ఇండోనేసియా సునామీ: 'మా అమ్మ ఏది? ఎక్కడికి వెళ్ళింది?' : BBC Ground Report

  • 5 అక్టోబర్ 2018
పసిపాప

ఇండోనేసియాలో శిథిలాల్లో చిక్కుబడిపోయిన వారిని వెదికేందుకు సాగిస్తున్న సహాయ చర్యలను అక్టోబర్ 5వ తేదీ శుక్రవారంతో నిలిపివేయనున్నారు. ఆ దేశంలో గతవారం వచ్చిన భూకంపం, సునామీలు ఎంతటి విధ్వంసం సృష్టించాయో తెలిసిందే. పాలూ, దాని పరిసర ప్రాంతాల్లో శిథిలాలకింద చిక్కుకున్న వారిలో దాదాపు ఇక ఎవరూ బతికుండే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. సులవెసి ద్వీపంలో లభించిన మృతదేహాలను స్వచ్ఛంద కార్యకర్తలు సామూహిక ఖననం చేస్తున్నారు. ఈ విపత్తు మూలంగా 14 వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఓ అంచనా.

ఇండోనేసియాలో తీవ్రంగా దెబ్బతిన్న ఈ ప్రాంతంలో ప్రజలు ఇప్పటికీ షాక్ లోంచి కోలుకోలేకపోతున్నారు.

కొన్నిభవనాలు కుప్పకూలాయి, మరికొన్నింటిని బురద ముంచెత్తింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో

నగరానికి తూర్పు వైపున ఉన్న పటోబో ప్రాంతమిది. భూకంపం వల్ల కొండకింది ప్రాంతంలోని వరిపొలాలు సర్వనాశనమయ్యాయి. ఫియోనా సోదరినీ, తల్లినీ బురద సజీవ సమాధి చేసింది. రెండేళ్లు కూడా లేని ఈ చిన్నారిని ఆమె సోదరుడు బురదలోంచి బయటికి లాగి కాపాడాడు. ఇప్పుడీ పాప బాగోగులన్నీ ఆమె పిన్ని చూస్తోంది.

‘‘అమ్మ ఎక్కడుంది? అమ్మ ఎక్కడికి వెళ్లింది? అని పాప అప్పుడప్పుడూ అడుగుతుంది. అమ్మ కోసం వెతుకుతున్నామని, దూర ప్రయాణానికి వెళ్లిందని ఆమెకు చెబుతుంటాను’’ అని పాప పిన్ని బీబీసీతో చెప్పారు.

ఈ ప్రాంతంలోని రోడ్డు, ఇళ్లు బురద మూలంగా నాశనమైపోయాయి. ఒక పొలంలోని మొక్కజొన్న పంట మైలు దూరానికి పైగా ప్రయాణించడం ఆశ్చర్యకరమైన విషయం. కనీసం రెండు గ్రామాలకు చెందిన శిథిలాలన్నీ ఒక చోట పోగు పడ్డాయి. ఈ ప్రాంతాన్ని బీబీసీ బృందం పరిశీలించింది.

శవం దొరికితే సొంతూరికి తీసుకెళ్లాలని..

ఒక క్రైస్తవ అధ్యయన కేంద్రం పునాదులతో సహా ధ్వంసమైంది. అంతకుముందు ఇక్కడ రెండు వందల మంది విద్యార్థులు ఉండేవారు.

చర్చి ముందు వైపున్న స్తంభాలు మూలలతో సహా బయటికొచ్చేశాయి. అంటే ప్రమాదం ఎంత తీవ్రమైందో ఊహించవచ్చు. దీని కాంక్రీట్ కప్పు కూలిపోయింది. ఈ శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారో ఇప్పటికీ తెలియదు.

ఇక్కడ చదువుకునే విద్యార్థుల్లో గాబ్రియెల్ రియన్ కుమారుడు ఒకరు. అతడికి పదిహేడేళ్లు. అతడు చనిపోయి ఉండొచ్చని గాబ్రియెల్ నమ్ముతున్నారు. కనీసం కుమారుడి మృతదేహాన్నైనా కనుగొనాలని అతడు ఆశిస్తున్నారు. శవం దొరికితే సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాలనుకుంటున్నారు. ఈ నగరంలోని ప్రజలు ఎంతగా నష్టపోయారో అంచనా వేయడం అసాధ్యం. ఇప్పుడు సాయం అందుతోంది. అయితే వారికి చాలా కాలం పాటు ఆసరా కావాలి.

భారతదేశ సహాయం

సునామీతో దెబ్బతిన్న ఇండోనేసియాకు ఇప్పటి వరకు 20 దేశాలు సాయం అందించేందుకు సిద్ధమయ్యాయి. సునామీ వల్ల జరిగిన నష్టం, అందాల్సిన సాయంపై ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది.

సహాయ సామాగ్రితో ఇండోనేషియా వెళ్లిన భారత వాయు సైన్యానికి చెందిన సీ-17 విమానం బాలిపపన్ విమానాశ్రయం చేరుకొని ఇండోనేషియా అధికారులకు సహాయ సామాగ్రిని అందించింది. భూకంపంతో తీవ్రంగా ధ్వంసమైన పాలు విమానాశ్రయంలో ఈ విమానం దిగే పరిస్థితి లేనందున బాలిపపన్‌లో దిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)