక్టోబర్ 2018
పాలు నగరంలో పంచిపెడుతున్న కోళ్ల కోసం ఎగబడుతున్న భూకంప బాధిత ప్రజలు Image copyright Getty Images

ఇండోనేసియాలో సంభవించిన భారీ భూకంపం, సునామీల కారణంగా మరణించిన వారి సంఖ్య 1,400 దాటింది. శిథిలాలను తొలగించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చు.

ఇప్పటికే 500 పైగా మృత దేహాలను సాముహిక ఖననం చేశారు. అవి చాలా వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగాయి.

భూకంప ప్రాంతాల్లో ఇండోనేసియా అధ్యక్షుడు రెండోసారి పర్యటించారు. సహాయ సామాగ్రి ఇక్కడకు చేరుకుంటోందని చెప్పిన ఆయన.. మరింత సామాగ్రి అవసరం ఉందని పేర్కొన్నారు.

మరోవైపు ఇండోనేసియాను ఆదుకునేందుకు భారతదేశం ముందుకొచ్చింది. ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు పాలు నగరానికి భారీ ఎత్తున సహాయక సామాగ్రిని చేరవేశాయి.

మొత్తం మూడు యుద్ధ నౌకలు, రెండు విమానాల్లో తాగునీరు, ఆహార పదార్ధాలు, టెంట్లు, మందులను పంపించింది.

వాటితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య బృందాలను కూడా అక్కడికి తరలించారు.

ఇంతకీ ప్రస్తుతం పాలు నగరంలో పరిస్థితి ఎలా ఉంది..? దీనిపై బీబీసీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: పాలు నగరం ఇప్పుడు ఎలా ఉందంటే..

దుర్భేద్యమైన శిథిలాల కుప్పల కింద ఎంతో మంది సజీవ సమాధి అయ్యారు. నగరం మధ్యలో దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పరిస్థితులు మరీ ఇంత దారుణంగా మారినపుడు ఇండోనేసియా ప్రభుత్వం మాత్రం ఏం చెయ్యగలదు?

తీవ్రమైన భూకంపం కారణంగా ఎగసిపడ్డ బురద బలారోవా గ్రామాన్ని పూర్తిగా కప్పేసింది.

ఇక ఇది పాటోబోహ్ గ్రామం బురద ధాటికి సర్వనాశనమైపోయింది. ఈ రెండు గ్రామాల్లో బీబీసీ ప్రతినిధులు పర్యటించారు.

ఈ చుట్టుపక్కల ప్రాంతాలపై బురద కెరటాల్లా విరుచుకుపడటంతో ఇక్కడున్న ఇళ్లన్నీ సగానికిపైగా బురదలో కూరుకుపోయాయి. కొందరు ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు.

మార్డీ మీస్ట్రో.. చావు అంచుల వరకూ వెళ్లివచ్చారు. భూకంపం తర్వాత బురద విరుచుకుపడిన 3-4 నిమిషాల తరువాత తానూ, తన కుటుంబ సభ్యులూ కట్టుబట్టలతో ఆ ప్రాంతం నుంచి పరుగెత్తామని ఆయన మాతో చెప్పారు. మర్డీ, అతని చుట్టుపక్కల వారు తమ శక్తిమేర ప్రయత్నించి కొన్ని వస్తువులను కాపాడుకోగలిగినా.. అవి ఎక్కువేం కాదు.

Image copyright Getty Images
Image copyright Getty Images

పాలు నగరంలో సునామీ బాధితులు సహనం కోల్పోయారు.

ఓ చిన్న సూపర్ మార్కెట్ లోపలికి చొరబడేందుకు బాధితులు ప్రయత్నించగా... పోలీసులు వాళ్లను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. అయితే, ఆ తరువాత కొద్ది సేపటికి పోలీసులకు జాలి కలగడంతో జనం ఒక్కసారిగా దుకాణంలోకి చొరబడ్డారు. భూకంప బాధితుల్లో చాలా మందికి ప్రభుత్వం కూడా ఎలాంటి సాయం అందించలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో వాళ్లు తమకు తామే ప్రయత్నిస్తుంటే పోలీసు యంత్రాంగం వారిని ఆపలేకపోతోంది .

పెట్రోల్ కోసం కనిపిస్తున్న భారీ క్యూ లైన్లు పరిస్థితులు చక్కబడుతున్నాయడానికి తొలి నిదర్శనం. ప్రతి సీసాకూ ప్రత్యేకంగా కేటాయించిన నెంబరుంది. వాటి యజమానులంతా నీడలో గంటల కొద్దీ వేచి ఉంటున్నారు.

ఉత్తరాన 50 కిలోమీటర్ల దూరంలో డొంగాల శిబిరంలో ఉన్న బాధిత కుటుంబాలకు రోజులు గడుస్తున్నప్పటికీ ఎలాంటి సాయం అందడం లేదు. దీంతో నిరాశతో ఉన్న వారంతా ఏది దొరికితే దాన్ని తీసుకెళ్తున్నారు.

Image copyright Getty Images
Image copyright Getty Images

సర్వం కోల్పోయిన వారిలో ఇప్పటి వరకు సుమారు 60 వేల మందికి మాత్రమే ఆహారం, వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వేలాది మంది పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే ఉంది.

సాయంగా అందిన ఆహారం, నీళ్లు, బట్టలు అన్నింటినీ బోటులోకి చేర్చి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు.

Image copyright Getty Images
Image copyright Getty Images

సహాయ సామాగ్రితో ఎయిర్ బేస్ నుంచి వెళ్తున్న ప్రతి విమానం తిరుగు ప్రయాణంలో.. ప్రమాద స్థలంలో ఉన్న బాధితుల్ని తీసుకొస్తోంది. మిగిలిన కొద్ది పాటి వస్తువుల్ని కొందరు తెచ్చుకుంటూ ఉండగా.. మరి కొందరు మాత్రం అక్కడే ఉంటూ కనిపించకుండా పోయిన తమ వారి ఆచూకీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ అంతులేని ఆవేదనను ఎవ్వరూ తీర్చలేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం తమనూ, తమ దేశాన్నీ ఎలాగైనా ఆదుకోవాలని ఇండోనేసియా ప్రజలు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)