‘పోలియో వ్యాక్సిన్‌ కలుషితమైంద'నే ప్రచారంలో నిజమెంత?

  • ప్రవీణ్ కాసం
  • బీబీసీ ప్రతినిధి
పోలియో చుక్కలు

ఫొటో సోర్స్, NOAH SEELAM

''రేపు 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి పోలియో చుక్కలు వేయించొద్దు..దాంట్లో వైరస్ కలిసిందంటా.. పోలియోని తయారు చేసిన ఆ కంపెనీ యజమానిని అరెస్టు చేశారు. దయచేసి అందరికి చెప్పగలరు'' గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతున్న మెసేజ్ ఇది.

ఈ సోషల్ మీడియా మెసేజ్‌ల కారణంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలనుకుంటున్న తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోంది.

ఇంతకీ ఈ వార్త నిజమేనా? పోలియో వ్యాక్సిన్‌లో వైరస్ కలిసిందా? ఇప్పుడు పోలియో చుక్కలు వేయించడం సురక్షితం కాదా? ప్రభుత్వం ఏమంటోంది? అసలు నిజం ఏమిటి?

అసలేం జరిగిందంటే..

దేశంలో నాలుగు ఫార్మాసూటికల్ కంపెనీలు మాత్రమే పోలియో వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. అందులో ఒకటి ఘాజియాబాద్ కేంద్రంగా ఉన్న బయోమెడ్ కంపెనీ. అయితే, ఇందులో తయారైన కొన్ని బ్యాచ్‌ల ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ఓపీవో) లో టైప్-2 పోలియో వైరస్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

దీంతో వెంటనే స్పందించిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీకి నోటీసులు ఇచ్చింది. యజమానిని అరెస్టు చేయించింది.

ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన బ్యాచ్‌ నంబర్‌-బీ10048లోని 1.5 లక్షల కలుషిత వ్యాక్సిన్లను మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లకు పంపించినట్లు తెలుసుకున్న కేంద్రం.. వాటిని వెనక్కి రప్పించింది.

ఫొటో సోర్స్, Getty Images

పోలియో టైప్ 2 వైరస్ కలుషితమవడం అంటే ఏమిటి?

పోలియోలో టైప్ 1, 2, 3 అనే మూడు రకాల వ్యాక్సిన్లు ఉంటాయి. ప్రసుతం టైప్ 1, టైప్ 3 వ్యాక్సిన్లు మాత్రమే భారత్‌లో వినియోగంలో ఉన్నాయి.

పోలియో వైరస్ టైప్ 2 ఇప్పుడు ఉనికిలోనే లేదు. 2016లోనే ప్రపంచవ్యాప్తంగా దీన్ని నిర్మూలించినట్లు 2016లో జీసీసీ (ది గ్లోబల్ కమిషన్ ఫర్ ది సర్టిఫికేషన్ ఆఫ్ పోలియో ఎరాడికేషన్) ప్రకటించింది.

ఈ వైరస్‌ను చివరిసారిగా 1999లో భారత్‌లోనే గుర్తించారు. కానీ, 2016 వరకు వేచి చూసి ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో ఈ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించారు.

2012లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను పోలియోరహిత దేశంగా ప్రకటించింది. దీంతో దేశంలో నిల్వ ఉన్న టైప్‌-2 స్ట్రెయిన్‌ పోలియో వ్యాక్సిన్లను కేంద్రం ధ్వంసం చేసింది.

కానీ, ఘాజియాబాద్‌ కంపెనీ ఈ టైప్‌-2 వ్యాక్సిన్‌ను సరఫరా చేసింది. అధికారులు పరిశీలన తర్వాతే ఈ విషయం వెలుగు చూసింది. దీంతో ఆ వాక్సిన్లను వెనక్కి తీసుకుంది.

అయితే, 2016 నుంచి ఈ కంపెనీ సరఫరా చేసిన వ్యాక్సిన్లు ఎంతమంది పిల్లలకు వేయించారనేది తెలియదు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ వ్యాక్సిన్లు వేయిస్తే ప్రమాదమా?

పిల్లలకు కలుషితమైన పోలియో చుక్కలు వేయించామని ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాని వల్ల ఎటువంటి సమస్యా ఉత్పన్నం కాదని పేర్కొంది.

కలుషిత పోలియో చుక్కల మందు వాడామని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ కూడా ఒక ప్రకటనలో తెలిపింది.

టైప్ 2 పోలియో వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధకశక్తి భారత్‌లో బలంగా ఉందని, తల్లిదండ్రులు ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అధ్యక్షుడు డాక్టర్ సంతోశ్ టి సోహన్స్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

'తెలంగాణకు వచ్చిన వ్యాక్సిన్లు వెనక్కి పంపాం'

ఘాజియాబాద్ కంపెనీ ఉత్పత్తి చేసిన బ్యాచ్‌ నంబర్‌-బీ10048లోని వ్యాక్సిన్లు తెలంగాణకు వచ్చినట్లు కేంద్రం గుర్తించిందని, కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఆ వ్యాక్సిన్లను వెనక్కి పంపామని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్‌ శ్రీనివాసరావు బీబీసీకి తెలిపారు.

రాష్ట్రంలో చిన్నారులకు ఎలాంటి ముప్పులేదని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎలాంటి అనుమానాలు లేకుండా రాష్ట్రంలోని పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)