జన్యుపరీక్ష: ‘రూ.4వేలతో మీకు ‘గుండెపోటు’ వస్తుందా లేదా ముందే తెలుసుకోవచ్చు’

  • 10 అక్టోబర్ 2018
యువత, గుండెపోటు Image copyright ISTOCK

పుట్టుకతోనే గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉన్న వారిని ఒక జన్యు పరీక్షతో గుర్తించవచ్చని పరిశోధకులు ఒక అధ్యయనంలో కనుగొన్నారు.

జీనోమిక్ రిస్క్ స్కోర్ (జీఆర్ఎస్) అని వ్యవహరిస్తున్న ఈ పరీక్ష ఖరీదు కేవలం 40 పౌండ్లు (సుమారు రూ. 4000).

ఎక్కువ కొవ్వు వంటి సంప్రదాయ హేతువులు కనిపించని వారికి కూడా గుండె పోటు ఎందుకు వస్తుందనేది తెలుసుకునేందుకు ఈ పరీక్ష ఉపకరిస్తుంది.

ఈ పరీక్ష ఆలోచనను అమలులోకి తేవటానికి ఇంకా కృషి చేయాల్సి ఉందని నిపుణులు అంటున్నారు.

ముప్పును ముందుగానే గుర్తించటం

జీఆర్ఎస్‌ను ఏ వయసులోనైనా లెక్కించవచ్చు. ఎందుకంటే.. మనుషుల డీఎన్ఏ మారదు. అంటే.. పిల్లలకు కూడా ఈ పరీక్ష నిర్వహించవచ్చు.

ఈ పరీక్ష.. వారసత్వంగా వచ్చిన ఏదో ఒక జన్యువును కాకుండా.. ముప్పును సూచించే జన్యు క్రమాన్ని వెదుకుతుంది.

ఈ అధ్యయనంలో పరిశోధకులు కొందరి రక్త నమూనాలను పరీక్షించారు. అయితే.. నోటిలోని లాలాజలం నమూనాలతోనూ ఈ పరీక్షను నిర్వహించవచ్చని వారు చెప్తున్నారు.

బ్రిటన్‌లోని యూకే బయోబ్యాంక్‌లో 40 ఏళ్ల నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న ఐదు లక్షల మంది జీనోమ్ సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు ఈ జీఆర్ఎస్ పరీక్షను రూపొందించారు.

ఆ ఐదు లక్షల మందిలో 22,000 మందికి హృద్రోగాలున్నాయి.

Image copyright Getty Images

సుమారు సగం హృద్రోగాలు జన్యు సంబంధితమైనవి లేదా వారసత్వంగా వచ్చినవైతే.. మిగతా సగం జీవనశైలి లేదా పర్యావరణ సంబంధితమైనవని.. బేకర్ హార్ట్ అండ్ డయాబెటిస్ ఇన్‌స్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌కు చెందిన ప్రధాన రచయిత డాక్టర్ మైకేల్ ఇనోయ్ చెప్పారు.

''ముప్పును పసిగట్టటంలో ఒక జన్యుసంబంధిత అంశాన్ని చాలా కాలంగా గుర్తించలేదు'' అని ఆయన అంటారు.

ఈ అధ్యయనంలో జీఆర్ఎస్ అత్యధికంగా ఉన్న 20 శాతం మందిలో.. తక్కువగా ఉన్న 20 శాతం మంది కన్నా నాలుగు రెట్లు అధికంగా హృద్రోగాలు వచ్చే అవకాశముందని గుర్తించారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణ కారకాల్లో హృద్రోగం ప్రధమ స్థానంలో ఉంది. బ్రిటన్‌లో ఏటా 66,000 మంది దీనివల్ల చనిపోతున్నారు.

Image copyright Science Photo Library

40 ఏళ్ల వయసులోని వ్యక్తులకు హృద్రోగాల ముప్పును అంచనా వేయటంలో ఖచ్చితత్వం ఉండదని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన సీనియర్ ఆథర్ ప్రొఫెసర్ సర్ నీలేశ్ సమాని పేర్కొన్నారు.

లక్షణాలు రావటానికన్నా కొన్ని దశాబ్దాల ముందే వ్యాధి పరిస్థితులు మొదలవుతాయి కనుక.. ఆ ముప్పు ఉన్న వారిని ఇంకా ముందుగానే గుర్తించాల్సిన అవసరముందని.. ఆ పని జీఆర్ఎస్ చేయగలదని ఆయన అంటున్నారు.

వైద్య చికిత్స వల్ల ప్రయోజనం పొందగల రోగులను గుర్తించటానికి, అవసరం లేని వారికి అనవసర పరీక్షలు, చికిత్సలను నివారించటానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుందని నీలేశ్ సమాని చెప్పారు.

ఈ పరీక్షను అందుబాటులోకి తేవటానికి మరింత కృషి జరగాల్సి ఉందని డాక్టర్ ఇనోయ్ చెప్పారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)