నోబెల్ ప్రైజ్-2018: భూతాపం, ఆర్థికాభివృద్ధి మధ్య సంబంధాన్ని ఆవిష్కరించిన పరిశోధకులకు ఆర్థికశాస్త్రంలో నోబెల్

  • 8 అక్టోబర్ 2018
విలియం నోర్దాస్ Image copyright Yale
చిత్రం శీర్షిక విలియం నోర్దాస్

వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసిన విలియం నోర్దాస్, పాల్ రోమర్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది.

భూతాపం, ఆర్థికాభివృద్ధి మధ్య సంబంధాన్ని ఈ అమెరికా ఆర్థికవేత్తలు విశ్లేషించారు.

ప్రస్తుత కాలంలో ఎదురవుతున్న మౌలిక, కీలక సమస్యలకు వీరు పరిష్కారాలు వెతికారంటూ నోబెల్ బహుమతి అందించే 'రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' వీరిని ప్రస్తుతించింది.

వీరికి 90 లక్షల స్వీడిష్ క్రోనాలు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.7.32 కోట్లు) బహుమతి మొత్తంగా దక్కుతాయి.

యేల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నోర్దాస్, ఇంతవరకూ ఎవరూ చేయని విధంగా వాతావరణం-ఆర్థిక వ్యవస్థల పరస్పర సంబంధాన్ని సూచించే నమూనాను రూపొందించిన తొలి పరిశోధకుడని అకాడమీ తెలిపింది.

న్యూయార్క్ యూనివర్సిటీ అనుబంధ స్టెర్న్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ రోమర్, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల విషయంలో సంస్థలు సుముఖత వ్యక్తంచేయడాన్ని ఆర్థిక శక్తులు ఎలా నియంత్రిస్తాయన్నది వివరించారు.

Image copyright AFP/getty
చిత్రం శీర్షిక పాల్ రోమర్

ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ పదవికి రాజీనామా

కాగా ఈ ఏడాది ప్రొఫెసర్ రోమర్ ప్రపంచ బ్యాంకులో కీలక పదవి నుంచి వైదొలగి వివాదాస్పదమయ్యారు. ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ పదవి చేపట్టిన ఆయన కేవలం 15 నెలల్లోనే రాజీనామా చేశారు.

'వ్యాపార నిర్వహణ' సూచీలో చిలీ ర్యాంకింగ్ విషయంలో ఆయన అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఆ దేశ సోషలిస్ట్ అధ్యక్షురాలు మిషెల్లె బాషిలెట్ నేతృత్వంలో రాజకీయ కారణాలతో నివేదికలో చిలీ ర్యాంకింగులో మతలబు చేసినట్లుగా అప్పుడాయన ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు